అందరికీ ఎన్నడో అర్థమైన ఒకానొక సత్యం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం (ఎన్‌సీబీ)కి ఆలస్యంగా తలకెక్కింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మాదక ద్రవ్యాలతో ఏవిధమైన సంబంధమూ లేదని ఆ సంస్థ తేల్చిచెప్పింది. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ముంబై తీరంలోని ఒక విహార నౌకలో సంపన్నులు, సెలబ్రిటీల పిల్లలంతా కలిసి పాల్గొన్న విందుపై ఎన్‌సీబీ బృందం దాడి చేసి ఆర్యన్‌తోపాటు అనేకుల్ని అరెస్టు చేసింది. అతను డ్రగ్స్ సేవిస్తుండగా పట్టుకున్నామనీ, అతగాడి ఫోన్‌లోని వివరాల ఆధారంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల సిండికేట్‌తో అతనికున్న సంబంధాలు వెల్లడయ్యాయనీ ఎన్‌సీబీ ప్రకటించింది. ఇంకేం? సామాజిక మాధ్యమాలూ, టీవీ చానెళ్లూ హోరెత్తిపోయాయి. మాదకద్రవ్యాలు తీసుకుం టుండగా ఆర్యన్‌ను స్వయంగా చూసినంత హడావుడి చేశాయి. అందులోనూ పట్టుబడింది బీజేపీకి అయిష్టుడిగా ముద్రపడిన షారుఖ్ తనయుడు కావడంతో కొన్ని చానెళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అవి రోజంతా నిర్వహించిన చర్చల్లో పాల్గొన్నవారు ఈ కేసులో తీర్పులిచ్చేశారు. సెలబ్రిటీల పిల్లల పెంపకంపై విరుచుకుపడ్డారు. దేశభక్తి లేనివారి సంతానం ఇలాగే ఉంటారని దెప్పిపొడిచారు. కొందరు ఆ అరెస్టు వెనకున్న పరమార్థమేమిటో అంచనా వేశారు. ఆ సమయంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన రూ. 20,000 కోట్ల విలువైన డ్రగ్స్‌నుంచి దృష్టి మళ్లించడానికే ఆర్యన్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారన్న వాదనలూ వినిపించాయి.
నిజానికి ‘ఫలానా హీరో తనయుడు లేదా తనయ’ అనే విశేషణం అవసరం లేకుండానే స్టార్ హీరోల పిల్లలు వారికై వారు సెలబ్రిటీలుగా మారిపోతున్న కాలమిది. గతంలో ఎంత పేరు ప్రఖ్యాతులున్న నటులైనా తమ వారసులను వెండితెరపై వెలిగించాలనుకున్నప్పుడు చేయితిరిగిన దర్శకులను ఆశ్రయించేవారు. దీటైన పబ్లిసిటీ కోసం వెంపర్లాడేవారు. ఇవాళ ఏ చిత్రంలోనూ నటించకపోయినా, కనీసం నలుగురి దృష్టినీ ఆకర్షించే పనులేమీ చేయకపోయినా ఆర్యన్ నుంచి ఆరాధ్య వరకూ ఎవరు ఎవరి వారసులో అందరికీ తెలుసు. ఎవరినైనా రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చే చిట్కాల్లో ఆరితేరిన పీఆర్ మేనేజర్ల పుణ్యమిది. ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ట్విటర్‌లోనో లక్షల మంది అనుచరగణాన్ని సృష్టించి ఆ పిల్లల ఫొటోలు పెడితే చాలు... బహుభాషా మాధ్యమాల్లో అవి చిలవలు, పలవలుగా అల్లుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అటుపై వారి గురించి తెలియ దంటే అలా అన్నవారి అజ్ఞానమే బయటపడుతుంది. అయితే ఈ మాదిరి ప్రచారం కూడా వికటించే ప్రమాదం లేకపోలేదు. ఆర్యన్‌ఖాన్‌కు జరిగింది అదే. అతను షారుఖ్ కుమారుడు కాకపోయివుంటే కథ వేరేలా ఉండేది. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ ఆత్మహత్య కేసులో అతడి స్నేహితురాలు నటి రియా చక్రవర్తికి చుక్కలు చూపించిన అప్పటి ముంబై జోన్ ఎన్‌సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేనే ఆర్యన్ ను కూడా కటకటాల్లోకి నెట్టగలిగారు. ఏలికల ఆదేశాలను శిరసావహించి ఎవరినైనా కేసుల్లో ఇరికించగల నైపుణ్యంగల అధికారుల్లో ఒకరిగా ఆయనకున్న అపకీర్తి ఎవరికీ తెలియనిది కాదు. రోజంతా మోతమోగే చానెళ్ల కారణంగా హఠాత్తుగా వచ్చిపడిన గ్లామర్ ఆయనను మరింత వ్యామోహంలోకి నెట్టింది. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆర్యన్‌ఖాన్ కేసును సవాలుగా తీసుకొని రోజుకొక కొత్త కోణంతో వాంఖడే చరిత్రను ఏకరువు పెట్టడంతో ఈ మొత్తం వ్యవహారంపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ కేసులో మధ్యవర్తులుగా ఉన్నవారికి వాంఖడేతో ఉన్న సంబంధాలు వెల్లడి కావడంతో ముందు ఎన్‌సీబీ విజిలెన్సు విభాగం దర్యాప్తు, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు జరిగాయి. ఈ రెండు విభాగాలూ వాంఖడేను గుచ్చి గుచ్చి ప్రశ్నించి నిజాలు నిగ్గు తేల్చాయి. ఆర్యన్‌తోపాటు ఆరుగురిపై ఆధారాల్లేవని నిర్ధారణ కావడంవల్ల కేసులు ఉపసంహరిస్తున్నామని సిట్ ప్రకటించింది.
ఉగ్రవాదం తర్వాత ప్రపంచ దేశాలన్నిటికీ మాదకద్రవ్యాల వాడకమే కొరకరాని కొయ్యగా మారింది. అంతటి పెను రక్కసి ఆరా తీసి, దాన్ని దుంపనాశనం చేయాల్సిన కర్తవ్య నిర్వహణలో నిమగ్నం కావాల్సిన ఎన్‌సీబీ వంటి సంస్థ స్వప్రయోజనాపరులైన నేతల చేతుల్లో కీలుబొమ్మయితే, దాని అధికారులు బానిస మనస్తత్వంతో అడుగులేస్తుంటే జరిగేదేమిటో తెలియంది కాదు. యువతను మత్తులో ముంచెత్తి మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేయగల సత్తా మాదకద్రవ్యాల కుంటుంది. వాటివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలే చిన్నాభిన్నమవుతాయి. ఏదో ఒక ముసుగులో ప్రపంచం నలుమూలల నుంచీ మాదకద్రవ్యాలు ఇక్కడికొస్తున్నాయి. మరెన్నో దేశాలకు చడీచప్పుడూ లేకుండా పోతున్నాయి. గట్టి నిఘా ఉంటే తప్ప వీటిని అరికట్టడం అసాధ్యం. మనం ఆ పని చేయలేకపోతే ప్రపంచంముందు చులకనవుతాం. దర్యాప్తు సంస్థలు దీన్ని గుర్తెరిగి వృధా కేసులతో పొద్దుపుచ్చడం మానుకోవాలి. ప్రచారయావను తగ్గించుకోవాలి. అవకాశం దొరికిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా తీర్పులీయటం అలవాటైన చానెళ్లకూ ఈ కేసు గుణపాఠం కావాలి. వాంఖడే ఆర్యన్ జోలికి పోయాడు గనుక ఈ కేసు దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో దర్యాప్తు సక్రమంగా సాగి నిజానిజాలేమిటో వెల్లడయ్యాయి. మరి అమాయకుల మాటో?! ఎన్‌సీబీతోసహా అన్ని దర్యాప్తు సంస్థలనూ ప్రక్షాళన చేయడం ముఖ్యమనీ, అవి స్వతంత్రంగా మెలిగేందుకు తోడ్పాటునందించడం అవసరమనీ కేంద్రం గుర్తించాలి.
Drugs-On-Cruise Case: ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్‌చిట్
Published Sat, May 28 2022 12:26 AM | Last Updated on Sat, May 28 2022 10:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment