పరిమళించిన మానవత్వం.. వరించిన పురస్కారం
మండవల్లి: కొత్త కారు కొనుక్కొని అప్పుడే పూజ చేసి వెళ్తుంటే రక్తం మడుగులో ఉన్న వ్యక్తిని తీసుకెళతామా.. మనకెందుకులే అని చాలా మంది తప్పించుకుంటారు. అయితే మండవల్లికి చెందిన ఆటోడ్రైవర్ కందుల శ్యామ్ అలాకాదు.. మానవత్వంతో తన ఆటోలో ఓ క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాడు. రిపబ్లిక్ డే సందర్భంగా కలెక్టర్ చేతులమీదుగా గుడ్ సమారిటన్ శ్యామ్‌గా గుర్తింపు పొంది ప్రశంసాపత్రం అందుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కందుల శ్యామ్ గతేడాది నవంబరు 28న కొత్త ఆటో కొని విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో పూజ చేయించి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో మండవల్లి మండలం లింగాలకి చెందిన ఆక్వా రైతు కాటి నిరీక్షణరావు ద్విచక్రవాహనంపై వెళుతూ అదుపుతప్పి రోడ్డుపై పడ్డారు. తలకు తీవ్రగాయం కాగా అపస్మారక స్థితికి చేరారు. మండవల్లి ఎస్సై సీహెచ్ రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని దా రిన వెళ్లే వాహనాలను ఆపినా ఎవరూ స్పందించలేదు. శ్యామ్ ఆటోని నిలిపి నిరీక్షణరావును గుడివాడ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. దీంతో నిరీక్షణరావు ప్రాణాలు నిలిచాయి. శ్యామ్ మానవత్వాన్ని గుర్తించి ఆదివారం కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆయనకు ప్రశంసాపత్రం, రూ.5 వేల నగదు అందించారు. శ్యామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సీఐ వి.రవికుమార్, ఎస్సై రామచంద్రరావు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment