వెన్ను విరిగినా వెన్నుదన్నుగా... ‘సోల్‌ ఫ్రీ’ ప్రీతి స్ఫూర్తిదాయక జర్నీ  | Former cricketer of Tamil Nadu Preethi Srinivasan success journey | Sakshi
Sakshi News home page

 వెన్ను విరిగినా వెన్నుదన్నుగా... ‘సోల్‌ ఫ్రీ’ ప్రీతి స్ఫూర్తిదాయక జర్నీ 

Published Wed, Jan 31 2024 9:53 AM | Last Updated on Wed, Jan 31 2024 11:45 AM

Former  cricketer of Tamil Nadu Preethi Srinivasan success journey - Sakshi

క్రికెటర్‌గా తమిళనాడు రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉండే ప్రీతి శ్రీనివాసన్‌కు 18 ఏళ్ల వయసులో వెన్నుకు పక్షవాతం వచ్చి, వీల్‌ చెయిర్‌కే పరిమితం అయ్యింది. తనను తాను మెరుగుపరుచుకుంటూ సోల్‌ఫ్రీ ఫౌండేషన్‌ ద్వారా స్పైనల్‌కార్డ్‌ సమస్యలతో బాధపడే 2,500 మందికి వెన్నుదన్నుగా నిలిచింది. సోషియాలజీలో పీహెచ్‌డీ చేస్తూ, సైకాలజీలో రాణిస్తూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది. జీవితంలో ఏదైనా కారణం చేత పడిపోయినప్పుడు తిరిగి నిలబడే శక్తిని పెంచుకోవాలనే స్ఫూర్తిని నింపుతోంది ప్రీతి జీవనం. 

‘‘అథ్లెట్‌గా నాది అద్భుతమైన జీవితం. చెన్నైలో పుట్టి మూడు ఖండాల్లో పెరిగిన నేను జాతీయ స్థాయి స్విమ్మర్‌ స్థాయికి చేరుకున్నాను. మూడేళ్ల వయసు నుంచే స్విమ్మింగ్‌  ప్రారంభించాను. నాలుగేళ్ల వయసులో క్రికెట్‌ ఆడటం స్టార్ట్‌ చేశాను. ఎనిమిదేళ్ల వయసులో తమిళనాడు అండర్‌-19 జట్టుకు  కెప్టెన్‌గా ఉన్నాను. చదువులోనూ ముందంజలో ఉండేదాన్ని. ప్రతిదీ విజయాల బాటగా జీవితం వెళ్లిపోతుంది. వైఫల్యం నీడ కూడా నా జీవితాన్ని తాకలేదు అనుకున్నాను. కానీ, 18 ఏళ్లు వచ్చేసరికి రెప్పపాటులో అంతా మారిపోయింది. 

బీచ్‌లో జరిగిన ప్రమాదం.. 
పుదుచ్చేరి బీచ్‌లో స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో నీటిలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కిందపడిపోయాను. వెన్నెముకకు గాయం కావడంతో మెడ కింది భాగం అంతా కదలిక కోల్పోయింది. అమ్మానాన్నల ప్రేమ, వారి సపోర్ట్‌తో నన్ను నేను మరో మార్గంలో వెతుక్కోవడం మొదలుపెట్టాను. 

వందలాది మందికి రెక్కలు
వెన్నుపాము సమస్యలు ఉన్నవారికి పూర్తి చికిత్స, పునరావాసం, వైద్య సంరక్షణ, విద్య, కౌన్సెలింగ్, ఉపాధి అవకాశాలను అందించడానికి ‘సోల్‌ఫ్రీ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను  ప్రారంభించాను. ఈ సంస్థ తిరువణ్ణామలైలో 20 వేల అడుగుల చదరపు అడుగుల విస్తీర్ణంలో తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న 200 మందికి  గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి కావల్సిన వసతి సదుపాయాలను అందిస్తోంది. సోల్‌ ఫ్రీలో ఇప్పటి వరకు 2,500 మంది ఆశ్రయం పొందారు. 

అడుగడుగునా అవరోధాలే.. 
ఇప్పుడు నా వయసు 42. కానీ, పద్దెనిమిదేళ్ల వయసులో జరిగిన సంఘటనతో నా గుండె ఆగి΄ోయినట్టు అనిపించింది. అప్పటి వరకు ఉన్న నా విశేషమైన ఉనికి ఒక్కసారిగా ΄ాతాళానికి పడి΄ోయినట్టుగా అనిపించింది. అమెరికాలో చదువుకుంటున్న టాప్‌ స్టూడెంట్స్‌లో నేనూ ఒకదాన్ని. పెద్ద పెద్ద క్రీడాకారులతో కలిసి క్రికెట్‌ ఆడాను. ఫిట్‌గా, అందంగా ఉండేదాన్ని. వేగంగా బంతిని విసిరే సామర్థ్యం ఉన్న నేను చిటికెన వేలును కూడా కదపలేని స్థితికి చేరుకున్నాను. అన్ని విధాలుగా అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన నేను అకస్మాత్తుగా నాకు నేను ఆహారం తీసుకోలేని... స్నానం చేయలేని... మంచం నుండి లేవలేని స్థితికి వెళ్లి΄ోయాను.  అమ్మనాన్నలు నన్ను చూసుకోవడానికి వాళ్ల ఉద్యోగాల్ని విడిచిపెట్టారు. వైద్యం కోసం  పెద్ద పెద్ద ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కాస్త కోలుకున్న తర్వాత బీఎస్సీ సైకాలజీలో చేరడానికి వెళితే, ఇప్పుడు నీకు ఈ చదువు అవసరమా అన్నట్టు ప్రవర్తించిన అక్కడి యాజమాన్య తీరు నన్ను కన్నీరు పెట్టించింది. కానీ, నాన్న నన్ను ్ర΄ోత్సహించారు. ఇంటి దగ్గరే ఉండి డిగ్రీ చదువుకునేలా స్ఫూర్తి నింపారు.

ఫిక్షన్‌ స్టోరీస్, డిగ్రీ బుక్స్‌ మాత్రమే కాదు ఆధ్యాత్మిక పుస్తకాల వరకు అన్నీ చదివి వినిపించేవారు. నా నొప్పిని అధిగమించడానికి నాన్న నాకు ఎంతో సహాయపడ్డారు. కానీ, నాన్న గుండె΄ోటుతో మరణించడం ద్వారా విధి నన్ను మరోసారి బలంగా దెబ్బతీసింది. నాలుగు రోజుల తేడాతో అమ్మకూ గుండె΄ోటు వచ్చి, బైపాస్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. నా ప్రపంచం మళ్ళీ శూన్యం అయ్యింది. 80 ఏళ్ల అమ్మమ్మ నన్ను చూసుకునేది. కానీ, ఆమె అమ్మ కోసం చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. నాకు తినిపించడం, కూర్చోబెట్టడం ఎవరు చేస్తారో తెలియదు. డబ్బు సంపాదించడం  ప్రారంభించాల్సి వచ్చింది. జీవితం మళ్లీ కష్టంగా అనిపించింది. అమ్మ, అమ్మమ్మల ఆరోగ్యం సమస్యాత్మకంగానే ఉండేది. ఈ సమయంలో మా ఫ్రెండ్స్‌ చదువును కంటిన్యూ చేయమన్నారు. బిఎస్సీ సోషియాలజీ తర్వాత సైకాలజీలో ఎంఎస్సీ కూడా పూర్తిచేశాను. 

సంరక్షణకు స్థలం
దేశంలో దివ్యాంగులకు గౌరవంగా జీవించగలిగిన స్థలం ఎక్కడుంది అంటూ చాలా శోధించాను. కానీ, ఎక్కడా అలాంటి పునరావాస కేంద్రాలు, స్థలాలు లేవని తెలిసింది. దీంతో తీవ్ర వైకల్యాలున్న వ్యక్తులకు గౌరవ ప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఓ స్వర్గధామాన్ని నేనే  ప్రారంభించాలనుకున్నాను. లాభాపేక్ష లేని సంస్థను నడపడం లేదా ఎవరినుంచైనా ఫండింగ్‌ తీసుకోవడం అనే ఆలోచన కూడా చేయలేదు.  దివ్యాంగుల కోసం ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నాను.

సోల్‌ ఫ్రీ పేరుతో సంరక్షణ  కేంద్రాన్ని ప్రారంభించాను. ఇక్కడ వారు తమకు ఇష్టమైన వ్యాపకాల్లో ఆర్నెల్లపాటు శిక్షణనూ  పొందుతారు. దీనిని రీ –ఇంజనీరింగ్‌ అని పిలుస్తున్నాం. మేమందరమూ జీవించాలనే సంకల్పంతో ఈ కేంద్రాన్ని పునరుద్ధరించాను. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారు వాళ్ల ఇంటికి వెళ్లి డబ్బు సం΄ాదించాలన్నది లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంరక్షణను ఉచితంగా అందిస్తున్నాం.

మాకు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, హైడ్రోథెరపీ, స్పోర్ట్స్, కౌన్సెలింగ్‌ సెషన్‌లు, ట్రైనింగ్‌ సెషన్లు, టైలరింగ్, కంప్యూటర్‌ క్లాసులు.. ఉన్నాయి. ఇది నా అనుభవపూర్వకమైన ఫ్రేమ్‌ వర్క్‌ నుండి పుట్టిన సంపూర్ణ వ్యవస్థ. ఇక్కడ వెన్నెముకకు అయ్యే గాయాలపై అవగాహన కల్పిస్తాం. మంచాన పడి ఉన్నప్పుడు నా జీవితాన్నీ ముగించుకోవాలనుకున్నాను.

కానీ, ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి దివ్యాంగుల పునరావాసం కోసం కృషి చేస్తున్నాను. వికలాంగుల సంక్షేమ సలహా మండలి సభ్యురాలిగా ఉన్నాను. నా లాంటివారిపై జాలిపడే బదులు సవాల్‌తో అవకాశాలను ఉపయోగించుకోవాని అర్థం చేసుకున్నాను. ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నప్పుడు ప్రత్యేక సవాళ్లే వస్తాయి. ప్రతిదాంట్లో విజయం సాధించడం పెద్ద విషయం కాదు. వచ్చిన సవాళ్లను అధిగమించడమే గొప్ప.

ప్రపంచం నా ముందున్న తలుపులన్నీ మూసివేసింది. కానీ, కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాను. సృష్టించాను. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తూ దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తూ నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను’ అని వివరిస్తుంది ప్రీతి శ్రీనివాసన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement