రాష్ట్రాల్లో అవకాశం చిక్కినచోటల్లా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచి, అధికారాన్ని చేజిక్కించు కోవటం అలవాటైన బీజేపీకి తొలిసారి సంకటస్థితి వచ్చిపడింది. హస్తినకు కూతవేటు దూరంలోవున్న హరియాణాలో ఆ పార్టీ ప్రభుత్వం సమస్యల్లో చిక్కుకుంది. సార్వత్రిక ఎన్నికల వేళ... రోడ్ షోలతో హోరెత్తించాల్సిన సమయంలో బీజేపీకి ఇదేమంత మంచి శకునం కాదు. అసలే ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడిందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కనుక హరియాణా మాత్రమే కాదు... ఎన్నికలు జరగాల్సిన వేరే రాష్ట్రాల్లో కూడా వోటర్లకు వేరే సంకేతాలు వెళ్తాయి.
ఈ నెల 25న ఆ రాష్ట్రంలోని పది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా మంగళవారం ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. పైకి గంభీరంగా కనబడుతున్నా లోక్‌సభ ఎన్నికల హడావుడిలో తలమునకలైన బీజేపీకి దీంతో ఊపిరాడటం లేదు. ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇద్దరు బీజేపీ సభ్యులు రాజీనామా చేయటంతో అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం సాగాలంటే బీజేపీకి 45 మంది మద్దతు అవసరం కాగా ఇద్దరు ఇండిపెండెంట్లు, హరి యాణా లోక్‌హిత్ పార్టీ సభ్యుడు బీజేపీకి మద్దతునిస్తున్నారు. అంటే బీజేపీ బలం 43కి పడిపోయింది.
రెండు నెలల క్రితం బీజేపీ–జేజేపీ కూటమి సర్కారుకు నాయకత్వం వహిస్తున్న ఖట్టర్‌ను తొలగించి ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం నయాబ్‌సింగ్ సైనీని తీసుకొచ్చింది. దాంతోపాటు పదిమంది ఎమ్మెల్యేలున్న జన్‌నాయక్ జనతాపార్టీ (జేజేపీ)తో తెగతెంపులు చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వున్న పది స్థానాలూ గెల్చుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో జేజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వదల్చుకోలేదు. సహజంగానే అంతవరకూ ఉపముఖ్యమంత్రిగా వున్న జేజేపీ నేతదుష్యంత్ చౌతాలాకు ఇది ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా చలవతోనే ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించు కున్నారన్నది వాస్తవం.
అయితే కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే మద్దతిస్తామంటున్న జేజేపీ వాస్తవ బలమెంతో చెప్పలేం. ప్రస్తుత బేరసారాల్లో ఆ పార్టీకున్న పదిమంది ఎమ్మెల్యేల్లో ఎందరు మిగులుతారన్నది అనుమానమే. వారిలో నలుగురి మద్దతు తమకే వున్నదని సైనీ చెప్పు కుంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని జేజేపీ కోరినా అది బీజేపీకే తోడ్పడుతుంది. ఉన్న 88 మందిలో నలుగుర్ని అనర్హులను చేయగానే సభలో సభ్యుల సంఖ్య 84కి పడిపోతుంది. దాంతో 43 మంది మద్దతున్న బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా బయటపడుతుంది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుండగా ప్రభుత్వ అస్తిత్వానికే ముప్పు ఏర్పడటం హరి యాణా ప్రజానీకానికి మంచి సంకేతం పంపదు. ఎమ్మెల్యేల బేరసారాలు కళ్లముందు స్పష్టంగా కన బడుతుండగా సుదీర్ఘ క్యూ లైన్‌లలో ఓపిగ్గా నిలబడి వోటేసేంత ఉత్సాహం ఎందరికుంటుంది? వచ్చే అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ కుర్చీలాట మొదలుకావటం వింత. రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనటానికి ఈ సంక్షోభం సంకేతమని కాంగ్రెస్ నాయకుడు హుడా చెబుతున్నారు. నిజానికి జనం అలా అను కోవాలని, లోక్‌సభ ఎన్నికల్లో తమకే పట్టం కట్టా లని ఆయన ఆత్రుత పడుతున్నారు.
ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులకు ఎవరు పాల్పడినా తప్పే. వేరే రాష్ట్రాల్లో బీజేపీ చేసినప్పుడు విమర్శించిన కాంగ్రెస్ హరియాణాలో అదే పనికి పూనుకోవటం నైతికంగా సరైందేనా? రాష్ట్రపతి పాలన కాంగ్రెస్ ఉద్దేశమని కొందరంటున్నారు. అందుకే మద్దతిస్తా మంటూ జేజేపీ ముందుకొచ్చినా హుడా సాను కూలత చూపలేదని వారి వాదన. లోక్‌సభ ఎన్నికల జంజాటం లేకపోతే కొన్ని గంటల్లోనే బీజేపీ సునాయాసంగా చక్కదిద్దగలిగేది. కేంద్రంలో తాముండగా హరియాణాలో సొంత ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనకు బీజేపీ సిద్ధపడటం కల్ల.
ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయపై పడింది. బీజేపీకి లబ్ధి చేకూరేందుకు వీలుగా ప్రస్తుత ఎన్నికలు ముగిసేవరకూ సంక్షోభాన్ని కొనసాగించటం మాత్రం మంచిది కాదు. పాలకపక్షం సత్తాపై సంశయం ఏర్పడినప్పుడు నేరుగా అసెంబ్లీలోనే బలపరీక్షకు సిద్ధపడాలని కోరటం అన్నివిధాలా శ్రేయస్కరం. సంక్షోభాన్ని కొనసాగనిస్తే అనారోగ్యకర పరిణా మాలకు చోటిచ్చినట్టవుతుంది. ప్రభుత్వాల బలాబలాలు చట్టసభల్లో తేలాలి తప్ప రాజ్‌భవన్‌లలో కాదని చాన్నాళ్ల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ వెంటనే బలపరీక్ష నిర్వహించటం సాధ్యంకాదనిపిస్తే కొంత వ్యవధి తీసుకోవచ్చు.
అయితే ఈలోగా రాష్ట్రపతి పాలన విధించటమే ఉత్తమం. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంజాబ్ రైతులతోపాటు హరియాణా రైతులు కీలక పాత్ర పోషించారు. ఇటీవలి రైతు ఉద్యమంలో కూడా వారి పాత్ర తక్కు వేమీ కాదు. రిజర్వేషన్లు కావాలంటూ 2016లో జాట్‌లు సాగించిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. అది కులాల మధ్య కుంపట్లు రాజేసింది. మరోపక్క ఉపాధి అవకాశాలు కరువై యువ తలో తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.
ఖట్టర్‌ను సీఎం పదవి నుంచి తొలగించి సైనీని ప్రతిష్టించటం జాట్‌లకు ఆగ్రహం కలిగించిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపు టెత్తుల్లో అధికార, విపక్షాలు రెండూ తలమునకలైతే ఇప్పటికే ఉన్న సమస్యలు రెట్టింపవుతాయి. కనుక ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే కోణంలో కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలి.
Comments
Please login to add a commentAdd a comment