ఆగనున్న ఆపద్బాంధవి
ఫ సమ్మెకు సమాయత్తమవుతున్న 108 ఉద్యోగులు
ఫ 25 నుంచి విధుల బహిష్కరణకు సిద్ధం
ఫ ఇప్పటికే జిల్లా అధికారులకు నోటీసులు
ఫ ప్రతి రోజూ వినూత్న రీతిలో పోరాటం
ఫ మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో నిర్ణయం
సాక్షి, రాజమహేంద్రవరం: అత్యవసర వైద్యంపై కూటమి ప్రభుత్వం కన్నెర్ర జేస్తోంది. ఆపదలో చిక్కుకున్న వారికి, అత్యవసర వైద్యం పొందే వారికి ఆపద్బాంధవులుగా నిలుస్తున్న ఉద్యోగులపై అక్కసు ప్రదర్శిస్తోంది. మూడు నెలలుగా వేతనాలు మంజూరు చేయకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో ఆగ్రహించిన 108 అంబులెన్స్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. విధులు బహిష్కరించి రోడ్డెక్కనున్నారు. ఇప్పటికే ప్రతి రోజూ వినూత్న పద్ధతిలో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు ఈ నెల 25వ తేదీలోగా సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళతామని స్పష్టం చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అత్యవసర సేవలు అందిస్తున్నా సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ భారం మోయలేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి, జీఓ నంబర్ 49 అమలు తదితర సమస్యలు దీర్ఘ కాలంగా వారిని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి సమ్మె చేయాలని 108 ఉద్యోగ సంఘ నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు నోటీసులు అందజేశారు.
కుటుంబ పోషణ.. భారం
108 సిబ్బంది అత్యవసర విధుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరు రోజుకు 12 గంటల పాటు పని చేయాల్సి వస్తోంది. అదనంగా చేసే పనికి గాను ప్రభుత్వం వారికి ఎటువంటి అదనపు చెల్లింపులూ చేయడం లేదు. ఒక్కో వాహనానికి కనీసం ఆరుగురు ఉద్యోగులు రెండు షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుంది. సిబ్బంది కొరత ఉన్నా అలాగే నెట్టుకొస్తున్నారు. ఏ ఉద్యోగీ వారాంతపు సెలవు తీసుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పండగలు అస్సలు ఉండటం లేదు. డ్యూటీ వేసిన మరుక్షణం వెళ్లిపోవాల్సిందే. అంత యాతన అనుభవించి పని చేస్తున్నా.. సకాలంలో జీతాలు అందకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. కక్ష సాధింపులో భాగంగా అరబిందో సంస్థకు కూటమి ప్రభుత్వం నిధులు చెల్లించడం నిలిపివేసింది. దీంతో సంస్థ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. 108లో పని చేస్తున్న ఈఎంటీ, పైలట్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ వేతనం అందుతోంది. సూపర్‌వైజర్లకు రూ.30 వేలు, మేనేజర్లకు రూ.50 వేలు చెల్లిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల వేతనాలు ఇంతవరకూ అందకపోవడంతో వారికి ఆకలి కేకలు తప్పడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.
ఇవీ డిమాండ్లు
ఫ 108 సేవల సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించి, నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి.
ఫ జీఓ నంబర్ 49ని పునరుద్ధరించాలి. పైలట్ గ్రాట్యుటీ, ఆర్జిత సెలవుల మొత్తం, వార్షిక ఇంక్రిమెంట్ చెల్లించాలి.
ఫ 108 ఉద్యోగులకు ప్రతి నెలా జీతాల చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందువలన ప్రతి నెలా 5వ తేదీలోపే జీతాలు చెల్లించాలి.
ఫ షిఫ్టుల పద్ధతి అమలు చేయాలి. 12 గంటలు పని చేయడంతో ఒత్తిడి పెరిగి ఉద్యోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో 108 ఉద్యోగులకు కూడా 8 గంటల పని విధానం అమలు చేయాలి.
ఫ జీతంపై 40 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఎరియర్లు వేతనంతో జమ చేయాలి.
ఫ వైద్య, ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో సర్వీసుకు అనుగుణంగా వెయిటేజ్ మార్కులు ఇవ్వాలి.
ఫ ఈపీఎఫ్‌కు సంబంధించి యాజమాన్య వాటా సొమ్మును యాజమాన్యమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
ఫ వేతన స్లాబ్‌లలో మార్పులు తీసుకురావాలి.
ఫ 108 వాహనాలకు సమయానికి మరమ్మతులు చేయడం లేదు. దీంతో వాహనాలు కండిషన్ తప్పుతున్నాయి. వాహనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించాలి.
ఫ రిలీవింగ్ బిల్లులు, ఎలక్ట్రికల్ బిల్లులు, వాహన మైనర్ మరమ్మతు బిల్లులు, ఉద్యోగులకు చెల్లించాల్సినవి వెంటనే చెల్లించాలి.
ఫ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
ఫ అత్యవసర సేవలకు మాత్రమే 108ను వినియోగించేలా చర్యలు చేపట్టాలి. సిబ్బంది కొరతను అధిగమించాలి.
ఫ ప్రతి మండల కేంద్రంలోనూ సిబ్బందికి కనీస అవసరాలతో కూడిన శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం దిగి రాకపోతే సమ్మె
అత్యవసర సమయాల్లో వైద్య సే వలందిస్తున్నా మాకు సకాలంలో వేతనాలు అందడంలేదు. మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీ సుకుని వెళ్లాం. ప్రభుత్వం దిగి రాకపోతే ఈ నెల 25 నుంచి సమ్మె బాట పడతాం. మా బాధలు ప్రభుత్వానికి తెలిసేలా ఇప్పటికే వినూ త్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం.
– రమణ,
108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
అత్యవసర సేవలకు బ్రేక్!
108 ఉద్యోగుల సమ్మె ఆరంభమైతే జిల్లాలో ప్రమాదాల్లో చిక్కుకున్న వారికి అత్యవసర సేవలు అందని పరిస్థితి ఏర్పడనుంది. జిల్లా వ్యాప్తంగా 108 వాహనాలు 21 ఉన్నాయి. 99 మంది డ్రైవర్లు, ఎమర్జెన్సీ టెక్నీషియన్లు విధులు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అత్యవసర వైద్య సేవలు అందించడంలో వీరు కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతి నెలా 60 వేల మందికి పైగా రోగులు వివిధ రకాల వైద్య సేవలు పొందుతున్నారు. 108 ఉద్యోగులకు సంబంధించి పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఉద్యోగుల రాష్ట్ర యూనియన్ సమ్మె సైరన్ మోగించింది. ఈ మేరకు 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి, ఎంపీడీఓ, తహసీల్దార్లకు సమ్మె నోటీసులు ఇచ్చారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న ఈ సమ్మెకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె ఆగదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment