Pakistan Demand Afghanistan to Be Part Of SAARC 2021 Summit - Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ని సాగనంపాల్సిందేనా?

Published Tue, Sep 28 2021 12:30 AM | Last Updated on Fri, Oct 1 2021 5:56 PM

Ravindra Kishore Sinha Guest Column On Attitude Of Pakistan - Sakshi

పాకిస్తాన్‌ ప్రదర్శిస్తున్న అత్యంత ప్రతికూల వైఖరి కారణంగా సార్క్‌ ఉద్యమం బలహీనపడుతోంది. సార్క్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అఫ్గానిస్తాన్‌ లోని తాలిబన్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని పాక్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. తాలిబన్ల హృదయాల్లో మానవహక్కులకు అసలు తావులేదు. అందుకే పాకిస్తాన్‌ చేసిన అసంబద్ధమైన డిమాండ్‌ను సార్క్‌ దేశాలు తోసిపుచ్చాయి. సార్క్‌ సభ్యదేశంగా పాక్‌∙కొనసాగినంతవరకు ఈ కూటమికి భవిష్యత్తు లేదన్నది వాస్తవం. కూటమిని మరింత బలోపేతం చేసుకోవడానికి గొప్ప అవకాశం ఇప్పుడు ‘సార్క్‌’కు అందుబాటులో ఉంది.

దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర సహకారాన్ని, స్నేహ భావాన్ని విస్తరింపజేసే బలమైన వేదిక అయిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య(సార్క్‌)ని ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్‌ ఈరోజుకీ ప్రయత్నిస్తూనే ఉంది. పాక్‌ వైఖరి అత్యంత ప్రతికూలంగా ఉంటోంది. దీనివల్లే సార్క్‌ వేదిక స్తంభించిపోయింది. అఫ్గానిస్తాన్‌లో ఇటీవలే అధికారంలోకి వచ్చిన తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధులను సార్క్‌ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సుకు ఆహ్వానించాలని పాక్‌ ఇటీవలే డిమాండ్‌ చేసింది. ఈ సదస్సు ఇటీవల ఐక్యరాజ్యసమితి 76వ వార్షిక సమావేశాల్లో భాగంగా జరగాల్సింది. అయితే ఇతర సార్క్‌ దేశాలు ఈ అంశంపై చర్చకు సిద్ధంగా లేనందున అవి ఈ సదస్సును తమకు తాముగా రద్దు చేసుకున్నాయి. పాకిస్తాన్‌ డిమాండ్‌ను ఆమోదించడం అంటే, అత్యంత ప్రతీఘాతుకత్వంతో, ఉగ్రవాద అనుకూల స్వభావంతో, మహిళా వ్యతిరేకతతో నడుస్తున్న అఫ్గాన్‌ ప్రభుత్వాన్ని నేరుగా లేదా పరోక్షంగా అయినా సరే సమర్థించడమేనని సార్క్‌ దేశాలు భావించాయి.. తాలిబన్‌ హృదయాల్లో మానవహక్కులకు అసలు తావులేదు. అందుకే పాకిస్తాన్‌ చేసిన అసంబద్ధమైన డిమాండ్‌ను సార్క్‌ దేశాలు తోసిపుచ్చాయి.

మన ప్రధాని నరేంద్రమోదీ 2014లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సార్క్‌ దేశాల అధినేతలను ఆహ్వానించారు. బలహీనపడుతున్న సార్క్‌ కూటమిని తిరిగి పునరుద్ధరించాలని ప్రధాని గట్టి చొరవ చేశారు.  కాని ఈ లక్ష్యసాధనను నెరవేర్చే క్రమంలో పాక్‌ నిరంతరం ప్రతిబంధకాలను సృష్టిస్తూపోయింది. ఈ కూటమిలో వీలైనంత ఎక్కువగా తన అరాచకాన్ని విస్తరించేందుకు పాక్‌ ప్రయత్నించింది. దక్షిణాసియా దేశాల ఆర్థిక, రాజకీయ సంస్థ సార్క్‌. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌ కలిసి సార్క్‌ కూటమిని నెలకొల్పాయి.

2007 ఏప్రిల్‌లో జరిగిన 14వ సార్క్‌ కూటమి సదస్సులో అఫ్గానిస్తాన్‌ను ఎనిమిదవ సభ్యదేశంగా చేర్చుకున్నారు. సార్క్‌ చరిత్రలోకి వెళ్లి చూస్తే, 1970లలో బంగ్లాదేశ్‌ ప్రజారిపబ్లిక్‌ అధ్యక్షుడు, దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్య మండలి ఏర్పాటును ప్రతిపాదించారు. ఆ తర్వాత 1980 మే నెలలో సార్క్‌ సభ్యదేశాల మధ్య ప్రాంతీయ సహకారం అనే భావన ముందుకొచ్చింది. 1981 ఏప్రిల్‌లో పై ఏడుదేశాల విదేశాంగ కార్యదర్శులు మొదటిసారిగా శ్రీలంక రాజధాని కొలంబోలో సమావేశమయ్యారు. ఆ తర్వాతే సార్క్‌ ఉనికిలోకి వచ్చింది.

దేశాల మధ్య పరస్పర సహకారం ప్రాధాన్యతను మొత్తం ప్రపంచం అర్థం చేసుకుంటున్న తరుణంలో సార్క్‌ కూటమి ఎదగడానికి పాకిస్తాన్‌ ఏమాత్రం సహకరించడం లేదు. అందుకే సార్క్‌ దేశాలు ఉగ్రవాదం, పరస్పర వాణిజ్యం వంటి ముఖ్యమైన అంశాలపై కూడా ఒక అభిప్రాయాన్ని ఉంచుకోలేకపోయాయి. భారత్‌లో ఉగ్రవాదాన్ని విస్తరింపజేసే లక్ష్యమే కర్తవ్యంగా భావిస్తున్న ఉగ్రమూకలను పెంచి పోషించే ఎరువుగా పాక్‌ ఉపయోగపడుతూ వస్తోంది. ముంబైలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి పాక్‌దే ప్రధాన బాధ్యత. మొత్తం ప్రపంచానికి ఈ విషయం తెలుసు. ఇక ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్తాన్‌లో తలదాచుకుని దొరికిపోయాడు. అందుకే పాకిస్తాన్‌ ఒక ఉగ్రవాద కార్ఖానాగా మారిపోయిందని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా ఏ దేశమూ పాకిస్తాన్‌లో ఆడటానికి, పర్యటించడానికి సాహసించలేదు. ఒకవేళ వెళ్లినా ఉగ్రవాదుల హెచ్చరికలతో వెనుదిరిగి వచ్చేస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్‌ క్రికెట్‌ టీమ్‌ పాక్‌లో ఆడటానికి చివరిక్షణంలో తిరస్కరించింది. ఇక ఇంగ్లండ్‌ జట్టు అయితే ఆ దేశానికి వెళ్లడానికి కూడా వ్యతిరేకించింది.

ఇంత జరిగాక కూడా పాకిస్తాన్, సార్క్‌ కూటమిలో కొనసాగుతోంది. భారత్‌ మాత్రం ప్రారంభం నుంచి సార్క్‌ కూటమిని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ వచ్చింది. సభ్యదేశాలు భారత్‌కు ఈ లక్ష్య సాధనలో సహకరించాలి. కరోనా మహమ్మారితో పోరాటంలో సార్క్‌ దేశాల మధ్య సాధ్యమైనంత సహకారానికి కృషి చేస్తానని భారత్‌ హామీ ఇచ్చింది. సంక్షోభంలో చిక్కుకున్న దేశాలు పరస్పరం ఐక్యంగా నిలబడాలని చెబుతుంటారు. అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో పాత విభేదాలను కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. భారత్‌ తనవంతుగా కరోనా వైరస్‌తో తలపడటంలో సార్క్‌ కూటమికి అండగా నిలబడింది. బలమైన సోదరభావాన్ని ఏర్పర్చింది. కరోనా వైరస్‌తో భారత్‌ తలపడిన తీరును సార్క్‌ కూటమితో పాటు యావత్‌ ప్రపంచం గుర్తించి ప్రశంసించింది. పాకిస్తాన్‌ ప్రజలు కూడా దాన్ని గమనించారు కానీ పాక్‌ నాయకులు మాత్రం మోదీని కానీ, భారత్‌ని ప్రశంసించడానికి ముందుకు రాలేదు. పాకిస్తాన్‌ దుష్ట తలంపువల్లే సార్క్‌ కూటమి అడుగు ముందుకు వేయలేకపోయింది.

ఈ నేపథ్యంలో సార్క్‌ దేశాలు తమ వేదికనుంచి పాకిస్తాన్‌ని తొలగించే విషయమై తీవ్రంగా ఆలోచించాల్సి ఉంది. కూటమిలోని ఒక్క దేశం ఇతర సభ్యదేశాలన్నింటినీ భాధపెడుతూ వస్తోందని అవి గుర్తించాలి. పాకిస్తాన్, భారత్‌కి మాత్రమే శత్రుదేశం కాదు. పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌తోనూ అది సఖ్యంగా లేదు. బంగ్లాదేశ్‌ ఒకప్పుడు పాక్‌లో భాగమేనని గుర్తించాలి. బంగ్లాదేశ్‌ ఒక ఇస్లామిక్‌ దేశంగా ఉంటున్నప్పటికీ ఆ దేశానికి వీలైన అన్ని మార్గాల్లో హాని కలిగించాలని పాక్‌ నిరంతరం ప్రయత్నించింది.

పాకిస్తాన్‌ని సార్క్‌ దేశాలు సాగనంపితే, అది సార్క్‌ కూటమిని మరింత బలోపేతం చేస్తుంది. అప్పుడు నిజంగా అవసరమైన రంగాల్లో ఈ కూటమిని నేరుగా సహకరించుకోవచ్చు. అలాగే ఉగ్రవాదంపై వారు తలపడవచ్చు కూడా. తమ కూటమిలో పాక్‌ ఉన్నంతవరకు తామేమీ చేయలేమని సార్క్‌ దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్‌ లేకుంటే సార్క్‌ దేశాలు ఆర్థిక సహకారాన్ని వేగవంతం చేసుకోవచ్చు. 2007లో బంగ్లాదేశ్‌లో మూడు బిలియన్‌ డాలర్ల మేరకు పెట్టుబడిని పెట్టడానికి భారత్‌కి చెందిన టాటా గ్రూప్‌ సిద్ధపడింది. కానీ టాటా గ్రూప్‌ని అనుమతిస్తే అది మరో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అవుతుందని వాదించారు, వ్యతిరేకించారు. ఈరకమైన ఆలోచన తప్పు. కరోనా మహమ్మారి కాలంలో దేశాలు, ప్రత్యేకించి ఇరుగుపొరుగు దేశాలు కలిసి పనిచేయాల్సి ఉంది. సార్క్‌ కూటమిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంటోందని సభ్య దేశాలు గుర్తించాలి.


రవీంద్రకిషోర్‌ సిన్హా 

వ్యాసకర్త మాజీ ఎంపీ, కాలమిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement