అటు బామ్మ సీక్రెట్, ఇటు అమ్మను మించిన అమ్మ అత్తగారి సాయంతో సక్సెస్‌పుల్ బిజినెస్ విమెన్‌గా అవతరించింది ఓ కోడలు. హెర్బల్ హెయిర్ ఆయిల్ వ్యాపారంలో దూసుకుపోతున్న ఈ అత్తా కోడళ్ల జంట నెలకు రూ. 50లక్షలకు పైగా సంపాదిస్తున్నారు. ఈ అద్భుతమైన వీరి వ్యాపార ప్రస్థానం ఎలా మొదలైందో తెలియాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
గురుగ్రామ్‌కు చెందిన అత్తా కోడళ్లు తమ బంధానికి కొత్త అర్థం చెప్పారు. విజయవంతమైన వ్యాపార మహిళలుగా రాణించడమే కాదు తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. అసలు ఈ వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందంటే..
జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరికీ పెద్ద సమస్య. ఐటీ ఉద్యోగి నిధికీ ఈ సమస్య బాగా ఉండేది. 2019 వరకు ఊటీ ఉద్యోగంలో ఉంది. 2010లో పెళ్లి. మూడేళ్ల తరువాత ఒక కొడుకు పుట్టాడు. కానీ కొడుకుకు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆమె తన ఉద్యోగాన్ని విడిచి పెట్టి, కుమారుడుపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. ఈ సమయంలో ఏదైనా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన అస్సలు లేదు. కానీ ఆర్థికంగా బలపడాలని, ఏదైనా చేయాలని మాత్రం అనుకుంటూ ఉండేది. ఒక రోజు తన జుట్టు సమస్యను కూడా అత్తగారు రజనీ దువాకు చెప్పుకుంది. ఆమెకు కూడా ఇదే సమస్య ఉండటంతో ఏదైనా చేయాలని ఇరువురూ నిర్ణయించుకున్నారు. ఇక్కడే వీరి జీవితాల్లో సరికొత్త అధ్యాయం షురూ అయింది. చిన్నపుడు బామ్మ చేసే మసాజ్, ఆయిల్ గుర్తొచ్చాయి నిధికి. ఐడియా మెరిసింది. అత్తగారితో కలిసి రంగంలోకి దిగిపోయింది.
చాలా మంది స్త్రీలకు కూడా ఇదే సమస్య ఉందని గమనించారు. అలాగే, ఈ సమస్య నుండి బయటపడటానికి, ఆన్‌లైన్‌లో ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా, చవకగా, ఇంతకంటే మంచి, సహజమైన ఉత్పత్తులు ఎందుకు తయారు చేయకూడదని ప్రశ్నించుకుంది. అంతే ఆమె తల్లి, బామ్మ చెప్పిన చిట్కాలతో మంచి రెసిపీని తయారు చేసింది. ఇది మంచి ఫలితాలనిచ్చింది. చుట్టు పక్కల వాళ్లు కూడా బావుంది అంటూ కితాబిచ్చారు. అంతే 2023, మార్చిలో 'నిధిస్ గ్రాండ్‌మా సీక్రెట్' పేరుతో హెర్బల్ హెయిర్ ఆయిల్ వ్యాపారానికి నాంది పలికింది.
అత్తగారి సంపూర్ణ మద్దతుతో పూర్తి సహజసిద్దమైన తలనూనె తయారీ మొదలు పెట్టింది. “నూనెలో ఉపయోగించే చాలా పదార్థాలు నా తోటలో మాత్రమే పెరుగుతాయి. అలోవెరా, మందార పువ్వులు, కరివేపాకు లాంటి ఇతర సహజ పదార్థాలతో, ఇంట్లోనే తయారు చేస్తాం. మా తోటలోనే పెద్ద కుండలో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడం మొదలు పెట్టామని నిధి తెలిపింది. ప్రతి నెల దాదాపు 200 నుండి 300 ఆర్డర్‌లు వస్తాయని తెలిపింది.
సోషల్ మీడియాతో షాపింగ్
ఆరంభంలో సోషల్ మీడియా గ్రూప్‌లో చుట్టుపక్కల మహిళలకు నూనె అమ్మడం ప్రారంభించింది. అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ రావడంతో వారిలో నమ్మకం ధైర్యంపెరిగింది. ఇదే ఉత్సాహంతో నిధి సోషల్ మీడియాలో మరింత ప్రచారాన్ని మొదలు పెట్టింది. చిన్న రీల్స్‌తో నూనెను ఎలా తయారు చేస్తుందో వివరించేది. క్రమంగా ఈ రీల్స్ వైరల్ అయ్యాయి. నెటిజన్స్, ముఖ్యంగా మహిళల ఆదరణకు నోచుకున్నాయి. ఫలితంగా ఆర్డర్‌లు పెరిగాయి.
'నిధిస్ గ్రాండ్‌మా సీక్రెట్’ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్ విక్రయాలను మొదలు పెట్టారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ, కండీషనర్, స్కాల్ప్ స్క్రబ్, హెయిర్ ఆయిల్ కాంబో ప్యాక్ లాంటి ఉత్పత్తులను విక్రయిస్తుంది. దీనికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్‌లో ఆయిల్ 67వేల మందికి చేరుకుంది, లక్షకు పైగా బాటిళ్లను విక్రయించి, నెలవారీ రూ. 50 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 'నిధిస్ గ్రాండ్‌మా సీక్రెట్’ అనే ఇనస్టాకు 71 వేలకు పైగా ఫాలోయర్లు ఉండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment