
మధుమిత బయోటెక్నాలజీ చదివారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ‘లా’ కూడా! ఇప్పుడిక మీరు చెప్పండి. ఆమె ఏ రంగాన్ని ఎన్నుకుని ఎటువైపు వెళితే రాణిస్తారు? కేవలం తను రాణించడం కోసం అయితే మనం ఏది చెప్పినా కరెక్ట్ అవుతుంది. ఇండియాలో ఒక కొత్త ఆవిష్కరణ చేయాలని అనుకున్నారు కనుకనే ఈవీ స్కూటర్‌పై ఆమె ఇండియాను రైడ్ చేయించబోతున్నారు! బిజినెస్ ఏదైనా పెడితే గట్టిగా ఉండాలి. గట్టిగా మాట్లాడాలి. గట్టిగా నిలబడాలి. బిజినెస్‌లో ఒక్కరే సీట్‌లో కూర్చొని ఉండరు. అసలు సీట్‌లో కూర్చొనే ఉండరు. బిజినెస్ మొదలు పెట్టినవారు మొదటి రోజు నుంచే సిబ్బందిలో సిబ్బందిగా కలిసిపోయి పని చేయిస్తుండాలి. పని చేస్తుండాలి. అనుకోని సమస్యలు వస్తే ధైర్యంగా పరిష్కరించుకోవాలి.
ఇక అది యంత్రాలను తయారు చేసి, విక్రయించే బిజినెస్ అయితే, వాటి మార్కెటింగ్ పెద్ద పని. కోట్లలో లాభం రావడానికి ముందు కనీసం లక్షల్లోనైనా నష్టం రావచ్చు. తట్టుకోవాలి. ఇంతగా పడీపడీ చేసే శక్తి, పడి లేచే యుక్తి మహిళలకు ఉంటాయా? ఉండవని సమాజంలో అపోహ. చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేసే వరకు మహిళలు తమను తాము నిరూపించుకోగలరు కానీ.. బిజినెస్‌లో పెట్టుబడి పెట్టి, బిజినెస్‌కు పెట్టుబడులు సమీకరించి, బిజినెస్‌ను లాభాల్లో నడపడం మహిళల్లో నూటికో కోటికో ఒక్కరికే సాధ్యం అనే మాట నేటికీ వినిపిస్తూనే ఉంది. అయితే మధుమిత చక్కగా చదువుకోవడమే కాదు, చదువుకు తగ్గ బిజినెస్‌ను ఎంచుకుని ‘లాంచింగ్’కి సిద్ధంగా ఉన్నారు. ‘ఒబెన్’ పేరుతో ఆమె ఉత్పత్తి చేస్తున్న ఈవీ స్కూటర్‌లు వచ్చే మే నెలలో మార్కెట్‌లోకి రాబోతున్నాయి! ఈవీ అంటే.. ఎలక్ట్రిక్ వెహికల్.
మధుమితా అగర్వాల్ డిజైన్ చేసిన ఈవీ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చిందంటే.. ఆ స్కూటర్‌తో పాటే, దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓనర్‌గా ఆమెకూ గుర్తింపు వస్తుంది. అవును. ఇండియాలో ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ విదేశీ ఔట్‌సోర్సింగ్‌తో తయారైన ఈవీలే. ‘ఒబెన్’ కంపెనీ కో–ఫౌండర్ మధుమిత. ఈ సార్టప్‌కు ముఖ్య వ్యవస్థాపకురాలు కూడా మధుమితే అని చెప్పాలి. ఇండియాలో ఒక ఈవీ స్కూటర్‌ల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించాలన్న ఆలోచన ఆమెదే కనుక. ఒబెన్ బెంగళూరులో ఉంది. ఆ నగరంలోనే ఉన్న ‘ఐపెక్సెల్’ అనే టెక్నాలజీ, ఇన్నొవేషన్ కన్సల్టేషన్ సంస్థ కూడా మధుమత స్థాపించినదే! ఐఐటి, ఐఐఎం లలో చదివాక ఆమె ఏ కాస్తయినా విరామం తీసుకున్నట్లు లేరు.
ఒడిశాలోని రూర్కెలాలో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, బెంగళూరులో ఒక యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు మధుమిత. ‘ఐపెక్సెల్’ మిలియన్ డాలర్ల కంపెనీ. మధుమిత చూస్తే ఈ ఏడాదే యూనివర్సిటీ చదువు ముగించుకుని బయటికి వచ్చినట్లుగా ఉంటారు. మధుమిత ‘లా’ కూడా చదివారు! తర్వాతే వ్యాపారవేత్తగా తన దారి మార్చుకున్నారు. ఇప్పుడిక నిరాటంకంగా సాగే ఒక ప్రీమియం స్కూటర్‌ని భార తీయులకు అందించేందుకు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నారు.
‘‘ఏదైనా ఒక పరిశ్రమకు యజమానిగా ఉన్నది మహిళ అని తెలియగానే.. ముందుకు రాబోయిన పెట్టబడి దారులు కూడా వెనక్కి తగ్గిపోతారు. ఇక ఆ పరిశ్రమ ఉత్పత్తుల పని తీరు సామర్థ్యంపై వినియోగదారుల నమ్మకాన్ని పొందాలంటే ఆ మహిళ, ఆమె నేతృత్వంలోని తక్కిన శాఖల సిబ్బంది ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా.. ఆమె ఎంత బిజినెస్‌ఉమన్ అయినప్పటికీ ఆమెకు ఆమె కుటుంబం మద్దతు ఉండాలి. కుటుంబం ఒక్కటి పక్కన నిలిస్తే చాలు ఆమె తన పరిశ్రమను నిలబెట్టగలదు. పది మందికి ఉపాధిని ఇవ్వగలదు’’ అంటారు మధుమితా అగర్వాల్. ఆమెకు ఆమె భర్త దినకర్ అగర్వాల్ నుంచి పూర్తి సహకారం ఉంది. ‘ఒబెన్’లో ఆయన ఆమె భాగస్వామి కూడా!
ఖరగ్‌పూర్‌లో ఐఐటి., బెంగళూరులో ఐఐఎం చదివారు మధుమిత. 2020 ఆగస్టులో ‘ఒబెన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. ఇండియాలో ఈవీ కంపెనీ ప్రారంభించిన తొలి మహిళ మధుమిత. ఈ కంపెనీ నుంచే మరో రెండు నెలల్లో తొలి స్కూటర్ బయటికి వస్తోంది. బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివాక, మధుమిత ‘లా’ వైపు రావడానికి కారణం కెరీర్ ఎంపికకు సంబంధించిన ఊగిసలాట కాదు. పేటెంట్ చట్టాల మీద ఆసక్తి కొద్దీ చదివారు. అందులో ఆమె స్పెషలైజేషన్ ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ’. ఖరగ్‌పూర్ ఐఐటిలో మధుమిత చదివింది ఈ కోర్సునే. ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నప్పుడే 2016లో ఆమెకు ‘ఐపెక్సెల్’ను ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది.
కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలా మెరుగుపరుచుకోవాలి, కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడానికి మార్కెట్‌ను ఎలా స్టడీ చేయాలని అని ఐపెక్సెల్ సలహాలు ఇస్తుంటుంది. ఇప్పుడైతే మధుమిత తన పూర్తి సమయాన్ని ‘ఒబెన్’కే కేటాయించారు. నిజానికి గత నాలుగేళ్లుగా ఒబెన్ కోసమే పని చేస్తున్నారు. ఈవీ స్కూటర్‌కు ప్రాథమికంగా ఒక డిజైన్‌ను రూపొందించేందుకు మధుమిత సుదీర్ఘమైన అధ్యయనమే చేశారు. చివరికి భారతీయ రహదారులకు తట్టుకుని, నిరంతరాయంగా నడిచే ప్రీమియర్ స్కూటర్‌ను తయారు చేశారు. ఆ నమూనాను పరీక్షించి, ఫైనల్ చేసుకున్నారు. మన రోడ్ల మీద తిరుగుతున్న విదేశీ ఈవీలకు దీటుగా, అంతకన్నా మెరుగ్గా మన దేశవాళీ ఈవీ ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఇందులోకి దిగాం’’ అని మధుమిత చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment