
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 స్థానాలనూ, తన నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 స్థానాలనూ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రాంతీయ పార్టీలనూ, గుర్తింపు రాజకీయాల మూలాలున్న పార్టీలనూ కూడా ఆకర్షించి తమతో కలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల సీట్ల పంపకంపై సర్వత్రా వాగ్వివాదాలు తలెత్తవచ్చు. అయితే బీజేపీ వ్యూహకర్తలకు అలాంటి చిక్కులను అధిగమించే నేర్పు ఉంది. మరోవైపు శక్తిమంతమైన బీజేపీని ఎదుర్కోవాల్సిన ఇండియా కూటమిని ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్న ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. పైగా అవి ఒక ఉమ్మడి ఆదేశం మీద పనిచేయడంలో విఫలమవుతున్నాయి. కాంగ్రెస్ తన గొప్పతనపు భ్రమలను విడిచిపెట్టేవరకు, ఇండియా కూటమిపై పెద్ద ఆశలు లేవు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ చదరంగంలో పావులు కదులుతున్న వేళ... తర్కాలు, ఔచిత్యాలు తలకిందులవుతున్నాయి. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు బీజేపీ 370 లోక్‌సభ స్థానాలను (ఎన్డీయే కూటమికి 400) లక్ష్యంగా పెట్టుకుంది.
‘ఇండియా’ కూటమి సంకీర్ణానికి భారీగా బలాన్నిచ్చే ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టడానికి గర్వాతిశయంతో కూడిన అధికార పార్టీ నిశ్చయంగా ప్రయత్నిస్తుంది. దీనికి వ్యతిరేకంగా తన శ్రేణులను బలోపేతం చేయడానికి ఇండియా కూటమికి ఎన్ని మిత్రపక్షాలైనా అవసరమే. విపత్తులను (ఉదాహరణకు, తమిళనాడు వరదలు) ఎదుర్కోవడానికి కేంద్రం నుండి తగినంత సహాయం అందించని ఆర్థిక అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ‘కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు’ అనే చర్చను ఇండియా కూటమి లేవనెత్తుతోంది. అలాగే అక్రమాల పేరుతో ఎంపిక చేసిన మంత్రులపై కేంద్రం అణచివేత చర్యలకు పాల్పడటాన్ని కూడా విమర్శిస్తోంది.
మంది ఎక్కువైతే వచ్చే చిక్కులు
మరోవైపు బీజేపీ శక్తిమంతమైన నాయకత్వం కలిగివుంది. తన తోటి నేతలను అవలీలగా అధిగమించగలిగే ప్రజాకర్షక ప్రధాన మంత్రి, చట్టబద్ధమైన సంస్థలపై పట్టు, బలీయమైన పార్టీ యంత్రాంగం వంటి అంశాలతో ఆ పార్టీ క్షీణిస్తున్న ప్రతిపక్షాల కూటమితో పోలిస్తే ఎంతో బలంగా ఉంది. ప్రాంతీయ పార్టీలకు వంశపారంపర్య లేదా గుర్తింపు రాజకీయాలలో మూలాలున్నప్పటికీ, ఎన్డీయేలోకి సాధ్యమైనన్ని ప్రాంతీయ శక్తులను ఆకర్షించి, కలుపు కోవడానికి బీజేపీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో అత్యున్నత అభాస ఉంది. ఇది పార్టీపరంగా చూస్తే బీజేపీకి ఎంతమాత్రం పొసగనిది.
గత ఐదేళ్లలో, అవిభక్త శివసేన, జనతాదళ్ (యునైటెడ్), శిరోమణి అకాలీదళ్ వంటి ఒకప్పటి విలువైన భాగస్వాములను బీజేపీ కోల్పోయింది. అయితే, చిన్న పార్టీలను చేర్చుకోవడంతో ఎన్డీయే పరిధి ఇప్పుడు విస్తృతమైంది. బీజేపీ తన అపారమైన యుక్తుల ద్వారా, మహారాష్ట్రలో అసలు నాయకుడు ఉద్ధవ్ థాకరే నుంచి శివ సేనను విభజించింది. శరద్ పవార్ నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ విభాగాన్ని స్వాధీనం చేసుకుంది.
శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం ఇప్పుడు ఎన్డీయే ఆస్తి. శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేలపై బీజేపీ మోపిన ఆరోపణలకు అజిత్ పవార్, శివసేనను చీల్చిన ఏక్‌నాథ్ శిందే ఆమోదయోగ్యతను కల్పించారు. ‘లౌకిక’ సంకీర్ణ ప్రభుత్వ పతనానికి దారితీసిన నాటకీయ తిరుగుబాటులో జేడీ(యూ)ను బీజేపీ తిరిగి పొందింది. విశ్వసనీ యత కోల్పోయిన నితీష్ కుమార్ నాయకత్వంలో తిరిగి బిహార్‌లో అధికారంలోకి వచ్చింది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోవడా నికి శిరోమణి అకాలీదళ్‌తో చర్చలను పునఃప్రారంభించింది.
ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)ని బుజ్జగించడం బీజేపీ సంకీర్ణ కూటమికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇది రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో తన ప్రయోజనాలను పటిష్టం చేయడానికేనని స్పష్టం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతం బీజేపీని ఎన్నడూ నిరాశపరచలేదు. గత జూన్ లో బీజేపీని సవాలు చేయడానికి ఉమ్మడి ఫ్రంట్ ద్వారా తీవ్రంగా ప్రయత్నించిన ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించాలనే ఆలోచనలో ఇది భాగం.
అయితే ఇండియా కూటమిని ఎవరు నడిపిస్తారు? కాంగ్రెసా లేదా ప్రాంతీయ నాయకుడా అనే ప్రశ్న ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. గత డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను ఓడించి, హిందీ మాట్లాడే ప్రధాన భూభాగంపై తన ఆధిపత్యాన్ని బీజేపీ తిరిగి నెలకొల్పిన తర్వాత, ఇండియా కూటమి నాయకత్వ శూన్యత గణనీయంగా ఎత్తి చూపబడింది. ఓటములతో కంగుతిన్న కాంగ్రెస్, ఇప్పుడు తమిళనాడు, కేరళలో ఉన్న బలమైన మిత్రపక్షాల అండదండలతో దక్షిణాది వైపు చూస్తోంది.
దక్షిణాదిలో సాపేక్షంగా స్వల్పంగానే ఉనికిలో ఉన్నప్పటికీ వెరవకుండా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత, దాదాపుగా దేవెగౌడ వంశానికి చెందిన ఒక ప్రైవేట్ ఎస్టేట్ అయిన జనతాదళ్ (సెక్యులర్)తో కలిసి బీజేపీ ముందుకు సాగుతోంది. ఇక తెలంగాణలో మాత్రం భారత రాష్ట్ర సమితితో పొత్తుపై బీజేపీ అధినాయకత్వం సందిగ్ధంలో ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో– బిహార్, ఉత్తరప్రదేశ్‌లోని మిత్రపక్షాల బలాధిక్యతతో బీజేపీ పుష్కలంగా నాయకులు ఉండటం అనే సమస్యను ఎదుర్కొంటోంది. మరోవైపున జేడీ(యూ), ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు, తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిష్క్రమణ తర్వాత ఇండియా కూటమి నాయకుల కరువు నెదుర్కొంటోంది. ఎన్డీయేలో సీట్ల పంపకంపై సర్వత్రా వాగ్వివాదాలు తలెత్తవచ్చు. అయితే బీజేపీ వ్యూహకర్తలకు అలాంటి చిక్కులను అధిగమించే నేర్పు ఉంది.
ఇండియా కూటమికి కాలం ఎందుకు అననుకూలంగా మారింది? కాంగ్రెస్ లేదా ప్రాంతీయ పార్టీలు తమ సమీకరణాలను సరిగ్గా నిర్వచించుకోలేక పోవడం వల్ల, కూటమి సంకట పరిస్థితి ఆరంభంలోనే నిర్ణయమైపోయినట్టు అనిపించింది. జేడీ(యూ), తృణ మూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ తమను తాము కాంగ్రెస్ పార్టీతో సమానంగా భావించాయి. అయితే మాటల్లో చెప్పకుండానే కాంగ్రెస్ అధిష్ఠానం తానే నాయకత్వం చేపట్టాలనుకుంది.
మరోవైపు ప్రాంతీయ పార్టీలు ఒక ఉమ్మడి ఆదేశంపై పనిచేయలేకపోయాయి. నితీష్ కుమార్‌ను కూటమికి కన్వీనర్‌గా నియమించాలనే ప్రతిపాదనను తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించాయి. ఈ పదవి ఆయనను భారతదేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉంచడానికి ఒక నిచ్చెన మెట్టు అని ఈ పార్టీల నాయకులు అనుమానించారు. తన వంతుగా రాహుల్ గాంధీ, తాను ప్రధాని పదవికి పోటీలో ఉన్నాననే ఊహాగానాలను ఎన్నడూ కొట్టివేయలేదు.
సంకీర్ణం ఒక క్రీడ కాదు
కాంగ్రెస్ ఆకాంక్షలు దాని క్షేత్ర బలానికి చాలా అసమానంగా ఉన్నాయి. గత ఏడాది డిసెంబరులో వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, మూడు హిందీ ప్రధాన రాష్ట్రాలలో దాని తిరోగమనం... కాంగ్రెస్‌కు సమర్థవంతంగా తలుపులు మూసివేశాయి. కాంగ్రెస్ మూడింట రెండు రాష్ట్రాలను కైవసం చేసుకున్నట్లయితే, అది న్యాయ బద్ధంగా ఇండియా కూటమికి నాయకత్వం వహించగలిగేది. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో అధికారాన్ని కోల్పోవడానికీ, మధ్యప్రదేశ్‌ను తిరిగి కైవసం చేసుకోవడంలో విఫలం కావడానికీ తెలంగాణలో గెలవడం అనేది పరిహారం కాదు.
సంకీర్ణ నిర్మాణం కాంగ్రెస్‌కు ఎప్పుడూ లేదు. లోక్‌సభలో మెజా రిటీ సాధించలేక పోయినప్పుడు, అది బీజేపీయేతర సంకీర్ణాలకు అయిష్టంగానే మద్దతిచ్చింది. అది ఒక క్రీడగా భావించి వాటిని విచిత్రంగా పడగొట్టడానికి మాత్రమే మద్దతిచ్చింది. రాహుల్ గాంధీ ఈ సంప్రదాయానికి తగ్గట్టుగా ఉన్నారు. ఇండియా కూటమిలో నితీష్ అశాంతితో ఉన్నారనీ, ఆర్‌ఎల్‌డీ నూతన అవకాశాలను కోరుకున్నదనీ జనానికి తెలుసు.
వారు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో, వారికి ఏం కావాలో తెలుసుకునేందుకు రాహుల్ ప్రయత్నించలేదు. మిలింద్ దేవరా వంటి సన్నిహిత సహచరుడితోపాటు తన పార్టీ ఇతర సహచరుల నిష్క్రమణ పట్ల కూడా ఆయన ఉదాసీనంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తన గొప్పతనం మీద భ్రమలను వీడేంతవరకూ,ఇండియా కూటమిపై పెద్దగా ఆశలు లేవు.
రాధికా రామశేషన్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)