సృష్టిలో ప్రకృతికి వికృతి ఉంటుంది. ప్రతి సృష్టికీ దానికి దీటైన ప్రతిసృష్టి కూడా ఉండనే ఉంటుంది. సహజమైన సృష్టి ప్రకృతి అయితే, మానవులు తమ అమోఘ మేధతో చేసిన ప్రతిసృష్టి వికృతి. సృష్టికి పోటీగా ప్రతిసృష్టి చేయాలనే తపన మానవులకు యుగాల కిందటే మొదలైంది. మానవులకు ఉన్న ఈ తపన వారి కల్పనల్లో ప్రతిఫలించింది. పురాణాలు మొదలుకొని ఆధునిక సాహిత్యం వరకు ప్రతిసృష్టి కల్పనలు కోకొల్లలుగా కనిపిస్తాయి.
ప్రతిసృష్టికి ఉదాహరణ మన పురాణాల్లోనే కనిపిస్తుంది. అదే– విశ్వామిత్ర సృష్టి. త్రిశంకుడి కోసం విశ్వామిత్రుడు ఏకంగా స్వర్గానికే నకలును సృష్టించాడు. విశ్వామిత్రుడు సృష్టించిన త్రిశంకుస్వర్గం దేవేంద్రుడి స్వర్గానికి ఏమాత్రమూ తీసిపోదు. కాకుంటే, కర్మకొద్ది త్రిశంకుడే అందులో తలకిందులుగా వేలాడుతూ నిలిచిపోయాడు. తన కోసం సృష్టించిన స్వర్గంలో తానే తలకిందులుగా వేలాడే దుర్గతి తటస్థించడమే ప్రతిసృష్టిలోని వికృతి!
కృత్రిమ మేధతో పనిచేసే మరమనిషి ప్రస్తావన గ్రీకు పురాణాల్లో కనిపిస్తుంది. హిఫీస్టస్ అనే గ్రీకుల దేవుడు క్రీట్ దీవిని రక్షించడానికి టాలోస్ అనే భారీ కంచు మరమనిషిని సృష్టించాడు. హిఫీస్టస్ మన భారతీయ పురాణాల్లోని విశ్వకర్మలాంటి వాడు. శిల్పులు, లోహశిల్పులు వంటి వారికి, అగ్నిపర్వతాలకు అధిదేవుడు. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందిన గ్రీకు కవి అపలోనీయస్ ఆఫ్ రోడ్స్ రాసిన ‘ఆర్గనాటికా’ కావ్యంలోనిది ఈ గాథ.
ఈ కావ్యంలోనే ఒళ్లంతా బంగారమే గల మరమగువల గురించి కూడా వర్ణించాడు. వాళ్లను కూడా హిఫీస్టస్ సృష్టించాడు. ‘ఆర్గనాటికా’ గాథ ప్రకారం– హిఫీస్టస్ సృష్టించిన టాలోస్‌ను క్రీట్ రాజు జూస్ తన కొడుకు మైనోస్‌కు బహుమతిగా ఇచ్చాడు. మైనోస్ నియంతగా మారి టాలోస్‌ను తన శత్రువులను నిర్మూ లించడానికి వాడుకున్నాడు. కృత్రిమ మేధ శక్తిని, దుర్మార్గుల చేతిలో పడితే దానివల్ల వాటిల్లగల ప్రమాదాలనూ అపలోనీయస్ ఎంతో ముందుగానే ఊహించడం విశేషం.
‘ఆర్గనాటికా’ గాథకు ఇరవైమూడు శతాబ్దాల తర్వాత గాని ‘రోబో’ అనే మాట పుట్టలేదు. చెక్ రచయిత కారల్ కాపెక్ 1920లో రాసిన నాటకం ‘రోసమ్స్ యూనివర్సల్ రోబో’ ద్వారా ‘రోబో’ అనే మాటను వాడుకలోకి తెచ్చాడు. అప్పటి నుంచి మరమనిషికి ‘రోబో’ అనే మాట ఇంగ్లిష్‌లోకి వచ్చింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చింది.
క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన గ్రీకు మేధావి అరిస్టాటిల్ కూడా కృత్రిమ మేధ గురించిన ఆలోచనలు చేశాడు. ఆయన తన ‘పాలిటిక్స్’ గ్రంథంలో ‘ప్రతి పరికరమూ తనను ఉప యోగించే వ్యక్తి ఆదేశాలకు అనుగుణంగా లేదా వారి అవసరాలను ముందుగానే గుర్తించి అందుకు అనుగుణంగా వాటి పని అవి చేసుకోగలిగితే చేతివృత్తుల వారికి కార్మికుల అవసరం ఉండదు. అలాగే యజమానులకు బానిసల అవసరం కూడా ఉండదు’ అని రాశాడు. మనుషులు శ్రమలో నిరంతరం నలిగిపోకుండా, వాళ్లు తమ పనులను యంత్రాలకు అప్పగించి నిక్షేపంగా జీవితాన్ని ఆస్వాదించాలనేది ఆయన ఆలోచన.
కృత్రిమ మేధతో పనిచేసే మరమనుషులను గురించి ప్రాచీనులు కల్పనలు చేసేనాటికి ప్రపంచంలో కనీసం విద్యుత్తు వినియోగంలో లేదు. అప్పట్లో రవాణా వసతులు కూడా అంతంత మాత్రమే! అయితే, నాటి కల్పనలే నేటి కార్యాచరణలు. కాల్పనికమైన ఊహలే శాస్త్ర పురోగతికి ఊతమిస్తాయి. ఎందరో శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఆనాటి కల్పనల్లోని వర్ణనల మాదిరిగానే ఇంచుమించుగా మనుషులను పోలిన హ్యూమనాయిడ్ రోబోలు ఇప్పటికే వాడుకలోకి వచ్చేశాయి.
ఇవి ఎప్పటికప్పుడు మరింతగా ఆధునికతను సంతరించుకుంటున్నాయి. ఇవి కృత్రిమ మేధతో మనుషుల మాదిరిగానే పనులు చేయగలుగుతున్నాయి. కృత్రిమ మేధ తెరమీద ఏకంగా మను షులకు నకళ్లనే సృష్టిస్తోంది. కృత్రిమ మేధ ఇప్పుడు ఆధునిక కరాభరణాలైన స్మార్ట్‌ఫోన్‌లకూ పాకింది. కృత్రిమ మేధను విస్తృతంగా వాడుకలోకి తేగలిగిన శాస్త్రవేత్తలు అపర విశ్వామిత్రులే!
విశామిత్రుడు సృష్టించిన త్రిశంకుస్వర్గంలో త్రిశంకుడు తలకిందులుగా వేలాడుతున్నట్లుగానే, ఆధునిక శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమమేధతో మానవాళి పరిస్థితులు తలకిందులవుతాయా అనే భయాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇవి నిష్కారణమైన భయాలు కావు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న సమస్యలతో సతమతమవుతున్న వారిలో అనుభవపూర్వకంగా తలెత్తుతున్న భయాలు. పలు దేశాలు రాజ్యాంగబద్ధంగా గోప్యత హక్కుకు భరోసా కల్పిస్తున్నా, కృత్రిమ మేధ వల్ల మనుషుల గోప్యతకు పూచీలేని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది.
కృత్రిమ మేధ దుర్వినియోగం వల్ల నేరాలు కూడా జరుగుతున్నాయి. కృత్రిమ మేధ కళా సాహితీరంగాల్లోని సృజనకు సవాలుగా మారింది. నిన్న మొన్నటి వరకు నటీనటులు కెమెరా ముందు స్వయంగా నటిస్తేనే తెరమీద కనిపించేవారు. నటీనటులు కెమెరా ముందు స్వయంగా నటించకపోయినా, అచ్చంగా వారి రూపాలను, హావ భావ విన్యాసాలను తెరమీద ప్రదర్శించే స్థాయికి చేరుకుంది కృత్రిమ మేధ.
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇదే సమస్యపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా, తన రూపాన్ని, మాటలను, హావభావాలను కృత్రిమ మేధ సహాయంతో ప్రదర్శించకుండా ఉండేలా కోర్టు నుంచి ఇటీవల ఉత్తర్వులను కూడా పొందాడు. కృత్రిమ మేధ ఒకవైపు కొన్ని పనులను సులభతరం చేస్తున్నా, మరోవైపు కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. వాటికి పరిష్కారం కనుక్కోకుంటే... మన పరిస్థితి త్రిశంకుస్వర్గమే!
త్రిశంకుస్వర్గం
Published Mon, Sep 25 2023 3:16 AM | Last Updated on Mon, Sep 25 2023 10:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment