నాన్సీ త్యాగి ప్రతిభకు పవర్‌హౌస్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై స్వయంగా తయారు చేసిన దుస్తుల్లో యావత్ దేశం గర్వించేలా చేసింది.
నాన్సీ తన ఇంటర్వ్యూలన్నీ హిందీలోనే ఇచ్చి మరింత ఆకట్టుకుంది.
ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల మధ్యనుంచే తన భవిష్యత్తును నిర్మించుకుంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫ్యాషన్ ప్రపంచంలో తన స్థానాన్ని పదిలపర్చుకుని ప్రశంసలను అందుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై అరంగేట్రంలోనే అందరిదృష్టినీ ఆకర్షించిన ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగి కేన్స్ 2024లో ఎలా చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని బర్నావా గ్రామనుంచి ఫ్రెంచ్ రివేరా పట్టణంలోని రెడ్ కార్పెట్ దాకా ప్రయాణం ఎలా సాగింది? తెలుసుకుందాం రండి.
ఇంటర్ మంచి మార్కులతో పాసైన తరువాత 2020 ఐఏఎస్ అవ్వాలనే ఆశయంతో ఢిల్లీకి వచ్చిన నాన్సీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోలేకపోయింది. ఎందుకంటే సరిగ్గా అపుడు కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్ ఆక్షల సమయంలో నాన్సీ తల్లి ఉద్యోగం కోల్పోయింది. దీంతో ఇల్లు గడపడం కష్టంగా మారింది. ఇక సివిల్స్ కోచింగ్‌కి డబ్బులు కష్టం అని భావించింది. డిజైన్‌పై ఆమెకున్న తొలి ఆసక్తి , బొమ్మలకు బట్టలు కుట్టడం ద్వారా అలవడిన ఫ్యాషన్ అభిరుచిని, భవిష్యత్ కెరీర్‌కు పునాది వేసింది. అలాగే కెమెరా పట్టుకొని వీడియోలు చేయడం మొదలు పెట్టింది.
కొన్నిసార్లు, వీడియోల కోసం ఆమె సోదరుడు మను ఫీజును త్యాగం చేయాల్సి వచ్చేదట. వారి గ్రామంలో ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ నడుపుకునే తండ్రి కూడా సహాయం చేశాడు. నాలుగేళ్ల తర్వాత ఆ కష్టమంతా ఫలించింది. అలా ఉన్నచోటనే విజయాన్ని వెతుక్కుంది. ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్ అయింది. ఆమె విలక్షణమైన శైలి బ్రూట్ ఇండియా దృష్టిని ఆకర్షించింది. తమ స్క్వాడ్‌లో చేరమని ఆమెను ఆహ్వానించింది. అలా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. టీంకు కూడా గర్ వకారణంగా నిలిచింది. ఆత్మవిశ్వాసం,స్థయిర్యంతోపాటు మాతృభాష (హిందీ)లో మాట్లాడి హైలైట్ అయింది.
కేన్స్‌లో యువ డిజైనర్‌గా మెరిసింది. స్టన్నింగ్ లుక్స్, డిజైనర్ దుస్తుల్లో ఆమె ఇచ్చిన పోజులు వైరల్ అయ్యాయి ఫలితంగా 23 ఏళ్ల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 7లక్షల నుండి 20 లక్షలకు పెరిగింది. అంతేనా నటి-ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ వంటివారు తమ కోసం డిజైన్ చేయమని కోరుతున్నారు. ఆమె కోసం ఒక దుస్తులను తయారు చేసేందుకు నాన్సీ సన్నద్ధమవుతోంది. ఇంకా అర్జున్ కపూర్,మసాబా గుప్తా వంటి ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. జీవిత ప్రయాణం చాలా కష్టంగా సాగింది. కానీ ప్రతి క్షణం విలువైనదే అంటూ తన జర్నీని గుర్తు చేసుకుంది.
మే 14-మే 25 వరకు జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్, కార్సెట్, టెయిల్డ్ స్కర్ట్ , బ్యాక్‌లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ వీల్, పొడవాటి పల్లూతో క్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ లావెండర్ చీర తదితర లుక్స్‌తో అదరగొట్టింది. అంతేకాదు తన దుస్తులను తానే స్వయంగా కుట్టుకోవడం ప్రత్యేకత.
కేన్స్ కోసం, నాన్సీ నాలుగు దుస్తులను డిజైన్ చేసుకుంది. ఇందుకు ఆమెకు రెండు నెలలు పట్టింది. 30 రోజుల్లో 1,000 మీటర్ల ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన అందమైన 20 కిలోల గులాబీ రంగు గౌనుతో ఆమె ఫస్ట్ లుక్‌ని రూపొందించింది.ఆ ఆ తర్వాతి నెలలో, ఆమె మిగిలిన మూడింటిని సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా రెండవలుక్ కోసం దేశీయ చీరను ఎంచుకుంది. వెస్ట్రన్ టచ్‌తో ఆమె ధరించిన చీర ఆడియెన్స్‌తోపాటు, చాలామంది సెలబ్రిటీలకు కూడా వీపరీతంగా నచ్చేసింది.
ఈ చీరను 100 శాతం ఆర్గానిక్ కాటన్, సస్టైనబుల్ ఫాబ్రిక్ నుండి తయారు చేసానని స్వయంగా చెప్పంది. అలాగే తాను ఎక్కువగా సోదరుడి సలహాలను తీసుకుంటానని కూడా వెల్లడించింది. ఈ సారి కూడా డిజైన్‌ల నుంచి దుస్తుల రంగు వరకు అన్నీ మా అన్నయ్య ఆలోచనలే అని తెలిపింది మురిపెంగా.
ఇంత పాపులారిటీ వచ్చింది కదా నటిస్తారా అంటే.. తనకు నటన అంటే పెద్దగా తెలియదు కాబట్టిన నో అని చెప్పేసింది. కల నిజమైంది అంటూ తనకు మద్దతిచ్చి, స్ఫూర్తినిచ్చిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. తన ఫ్యాషన్‌తో మరింత అబ్బుర పర్చాలని భావిస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment