అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి! | Grey Hair In Teens To Prevent This Home Remedies | Sakshi
Sakshi News home page

Grey Hair: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!

Published Sat, Aug 5 2023 10:56 AM | Last Updated on Sat, Aug 5 2023 11:11 AM

Grey Hair In Teens To Prevent This Home Remedies - Sakshi

ఒకప్పుడు యాభైఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చాలామందికి పాతికేళ్లకంటే ముందే తెల్లజుట్టు వచ్చేస్తోంది. దాంతో ఉన్న వయసు కంటే పెద్దగా కనిపించడం, దానిని కప్పి పుచ్చుకోవడానికి తలకు రకరకాల హెయిర్‌ డైలు, షాంపూలు వాడటం... వాటిలోని రసాయనాల ప్రభావంతో సైడ్‌ ఎఫెక్టులు రావడం... వీటన్నింటి బదులు అసలు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుందో చెబుతూ...దానిని నివారించడానికి తగిన సూచనలు, సలహాలతో కూడిన కథనం ఇది.

చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి గల అనేక కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ప్రధానం. డైట్‌లో పోషకాల కొరత ఉండకూడదు. తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్‌ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్‌లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్‌ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి.

రోజువారీ ఆహారంలో విటమిన్‌ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్‌ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్‌ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్‌ బి6, విటమిన్‌ బి12 కూడా ఉండే ఆహారాలని తినాలి.

శరీరంలో విటమిన్‌ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్‌ యాసిడ్‌ లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తుంది. కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీ, బీన్స్‌ ప్రతిరోజు డైట్‌లో ఉండేలా చూసువడం వల్ల తెల్లజుట్టు సమస్యను వాయిదా వేయచ్చు.

గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్‌ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్‌ చేసుకోవాలి. తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి ఒకటి.

ఓ గ్లాసుడు నీళ్లలో ఒకటిన్నర చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్‌ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.

మీ తలకు సరిపడేటన్ని మందార ఆకులు తీసుకుని పేస్ట్‌ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టుకి అప్లయ్‌ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

హెర్బల్‌ హెన్నాలో బీట్‌ రూట్‌ రసం కలిపి ప్యాక్‌ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.హెన్నా పౌడర్‌ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్‌ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. 

తెల్లజుట్టు ఉన్న వారు పెనంపై రెండు చెంచాల పసుపును వేసి వేడి చేసి నల్లగా మారేంత వరకు మాడ్చాలి. చల్లారిన తర్వాత దీనికి సరిపోయేంత కొబ్బరినూనె లేదా నువ్వులనూనెలో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి.



(చదవండి: కొంబుచా హెల్త్‌ డ్రింక్‌! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement