కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సాయం.. జీ20 సదస్సుకు ఫెషాలికా | Meet Shaifalika Panda, Convener G20 Empower Working Group | Sakshi
Sakshi News home page

Shaifalika Panda : వ్యాపారవేత్త కావాలనుకుంది..కానీ మహిళా సాధికారత కోసం అడుగులు వేసింది

Published Sat, Sep 9 2023 10:29 AM | Last Updated on Sat, Sep 9 2023 12:16 PM

Meet Shaifalika Panda Convener Who Participates In G20 Mentorship - Sakshi

పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌ కావాలని కలలు కన్న షెఫాలికా పండా ఆ కలకు దూరమై పేదలకు దగ్గరైంది. మహాపట్టణం నుంచి మారుమూల పల్లె వరకు ఎన్నో ప్రాంతాలు తిరిగింది.తమ ఫౌండేషన్‌ తరఫున ఎంతోమందికి అండగా నిలబడింది.కష్టాలు, సమస్యల్లో ఉన్నవారికి సహాయం చేయడమే కాకుండా స్త్రీ సాధికారతకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ‘జీ20 ఎంపవర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఆన్‌ మెంటార్‌షిప్‌’ కన్వీనర్‌గా స్త్రీ సాధికారతకు సంబంధించి విస్తృత స్థాయిలో పనిచేసే అవకాశం షెఫాలికా పండాకు లభించింది...

కాలేజీ రోజుల్లో ‘సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’ కావాలని కలలు కనేది షెఫాలికా. అయితే ఒకానొక సంఘటనతో ఆమె కలల దారి మారింది. తమ బంధువు ఒకరు అనారోగ్యం పాలుకావడంతో, ఒడిషాలో సరిౖయెన వైద్య సదుపాయాలు లేకనోవడంతో దిల్లీకి తీసుకుపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి అసౌకర్యాల వరకు ఎన్నో సంఘటనలను దగ్గరగా చూసింది షెఫాలికా పండా.బ‘చదువుకున్న వారు, ఆర్థికంగా కాస్త మెరుగైన స్థితిలో ఉన్నవారి పరిస్థితే ఇలా ఉంటే ఒడిశాలోని మారుమూల ప్రాంతాలలో ఉండే పేద ప్రజల పరిస్థితి ఏమిటి?’ అని ఆలోచించింది. ఆ ఆలోచనల ఫలితంగా సేవారంగంలోకి వచ్చిన షెఫాలికా ఎంతోమంది పేదలకు అండగా నిలబడింది.

బన్సిధర్‌ అండ్‌ ‘ఇలా పండా’ ఫౌండేషన్‌ ద్వారా సామాజిక సేవాకార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లింది.‘నాయకుల ఎదుగుదలకు సంబంధించి అనుభవం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎంత అనుభవం ఉంటే అంత బలం సమకూరుతుంది. సామాజిక సేవా రంగంలో పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సమాజంలో సానుకూల మార్పు తేవాలనుకునేవారికి సమస్యను అర్థం చేసుకోవడంతో పాటు దానిపై పని చేయడానికి చాలా ఓపిక కావాలి. సామాజిక సేవలో మా అత్తమ్మ ‘ఇలా పండా’ నాకు ఆదర్శం. ఎలాంటి ఆడంబరం లేకుండానే ఎన్నో సంవత్సరాలు సేవ చేసింది.

ఎండనకా, వాననకా తిరిగినా ఆమె ముఖంలో ఎప్పుడూ అలసట కనిపించేది కాదు. సామాజిక సేవ తన ఆరోగ్య రహస్యంగా చెప్పుకునేది. ఆమె చురుకుదనం, సామాజిక సేవాదృక్పథాన్ని చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందారు. అందులో నేను ఒకరిని’ అంటుంది షెఫాలికా. ‘అవసరం ఉన్న చోట మేముంటాం’ అనే నినాదంతో బన్సిధర్‌ అండ్‌ ‘ఇలా పండా’ ఫౌండేషన్‌ ట్రస్టీ, సీయివోగా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టింది.‘మహిళలపై ప్రధానంగా దృష్టి పెట్టడానికి కారణం అసమానత, లింగ వివక్షత. మహిళల జీవితాలు మారాలంటే ఆమె పిల్లల జీవితాల్లో కూడా మార్పు రావాలని బలంగా నమ్ముతాను’  అంటుంది షెఫాలికా.

అవకాశాలు దొరికేవారు, దొరకని వారు అని మహిళలకు సంబంధించి రెండు రకాల వర్గీకరణలున్నాయి. అవకాశాలు దొరికేవారు సులభంగానే విజయం సాధించి పెద్ద స్థాయికి చేరుకుంటారు. మరి దొరకని వారి పరిస్థితి ఏమిటి? సాంకేతిక, జీవన నైపుణ్యాలు, చదువు రూపంలో అలాంటి వారిని వెలుగులోకి తీసుకువచ్చి విజయపథంలోకి తీసుకువెళ్లడంపై, మహిళలకు సమాన అవకాశాలు ఎలా కల్పించాలనే దానిపై జీ20 సదస్సు దృష్టి పెడుతుంది. జీ20 ఉమెన్స్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వ్యాపారవేత్తలు కావాలనుకునేవారికి, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఎంతో మేలు జరుగుతుంది. 30,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్‌ల అనుభవాలు పాఠాలుగా ఉపయోగపడతాయి.


– షెఫాలికా,
కన్వీనర్, జీ20 ఎంపవర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఆన్‌ మెంటర్‌షిప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement