చేసిన మేలుకు కృతజ్ఞతగా ‘చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా’ అనే మాటను సాధారణంగా వినే ఉంటాం కదా. కానీ ఎక్కడా చూసి ఉండం. కానీ మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన ఒక వ్యక్తి అక్షరాలా దీన్ని చేసి చూపించాడు. అదీ నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కృతజ్ఞతతో.. శ్రీరాముడి స్ఫూర్తితో. దీనికి సంబంధించిన స్టోరీ ఇపుడు నెట్టింట విశేషంగా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్ ఒకప్పుడు రౌడీ షీటర్. తన చర్మంతో తన తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమానంగా ఇచ్చాడు. అదీ రామాయణం స్ఫూర్తితో. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపిన భక్తికి , ప్రేమకు చలించిపోయాడు రౌనక్. తాను కూడా అమ్మకోసం ఏదైనా చేయాలనుకున్నాడు.
అందుకోసం ఏకంగా కుటుంబంలో ఎవరికీ తెలియకుండా ఓ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని, తొడ భాగంలోని కొంత చర్మాన్ని తొలగించి, దానితో తల్లికి సరిపోయేలా ఆ చర్మంతో చెప్పులు తయారు చేయించాడు. (ఇదే తొడమీద ఒకప్పుడు పోలీసులు కాల్పులు జరిపారట.) మార్చి 14 - 21 మధ్య తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన భగవత్ కథలో రౌనక్ తన తల్లికి ఆ చెప్పులు సమర్పించి తల్లి పాదాలపై మోకరిల్లాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన కదిలించింది.రౌనక్ క్రమం తప్పకుండా రామాయణం పారాయణం చేస్తాడట. ఈ క్రమంలోనే శ్రీరాముడి పాత్ర తనలో స్ఫూర్తి నింపిందని చెప్పుకొచ్చాడు.
తన చర్మంతో తనకు చెప్పులు కుట్టిస్తాడని ఊహించలేదంటూ రౌనక్ తల్లి కన్నీళ్లుపెట్టుకున్నారు. రౌనక్ లాంటి కొడుకును కనడం అదృష్టంగా భావిస్తున్నానంటూ, నిండు నూరేళ్లుగా చల్లగా వర్ధిల్లమని కొడుకుని మనసారా దీవించి గుండెనిండా హత్తుకుందామె
Comments
Please login to add a commentAdd a comment