మొన్నటి ‘పెర్సీ’ రోవర్‌తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్‌లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్‌లకు, తాజా పెర్సీ రోవర్‌కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్‌లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్‌గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ.
నాసా ఆఫీస్‌లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్‌ల నియంత్రణకు స్క్రీన్‌ప్లే వంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్‌లలో ఒక్క సోజర్న్ రోవర్‌కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్‌వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్‌లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పైలట్.
ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్‌లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్‌డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్‌గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు.
అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్‌ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్‌ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్‌వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్‌ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్‌వేర్‌కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్‌ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
నాసా లేబరేటరీలో రోవర్‌ల మధ్య వందన
Comments
Please login to add a commentAdd a comment