దేదీప్యమానం.. లక్ష దీపోత్సవం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన.. కోటిలింగాల రేవు.. లక్ష దీపాలు ఒక్కసారిగా వెలిగిన వేళ.. దేదీప్యమానంగా మెరిసిపోయింది. పవిత్ర కార్తిక మాసంలో మహాశివుడికి ప్రీతికరమైన సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ సీతారామ దేవస్థానం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యాన 12వ లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల శివ నామస్మరణతో గోదావరి తీరం ప్రతిధ్వనించింది. కోటిలింగాల రేవులో మెట్లపై ఏర్పాటు చేసిన మట్టి ప్రమిదల్లో భక్తులు దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు. రేవులో ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. వేదికకు ఇరువైపులా పువ్వులు, విద్యుద్దీపాలతో చేసిన అలంకరణలు, శివలింగాలు, వివిధ దేవతల ఏర్పాటు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, స్థానిక ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి విజయలక్ష్మి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దంపతులు, పలువురు అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు. అతిథులకు ట్రస్టు చైర్మన్, సీసీసీ ఎండీ పంతం కొండలరావు ఘన స్వాగతం పలికారు. ప్రముఖుల చేతుల మీదుగా మహాశివునికి, గోదావరి మాతకు 3 దశలుగా హారతులు ఇచ్చారు. భక్తులకు నిర్వాహకులు ప్రమిదలు, వత్తులు, నూనె సరఫరా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment