ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ కీట్స్ ఒక మాటన్నారు...‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్’’– అని. ఒక అందమైన వస్తువు ఎప్పటికీ సంతోషకారకమే. అందమైన వస్తువు అంటే ... నాకు ఏది అందంగా కనపడుతుందో, మీకు అది అందంగా కనపడకపోవచ్చు. నాకు అందంగా కనిపించింది దేశకాలాలతో సంబంధం లేకుండా అది నాకు శాంతి కారణమయి ఉంటుంది.
అసలు లోకంలో ఏ పనిచేసినా దేనికోసం చేస్తాం? శాంతి కోసమే. ఏది శాంతిని ఇవ్వగలదో అదే అందం. ఏది మనసుకు అశాంతి ఇవ్వడం ప్రారంభించిందో అది అందవిహీనం. భగవద్గీతలో గీతాచార్యుడు ఒకమాటంటాడు – ‘‘తత్తదేవా గచ్ఛత్వమ్ మమ తేజోంశ సంభవమ్’’.. అని. అటువంటి గొప్ప అందం ఎక్కడయినా ఉంటే .. అది భగవంతుని తేజస్సు అవుతుంది.
నేను ఒకప్పడు నైమిశారణ్యానికి వెళ్ళాను. అక్కడ గోమతీ నదీతీరంలో ఒక పెద్ద వటవృక్షాన్ని చూసాను. ఎంత పెద్దదంటే.. దాని కొమ్మలు, ఆకులు, ఊడలు తగలకుండా దాని చుట్టూ తిరగడానికి 15–20 నిమిషాలు పడుతుంది. ఎన్ని కొమ్మలు, ఎన్ని ఊడలు, పైన పక్షులు, పక్షి గూళ్ళు.. అలా చూస్తుండి పోయాను. ఇప్పటికి పదేళ్ళు పైగానే అయిపోయి ఉంటుంది. అయినా ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తే.. దాని సౌందర్యం, దాని పరిమాణం వెంటనే మనసులో మెదిలి అప్పటివరకు నాలో ఉన్న ఉద్వేగం కానీ ఇతరత్రా చికాకులు, విసుగు, అశాంతి అన్నీ మటుమాయమై పోతాయి.
ఒకసారి ఒక కోనేరులో సహస్రదళ కమలాన్ని చూసాను. వెయ్యిరేకుల పద్మం. అక్కడున్నవాళ్ళు దాన్ని కోసి తెస్తే ... నా రెండు చేతులా నిండుగా అది తాజాగా కనిపించడమే కాదు... దగ్గరనుంచి చూస్తే.. ఎన్ని రెక్కల దొంతర్లు, ఎన్నెన్ని రంగులు, ఎంత చక్కటి అమరిక, మధ్యలో ఉన్న దుద్దు, ముఖానికి దగ్గరగా తీసుకుంటే ఎంత చల్లదనం.. అలా దానిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను.
కొంతసమయం తరువాత అది వాడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది... కానీ నా జ్ఞాపకాల్లో అది వాడలేదు, నశించలేదు, నా స్మృతిపథంలో దానికి బురద లేదు, మొగ్గలేదు, వందలాది రేకులతో, చిత్రవిచిత్ర వర్ణాలతో నా చేతిలో బాగా విప్పారి, నాకు చల్లదనాన్నిచ్చి... అలా నా మనసులో ముద్రితమైన ఆ పూవు మాత్రం నా చివరి శ్వాసవరకు, నేనెప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మొదటిసారి చూసినప్పుడు ఎంత అనుభూతి చెందానో, అంతే అనుభూతిని పొందుతూనే ఉంటాను.
అలా గుర్తుకొచ్చినప్పుడు ఆ అందం నాకు సంతోషాన్నిస్తుంది, శాంతినిస్తుంది. అంటే దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ‘బీజస్వాంతరివాంకురోజగదివం ప్రాంగే నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకకలగా వైచిత్రచితైకృతం’ అంటారు శంకరులు. అలా అది ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళినా అక్కడ అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి చూసి అనుభూతి చెందిన అందం నా స్వంతం. అదెప్పటికీ నాతోనే ఉండి... నాకు సంతోషాన్ని, శాంతిని, ఉపశమనాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అంటే ఏది నీకు శాంతికారకమో, సంతోషకారకమో అదే నిజమైన అందం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment