Sakshi Editorial Story On British New Prime Minister Rishi Sunak - Sakshi
Sakshi News home page

ఆపద్బాంధవుడు అవుతారా?

Published Wed, Oct 26 2022 1:56 AM | Last Updated on Wed, Oct 26 2022 10:32 AM

Sakshi Editorial On British Prime Minister Rishi Sunak

రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. తాజా ఉదాహరణ – బ్రిటన్‌ ప్రధానమంత్రి పగ్గాలను రిషీ సునాక్‌ చేపట్టడం. సొంత పార్టీ సారథ్యానికి జరిగిన పోటీలో ఓటమి పాలై నిండా నెలన్నరైనా గడవక ముందే ఆ పదవి ఆయనను వరిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కనీసం రిషి సైతం కలగని ఉండరు. కానీ అదే జరిగింది.

బ్రిటన్‌ పీఠంపై భారతీయ మూలాలున్న తొలి ప్రధానిగా, 200 ఏళ్ళ బ్రిటన్‌ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా 42 ఏళ్ళ రిషి అవతరించారు. కానీ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌కూ, అంతర్గత విభేదాలతో ఉన్న అధికార కన్జర్వేటివ్‌ పార్టీకీ ఆయన ఆపద్బాంధవుడు కాగలరా? ఇటీవలి ప్రధానులు డేవిడ్‌ కామెరాన్, థెరెసా మే, బోరిస్‌ జాన్సన్, లిజ్‌ ట్రస్‌లు నలుగురిలో ముగ్గురి కన్నా తక్కువ అనుభవం ఉన్న ఆయన నెగ్గుకు రాగలరా?

రెండేళ్ళ క్రితం భగవద్గీతపై ప్రమాణం చేసి మంత్రి పదవి చేపట్టి, దీపావళికి ఇంటి ముందు దీపాలు వెలిగించి సనాతన సంప్రదాయాన్ని పాటించినందుకు బ్రిటన్‌లో విమర్శల పాలైన పంజాబీ హిందూ రిషి తీరా ఈ దీపావళి నాడు అదే దేశానికి ప్రధాని కావడం కాకతాళీయం. మాజీ బాస్‌ బోరిస్‌ జాన్సన్, మరో పోటీదారు పెన్నీ మార్డాంట్‌లు బరిలో నిలిచేందుకు కావాల్సిన 100 మంది ఎంపీల మద్దతును కూడగట్టుకోలేకపోవడంతో, ఈసారి ప్రధాని పీఠానికి రిషి పయనం నల్లేరు మీద బండి నడక అయింది. కానీ, 45 రోజుల్లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన బ్రిటన్‌ తాజా మాజీ ప్రధాని లిజ్‌ ట్రస్‌ అందుకు తనను తాను తప్ప వేరెవరినీ నిందించలేరు. అనాలోచిత చర్యలతో కూడిన ‘మినీ బడ్జెట్‌’ను ప్రవేశపెట్టి, పౌండ్‌ విలువ భారీగా తగ్గడానికీ, మార్కెట్‌ పతనానికీ కారణమయ్యారనే అపకీర్తిని ఆమె మూటగట్టుకున్నారు. కరోనా కాలంలో చేపట్టిన చర్యలకు మంచి పేరు తెచ్చుకున్న రిషి తాజా గందరగోళాన్ని ఎలా చక్కదిద్దుతారో చూడాలి. 

తప్పులను సరిదిద్దడానికే తనకు బాధ్యత అప్పగించారనీ, తక్షణమే ఆ పని మొదలుపెడుతు న్నాననీ రిషి మాట. కేవలం ఏడేళ్ళ పార్లమెంటరీ అనుభవమే ఉన్న రిషి అయిదేళ్ళకే ఆర్థిక మంత్రి, ఆ పైన రెండేళ్ళకే ప్రధానీ అయ్యారు. విశ్వసనీయత, ప్రొఫెషనలిజమ్, జవాబుదారీతనం ముఖ్యమైన వేళ కోరి తలపై పెట్టుకున్న ప్రధాని పట్టం అన్ని విధాలా ముళ్ళకిరీటమని రిషికి తెలుసు.

ఒకపక్క అంతర్గత కుమ్ములాటల్లో పడిపోయిన స్వపక్షీయులైన కన్జర్వేటివ్‌ల మధ్య ఐక్యత తేవడానికి ఆయన శ్రమించాలి. మరోపక్క కట్టుదిట్టమైన చర్యలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. ఈ శ్వేతేతర జాతి నేత పదవి చేపట్టిన మంగళవారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. లిజ్‌ సారథ్యంలో పనిచేసిన పలువురు మంత్రులకు ఉద్వాసన పలికారు. మునుపటి లిజ్‌ మంత్రివర్గంలోకి ఆఖరి రోజుల్లో వచ్చిన ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌ను అదే పదవిలో పునర్నియమించారు. పార్టీకి కొత్త ఛీఫ్‌ విప్‌ను పెట్టారు. అన్నట్టుగానే వెంటనే పనిలోకి దిగారు. 

కారణాలు ఏమైనా, ఒకే ఏడాదిలో బ్రిటన్‌ ముచ్చటగా మూడో ప్రధానమంత్రిని చూసేలా చేసింది అధికార పార్టీ. గడచిన 12 ఏళ్ళ పాలన దేశాన్ని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టిందనే ఆరోపణ ఉంది. ఇప్పుడు 700 మిలియన్‌ పౌండ్లకు పైగా ఆస్తులతో ఆ పార్టీలోని రిషీ సునాక్‌ దంపతులు సాక్షాత్తూ బ్రిటన్‌ రాజు కన్నా అధిక ధనవంతులనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కనీసం కొత్త ప్రభుత్వమైనా సుస్థిర ఆర్థిక విధానాలను అనుసరించాలనీ, ఘడియకో మార్పు చేయరాదనీ బ్రిటన్‌ ఆర్థిక విపణి భావిస్తోంది. రిషి ఆ ఆకాంక్షకు తగ్గట్టు వ్యవహరిస్తే మునుపటిలా మార్కెట్‌ పతనం కాకపోవచ్చు.

దేశానికి ఓ దిశ, దశ కల్పించడం క్లిష్టమే. ‘ఆర్థిక సుస్థిరత, సమర్థత ప్రభుత్వ అజెండా’ అంటున్న రిషి అదుపు తప్పి పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయ సంక్షోభాలకు కళ్ళెం వేయాలి. కఠిన నిర్ణయాలు తప్పవంటూ పగ్గాలు చేపడుతూనే ప్రకటించినా, అందుకు చిక్కులు లేకపోలేదు. కన్జర్వేటివ్‌ల సర్వసాధారణ సిద్ధాంతమే పన్నుల తగ్గింపు. తీరా ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పన్నులు విధిస్తే, సొంత పార్టీలోనే ఆయనకు నిరసన ఎదురు కావచ్చు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఆశ కూడా అదే. రిషి మాత్రం సంక్షోభ పరిష్కారానికి మంత్ర దండమేదీ లేదనీ, కాకమ్మ కథల్లో తనకు నమ్మకం లేదనీ అంటున్నారు. అందుకే, రాబోయే రోజుల్లో ఆయన ఏం చేస్తారు, ఎలా దేశాన్ని గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం. 

ఏళ్ళ తరబడి మనల్ని బానిసలను చేసుకొని పాలించి, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడానికి అనేక అభ్యంతరాలు పెట్టిన రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యం... తీరా మనకు స్వాతంత్య్రం దక్కిన సరిగ్గా 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విచిత్రంగా భారతీయ మూలాలున్న వ్యక్తి ఏలుబడిలోకి రావడం విధి చేసిన వింత. నిజానికి, అప్పటి బ్రిటన్, ఇప్పటి బ్రిటన్‌ అనేక రీతుల్లో వేరు. అయితేనేం, మన భారతీయుల వరకు ఇది అహాన్ని సంతృప్తిపరచే అంశమే.

మన దేశాన్ని మరొకరు పాలించడానికి ఇచ్చగించకపోయినా, మరో దేశంలో మనవాడు జెండా ఎగరేశాడంటూ సహజమైన సంతోషాన్నీ వ్యక్తం చేస్తాం. బ్రిటన్‌తో మన బంధం బలపడుతుందనీ ఆశిస్తాం. సంక్లిష్టమైన, ఈ సరికొత్త బాధ్యతల్లో రిషి విజయం సాధించి, రాజకీయ, ఆర్థిక సుస్థిరత అందించాలనే కోరుకుందాం. తప్పేమీ కాదు. కానీ, అది అనుకున్నంత తేలిక కాదు. చిన్న తేడా జరిగినా, ఆపైన దేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి అప్పనంగా అందించారనే అపకీర్తి రిషి మెడ మీద కత్తిలా వేలాడుతూనే ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement