అబద్ధాల ఫ్యాక్టరీ టీడీపీ | - | Sakshi
Sakshi News home page

అబద్ధాల ఫ్యాక్టరీ టీడీపీ

Published Tue, Nov 19 2024 12:37 AM | Last Updated on Tue, Nov 19 2024 12:37 AM

అబద్ధాల ఫ్యాక్టరీ టీడీపీ

అబద్ధాల ఫ్యాక్టరీ టీడీపీ

సూపర్‌–6 బూటకం

చంద్రబాబు అబద్ధాలు బడ్జెట్‌లోనే తేలిపోయాయి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు

యర్నగూడెంలో పార్టీ సమావేశం

భారీగా తరలివచ్చిన శ్రేణులు

దేవరపల్లి: టీడీపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. మాజీ హోం మంత్రి, పార్టీ గోపాలపురం నియోజకవర్గం ఇన్‌చార్జి తానేటి వనిత అధ్యక్షతన యర్నగూడెంలోని ఆర్‌ కన్వెక్షన్‌ ఫంక్షన్‌ హాలులో సోమవారం జరిగిన వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబు అబద్ధాలు బడ్జెట్‌లోనే తేలిపోయాయని చెప్పారు. సూపర్‌–6 అంతా బూటకమని, మహిళలకు ఉచిత బస్సు ఎక్కడా కనిపించడం లేదని, ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ మొక్కుబడిగా జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో చట్టవిరుద్ధ పాలన జరుగుతోందని, చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు కార్యకర్తలు పోరాడాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసంబద్ధమైన పోస్టులు పెట్టవద్దని, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎండగట్టే విధంగా పోస్టులు పెట్టాలని సూచించారు. వైఎస్సార్‌ ఆశయ సాధన కోసం వైఎస్సార్‌ సీపీ పుట్టిందని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు నేరుగా సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చునని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కోరారు. కార్యకర్తలకు, నాయకులకు, సోషల్‌ మీడియా సైనికులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజకీయ వ్యవస్థలో కార్యకర్తలు గొప్పవారని, రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు బలం పుంజుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైన్యం ధైర్యంగా ఉండాలని వేణు పిలుపునిచ్చారు.

రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలి

మాజీ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని అన్నారు. వైఎస్సార్‌ సీపీ ఉండకూడదనే కక్షతో టీడీపీ కూటమి ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కోసం కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా మని భరోసా ఇచ్చారు. మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకుని, ఉత్సాహంగా పని చేసే కార్యకర్తలకు జిల్లా, రాష్ట్ర కమిటీల్లో స్థానం కల్పిస్తామని ఆమె తెలిపారు. వైఎస్సార్‌ సీపీ రామహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, టీడీపీ కూటమి అమలు చేయలేని అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లనే మనం ఓడిపోయామని అన్నారు. గెలుపు ఓటములు సహజమని, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని అన్నారు. రానున్న రోజుల్లో జగ న్‌ నాయకత్వంలో కార్యకర్తల చేతులతో నడిచే ప్రభు త్వం వస్తుందని చెప్పారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీలు కేవీకే దుర్గారావు, ఉండవల్లి సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యులు పొట్టి స్వర్ణలత, కాకులపాటి లలిత, శామ్యేలు, ముప్పిడి లక్ష్మి, పార్టీ మండల అధ్యక్షులు కూచిపూడి సతీష్‌, గగ్గర శ్రీనివాస్‌, ప్రతాపనేని వాసుబాబు, పోతిరెడ్డి నాగరాజు, మండల మహిళా అధ్యక్షులు కడలి హైమావతి, ఆరేళ్ల లక్ష్మి, నాగమణి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గన్నమని జనార్దనరావు, రాష్ట్ర అతిరాస కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఇళ్ల భాస్కరరావు, జిల్లా అధికార ప్రతినిధి ఎస్‌కే వల్లీ, నియోజకవర్గ అధికార ప్రతినిధి గడా జగదీష్‌, రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ చెలికాని రాజబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఎన్‌.రాజేంద్రబాబు, నేతలు తొమ్మండ్రు రమేష్‌, బంకా అప్పారావు, కారుమంచి రమేష్‌, వెలగా శ్రీరామూర్తి, సాలి వేణు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement