"తన కోపమే తనకు శత్రవు
తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ"!
అన్న పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నాం. చాలామంది దీన్ని పాటించలేరు. కోపం శక్తి అలాంటిది. మెరుపుదాడిలా వచ్చేస్తుంది. అయితే ఈ కోపం వల్ల శత్రవులు పెరుగుతారు అని తెలుసుకున్నాం గానీ ఇది ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రమాదకరమైనదే అట. కోపం కారణంగా శత్రుత్వం ఏర్పడి మనఃశాంతి కరువయ్యి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని విన్నాం గానీ. కచ్చితమైన ఆధారాలు లేవు. కానీ తాజా అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ కోపం గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. అంతేగాదు ఆ పరిశోధనల్లో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..
అమెరికన్ హార్ట్ అసోసీయేషన్ జర్నల్‌లో ఈ పరిశోధన గురించి ప్రచురితమయ్యింది. శాస్త్రవేత్తలు కేవలం కొన్ని నిమిషాల కోపం ఆరోగ్యానికి చేటని, అది రక్తనాళాల పనితీరుని మార్చగలదని గుర్తించారు. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని వెల్లడించారు. కోపం తీవ్రతపై గుండెపోటు ప్రమాదం ఆధారపడి ఉందని పరిశోధనలో వెల్లడయ్యిందన్నారు. కొద్దిపాటి కోపం హృదయ ఆరోగ్యాన్ని దారుణంగా దిగజారుస్తాయని అన్నారు.
అందుకోసం కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, న్యూయార్క్‌లోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ తదితర పరిశోధక బృందం సుమారు 280 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై అధ్యయనం నిర్వహించారు. వారిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక సముహాన్ని విచారం, ఆందోళన, కోపానికి గురయ్యే సంఘటనలకు గురి చేశారు. ఆ సముహం ఎనిమిది నిమిషాల వరకు ఈ స్థితిని ఫేస్ చేశారు.
అలాగే వారందర్నీ కోపాన్ని కంట్రోల్ చేసుకునేలా ఒకటి నుంచి 100 అంకెలు లెక్కపెట్టమన్నారు. అయితే వారిలో కొందరు మాత్రం తీవ్ర కోపానికి గురయ్యి బ్యాలెన్స్ తప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయా వ్యక్తుల రక్త నమునాలను పరిశీలించగా..కోపాన్ని నియంత్రించుకున్న వారికంటే..కోపానికి గురయ్యిన వారిలో రక్తనాళాలు విస్తరించే సామర్థ్యం గణనీయంగా తగ్గడం గుర్తించారు పరిశోధకులు.
అందులోనూ అప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ తీవ్ర కోపం కారణంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన ఈజీగా పడుతున్నట్లు కూడా గుర్తించారు. ఈ భావోద్వేగాలు కార్డియోవాస్కులర్ ఫిజియాలజీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధనలో నిర్థారించారు. ఈ అధ్యయనం మానవుని మానసిక స్థితి, హృదయ ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు పరిశోధకులు. అంతేగాదు ఈ పరిశోధన గుండె ఆరోగ్యం భావోద్వేగాలు, ఒత్తిడిని నిర్వహించడంపైనే ఆధారపడి ఉంటుందనేది హైలెట్ చేసిందని పరిశోధకులు తెలిపారు.
(చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment