నటి ఒలివియాకి కేన్సర్‌! ఏకంగా నాలుగు సర్జరీలు..! | US Actor Olivia Munn Shares Cancer Diagnosis | Sakshi
Sakshi News home page

నటి ఒలివియాకి కేన్సర్‌! ఏకంగా నాలుగు సర్జరీలు..!

Published Thu, Mar 14 2024 11:59 AM | Last Updated on Tue, Oct 29 2024 12:37 PM

US Actor Olivia Munn Shares Breast Cancer Diagnosis - Sakshi

సెలబ్రెటీల దగ్గర నుంచి ప్రముఖుల వరకు చాలామంది ఈ బ్రెస్ట్‌ కేన్సర్‌ బారినే పడుతున్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్లో తెలియదు గానీ ఈ భయానక వ్యాధుల బారిన పడటం జరుగుతోంది. అయితే ఈ రొమ్ము కేన్సర్‌ కొందరిలో రెండు రొమ్ములోనూ, మరికొందరిలో ఒక్కదానిలోనే వస్తోంది. అయితే చాలావరకు దీన్ని ముందుగానే గుర్తించడం సాధ్యపడదు. పైగా ఒక్కోసారి ఇది నిర్థారణ అయ్యాక వేగవంతంగా విస్తరిస్తుంటుంది. చాలా కేసుల్లో రేడియోథెరఫీతో నివారించగా, మరికొన్ని కేసుల్లో పూర్తిగా రొమ్ముని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రోమ్ము కేన్సర్‌కి సంబంధించిన  ఆసక్తికర విషయాలు వివరంగా తెలుసుకుందామా!.

యూఎస్‌ నటి ఒలివియా మున్‌ గతేడాది రొమ్ము కేన్సర్‌ బారిన పడినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ఈ విషాదకర వార్త తన చెవిన పడిందంటూ చెప్పుకొచ్చింది. తాను ఆ టైంలో పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడేంత వరకు ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తన రెండు రొమ్ముల్లో ఈ కేన్సర్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని పేర్కొంది. అయితే ఈ కేన్సర్‌ చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు స్కానింగ్‌లో తేలింది. దీంతో తాను డబల్‌ మాస్టెక్టమీ చేయించుకున్నాని అని తెలిపింది.

ఆ తర్వాత సుమారు పది నెలల వరకు దాదాపు నాలుగు శస్త్ర చికిత్సలు చేయించుకున్నానని చెప్పింది. ఈ హెల్త్‌ జర్నీలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో మద్దతివ్వడం వల్లే దీన్నుంచి బయటపడగలిగానని చెప్పుకొచ్చింద. ఆమె ఇటీవల 2024 ఆస్కార అవార్డుల వేడుకల్లో తన భాగస్వామితో కలిస రెడ్‌కార్పెట్‌పై మెరిసింది కూడా. ఈ నేపథ్యంలో బ్రెస్ట్‌ కేన్సర్‌ ఇంత ప్రమాదమా? అన్ని  సర్జరీలు తప్పవా? అనే ఆసక్తికర విషయాలు చూద్దాం!.

రొమ్ము కేన్సర్‌ అంటే..
రొమ్ము క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఆదిలోనే గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. దీని కారణంగా రొమ్ములోని కణాలు నియంత్రణ లేకుండా పెరుగుతాయి. ఇది ఎక్కువగా స్త్రీలకు వస్తుంది. చాలా అరుదైన సందర్భాల్లో పురుషులకు వస్తుంది. అంతేగాదు మహిళ్లో కూడా కొందరికీ రెండు రొమ్ములోనూ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. 

ఎవరికీ ఎక్కువంటే..

  • కుంటుంబ సభ్యుల్లో ఎవరికైనా రొమ్ము కేన్సర్‌ ఉంటే వచ్చే అవకాశాలు ఉంటాయి. 
  • ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన మహిళలకు వస్తుంది. అంతేగాదు 12 సంవత్సరాల కంటే ముందు రజస్వల అయినా లేదా 55 సంవత్సరాల తరువాత మోనోపాజ్‌ దశలో కూడా ఈ రోమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 
  • ఊబకాయం, అధికబరువు, వల్ల రోమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
  • అధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకునేవాళ్లు కూడా ఈ కేన్సర్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 
  • పొగాకు, మద్యపానం సేవించే వారు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. 

లక్షణాలు..

  • రొమ్ములో నొప్పి లేకుండా గడ్డలుగా ఉండటం
  • రొమ్ముపై చర్మం మసకబారడం
  • చనుమొనలపై దద్దుర్లు లేదా పుండ్లు
  • చనుమొనల ఆకృతిలో మార్పులు
  • చనుమొనల గుండా రక్తపు మరకల్లా కనిపించడం
  • చంకలో వరకు రొమ్ము నిండుగా ఉన్నట్లు కనిపించటం

చికిత్స విధానాలు..

  • శస్త్రచికిత్స
  • రేడియోథెరపీ
  • హార్మోన్ ల థెరపీ
  • కీమోథెరపీ

ఈ బ్రెస్ట్‌ కేన్సర్‌లో చాలా వరకు కణితిని మాత్రమే తొలగించేందుకు సర్జన్లు యత్నిస్తారు. దీనిని బ్రెస్ట్‌ కన్జర్వేషన్‌ సర్జరీ(Breast Conservation Surgery) అని అంటారు. కేన్సర్ తిరిగి వచ్చే అవకాశాలను తగ్గించడం కొరకు ఆపరేషన్ తరువాత కూడా రోగులకు రేడియేషన్, కీమోథెరపీ వంటివి ఇవ్వడం జరుగుతుంది. 

నివారణ..
ఏ కేన్సర్‌ అయినా ముందుగానే గుర్తిస్తే ప్రమాదం నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే ఎప్పటికప్పుడూ మహిళలు ఏడాదికి ఒక్కసారైన రొమ్ముకి సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. 
ముఖ్యంగా బరువుని అదుపులో ఉంచుకోవాలి
రోజూ వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటివి చేస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. 

(చదవండి: నో స్మోకింగ్‌ డే! ఆ వ్యసనానికి చెక్‌పెట్టే ఆహారపదార్థాలివే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement