ప్రశ్న: కోవిడ్ భయంతో చాలామంది ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఉంచుకుంటున్నారు.. ఇది కరెక్టేనా? ఈ విషయంలో అనవసర భయాలు ఎక్కువయ్యాయని వైద్యులంటున్నారు.. ఏమిటవి?
జవాబు: వైరస్ సోకగానే భయపడకూడదు. ఏదో అయిపోతుందని చాలామంది భయపడుతున్నారు. అనవసరంగా భయపడటం వల్లనే ప్రాణాంతకంగా మారుతోంది. ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తే శరీరంలోని లెవెల్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఉపయోగించాలి. అంతేకానీ వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఆక్సిజన్ పెట్టుకోవడం సరికాదు. మార్కెట్లో కొరత ఉందని ఆక్సిజన్ సిలిండర్లు ముందుగా కొనుగోలు చేసుకొని ఉంచుకోవడం సరికాదు. దీనివల్ల నిజంగా అవసరమైన వారికి దొరకక పోవచ్చు. ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవచ్చు.
ఆక్సిజన్ థెరపీ అంటే ఏమిటి? దీనివల్ల ఏమిటి ఉపయోగం?
మనిషిని బోర్లా పడుకోబెట్టి మసాజ్ చేయడం, చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌ల ద్వారా ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు పంపించే ప్రయత్నాన్ని ఆక్సిజన్ థెరపీ అంటారు. మనిషికి శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఆయాసం రావడం, చెమటలు రావడం వంటివి జరుగుతాయి. ఆ సమయంలో యోగా, ఇతర ఎక్సర్‌సైజ్‌లు తెలిసినవారు కొన్ని జాగ్రత్తలతో ఆక్సిజన్ థెరపీ ఇస్తారు. దీనివల్ల ఎంతవరకు ఆక్సిజన్ సమకూరుతుంది అనేది కచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఈ ఆపద సమయంలో సొంత ప్రయోగాలు మానుకోవడం మంచిది.
ఫస్ట్ వేవ్ లో కన్నా, సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ తగ్గుదల కేసులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒక్కరోజులోనే సీరియస్ అవుతోందని కూడా వినిపిస్తోంది.. నిజమేనా?
సెకండ్ వేవ్‌లో వైరస్ జన్యుమార్పిడి వల్ల రూపాంతరం చెందింది. దీనివల్లే కావొచ్చు.. ఫస్ట్ వేవ్‌లో కన్నా సెకండ్ వేవ్‌లో రోగుల శరీరంలో ఆక్సిజన్ వేగంగా తగ్గుతోందనే మాట నిజం. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతుండటంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. ఫస్ట్ వేవ్‌లో భయం ఎక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ప్రభావం ఇంతగా కనిపించలేదు.
హ్యాపీ హైపోక్సియా అంటే ఏమిటి? ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నట్టుగా తెలియదట.. నిజమేనా?
కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నప్పటికీ తెలియదు. శ్వాస తీసుకోవడంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో అంతా బాగానే ఉందనుకుంటారు. దీనినే హ్యాపీ హైపోక్సియా అంటారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఇలా జరుగుతుంది. మిగతా వారికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినప్పుడు శ్వాస సరిగా ఆడక పోవడం, దమ్ము రావడం, కొద్ది దూరం నడిస్తే ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరు జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పటికీ తెలియక పోవడం వల్ల.. ఒక్కసారిగా పరిస్థితి తీవ్రంగా మారొచ్చు. అయితే కేవలం 4% రోగుల్లో మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుంది.
కర్పూరం, తదితరాలు కలిపి వాసన పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత?
కర్పూరం తదితరాలతో ఆక్సిజన్ మెరుగుపడుతుందనే అంశం ఇప్పటివరకు సైంటిఫిక్‌గా నిర్ధారణ కాలేదు. ప్రజలకు కోవిడ్‌పై సరైన అవగాహన లేకపోవడంతో భయపడుతున్నారు. ఈ సమయంలో ఎవరే చిన్న విషయం చెప్పినా నమ్ముతున్నారు. ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నారు. నిజానికి కోవిడ్ పాజిటివ్ బాధితులందరికీ ఆక్సిజన్ అవసరం లేదని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు చెçబుతున్నారు. కానీ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొందరు చెప్పడం లేదు. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. మరోవైపు ఆక్సిజన్ పెట్టాలని, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యుల కంటే ముందే రోగి బంధువులు ఒత్తిడి చేస్తున్నారు. కొంత మందైతే ఏకంగా ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో నిల్వ ఉంచుతున్నారు. దీంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందకుండాపోతోంది.
అసలు ఎవరికి ఆక్సిజన్ అవసరం? ఏ స్థాయిలో అవసరం..?
రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పల్స్ ఆక్సిమీటర్ ద్వారా పరిశీలిస్తాం. ఎస్పీఓ2 (ఆక్సిజన్) సాధారణంగా 95 నుంచి 100 మధ్య ఉండాలి. దీనిని ఆక్సిజన్ సాచురేషన్‌గా పిలుస్తాం. ఇది 95 కంటే తక్కువగా ఉంటే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సిలిండర్ ద్వారా 1నుంచి 15 లీటర్ల ఆక్సిజన్ ఇవ్వొచ్చు. అంతకంటే ఎక్కువగా అవసరం ఉంటే పరికరాల ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. 15 లీటర్ల కన్నా ఎక్కువ అవసరముంటే నాజల్ క్యాన్‌లా అనే పరికరం ద్వారా ఇవ్వొచ్చు. దాదాపు 100 శాతం ఇవ్వొచ్చు.
నెబులైజర్‌తో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంత?
ఎంతమాత్రం వాస్తవం కాదు. నెబులైజర్ అనేది పూర్తిగా ఆస్తమా రోగులకు, అయాసంతో బాధపడే వారికి.. ఊపిరితిత్తుల్లో గొట్టాలు తెరుచుకోవడానికి, లోపల ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికివాడే పరికరం. నెబులైజర్ శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉపయోగించే పరికరం. అంతేకానీ దీంతో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయనేది ఎక్కడా లేదు.
అస్తమా రోగులకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటి?
అస్తమా రోగులు కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు సాధారణంగా వాడే మందులు క్రమం తప్పకుండా వాడుతూ జాగ్రత్తగా ఉండాలి.
కొందరు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ముందే కొని పెట్టుకుంటున్నారు? దీనివల్ల ఉపయోగం ఉంటుందా?
ఉపయోగమే. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ నుంచి బయటపడిన రోగులకు ఆక్సిజన్ అవసరం ఉంటే ఈ పరికరం ఉపయోగపడుతుంది. సాధారణంగా 8 నుంచి 10 లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఈ పరికరం సరిపోతుంది. అయితే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా సరఫరా అయ్యే ప్రెషర్ దీని ద్వారా రాదు. ఇది ఇంట్లో తప్పనిసరిగా ఆక్సిజన్ వాడాల్సిన వారికి మాత్రమే ఉపయోగకరం. న్యూమోనియా, ఊపిరితిత్తులో ఇన్‌ఫెక్షన్ ఉన్న రోగులకు మాత్రమే అవసరం. ఏదైనా వైద్యుల సలహా మేరకు ఉపయోగించాల్సి ఉంటుంది.
అరచేయి మీద అక్యుప్రెషర్ చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి అంటున్నారు.. వాస్తవమేనా?
అవాస్తవం. ఇది అపోహా మాత్రమే. ఆక్సిజన్ లెవల్స్ అనేవి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే తగ్గుతాయి. యోగ, ఫిజియోథెరపీ, శ్వాసకు సంబంధించిన వ్యాయామాల ద్వారా మాత్రమే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.
Corona: రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయా? ఈ టెక్నిక్ ఫాలో అవండి
Comments
Please login to add a commentAdd a comment