కొల్లేరు చేపలు సముద్రం పాలు | - | Sakshi
Sakshi News home page

కొల్లేరు చేపలు సముద్రం పాలు

Published Sat, Sep 14 2024 2:28 AM | Last Updated on Sat, Sep 14 2024 2:28 AM

కొల్లేరు చేపలు సముద్రం పాలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరులో అక్రమ చెరువులకు వరదలు గండికొట్టాయి. 18 ఏళ్ల క్రితం వరదలకు కొల్లేరు చెరువులకు భారీ నష్టం వాటిల్లగా.. మళ్లీ అదే తరహాలో వరదలు కొల్లేరుకు పోటెత్తడంతో అనధికారిక చెరువులు మొత్తం కొల్లేరు పాలయ్యాయి. కొల్లేరు అభయారణ్యంలో ఉన్న అనధికారిక చెరువుల్లో 7 వేల ఎకరాలకు పైగా నీటమునిగాయి. రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇక అధికారికంగా పెదపాడు, మండవల్లి, గణపవరం, నిడమర్రు మండలాల్లో 255 ఎకరాలు నీటమునగడంతో రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు.

2.23 లక్షల ఎకరాల్లో కొల్లేరు సరస్సు : కొల్లేరు అభయారణ్యం అక్రమ చెరువుల సాగుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. కొల్లేరు చేపలకు జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న క్రమంలో విచ్చలవిడిగా అక్రమ సాగు జరుగుతుంది. 2.23 లక్షల ఎకరాల్లో కొల్లేరు సరస్సు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 10 కాంటూరులో విస్తరించి ఉంది. ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సుగా కొల్లేరు ఖ్యాతిగడించింది. 5వ కాంటూరు వరకు 77,138 ఎకరాలు ఉంది. ఈ క్రమంలో కొల్లేరును అక్రమ చేపల సాగుకు చిరునామాగా మార్చేశారు.

80 శాతానికి పైగా అక్రమ చెరువులు

77 వేల ఎకరాల అభయారణ్యంలో 65 వేల ఎకరాలు, 5 నుంచి 10వ కాంటూరు మధ్య 48 వేల ఎకరాలు మొత్తంగా సుమారు 1.13 లక్షల ఎకరాలు అక్రమణలో ఉంది. దీనిలో 80 శాతానికిపైగా అక్రమ చెరువులు సాగులో ఉన్నాయి. 2006లో కొల్లేరు ఆపరేషన్‌ నిర్వహించి సుప్రీంకోర్టు ఆదేశాలతో 25,142 ఎకరాల విస్తీర్ణంలో చెరువులను ధ్వంసం చేశారు. కాలక్రమేణా ధ్వంసం చేసిన చెరువులన్నీ యథాస్థితికి చేరుకున్నాయి. తాజాగా తమ్మిలేరు, ఉప్పుటేరు నుంచి భారీగా వరద నీరు కొల్లేరుకు చేరింది. 18 ఏళ్ల తర్వాత భారీ వరద రావడంతో ఏలూరు రూరల్‌ మండలం, కై కలూరు, మండవల్లి మండలాల్లో వేల ఎకరాల్లో పంట పొలాలు, ఏలూరు రూరల్‌ మండలం, కై కలూరు పరిధిలో ఉన్న అభయారణ్యంలో ఉన్న 7 వేల ఎకరాల్లో చేపల చెరువులు పూర్తిగా నీటమునిగాయి. వరద నీటి ఉధృతి కొనసాగి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి చేరుతున్న క్రమంలో మత్స్యసంపద కొట్టుకుపోతుంది. కొంతమంది రైతులు చెరువుల చుట్టూ వలలు ఏర్పాటు చేసి చేపలను కొంతమేరకు ఆపగలుగుతున్నా వరద తీవ్రతతో కొట్టుకుపోతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం అక్రమ చెరువులకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం.

7 వేల ఎకరాల అనధికారిక చెరువులకు నష్టం

నష్టం విలువ రూ.100 కోట్ల పైమాటే

ఏలూరు రూరల్‌, కై కలూరు మండలాల్లో అధికంగా నష్టం

పెదపాడు, మండవల్లిలోనూ

నీటమునిగిన చెరువులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement