కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉందని శశి థరూర్ అంగీకరిస్తుండవచ్చు. అయితే గెలిచే ఉద్దేశంతో ఆయన బరిలోకి దిగలేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఆయన అభ్యర్థిత్వం వల్ల మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ భిన్నమైనదన్న ఇమేజ్ వచ్చింది. ఆయన మూర్తిమత్వం వల్ల మీడియాలో పార్టీ మీద దృష్టి పెరిగింది.
కానీ ప్రశ్న ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తెలివిగా వాడుకున్నదా? తాము ఎవరికీ రహస్యంగా పట్టాభిషేకం చేయబోమని థరూర్‌కు హామీ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబ సభ్యులు ఆ మాట తప్పారా? గాంధీ కుటుంబం మద్దతు పొందినట్లయితేనే తాను పోటీ చేస్తానని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. అధిష్ఠానం మద్దతిచ్చిన అభ్యర్థి ఆయనేనని నామినేషన్ సమయంలోనూ, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడినప్పుడూ రుజువైపోయింది. మరి ఈ విషయాలపై శశి థరూర్ అమాయకంగా ఉండిపోయారా?
తదుపరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా మారే అవకాశాలు తనకు చాలా తక్కువగానే ఉన్నాయని శశి థరూర్ సైతం ఇప్పుడు సులువుగా అంగీకరిస్తారనడంలో సందేహమే లేదు. కానీ నిజం చెప్పాలంటే ఇది ఆయన అభ్యర్థిత్వాన్ని తప్పు ధోరణితో చూసినట్లే అవుతుంది. శశి థరూర్ బహిరంగంగా చెప్పలేనప్పటికీ, గెలిచే ఉద్దేశంతో ఆయన బరిలోకి దిగలేదని నేను కచ్చితంగా చెప్పగలను. కానీ పార్టీ అధ్యక్ష పదవికి ఆయన పోటీపడటానికి ప్రధానంగా రెండు కారణాలు న్నాయి.
ఒకటి– అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉంటాయని ఆయన అభ్య ర్థిత్వం ద్వారా పార్టీ చెప్పుకోవచ్చు. దీని ఫలితంగా ఇతర పార్టీలు తమ నాయకులను ఏకాభిప్రాయం ద్వారా ఎంపిక చేసుకునేలాగా కాకుండా, కాంగ్రెస్ ఒక భిన్నమైన పార్టీగా ప్రజల ముందు కనిపి స్తుంది. రెండు– అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికకు సంబంధించి విశ్వసనీయతకు హామీ ఇవ్వడం. వీటికి మీరు మూడో కారణాన్ని కూడా జోడించుకోవచ్చు.
థరూర్ మూర్తిమత్వం, ప్రజాదరణ వల్ల కాంగ్రెస్ పార్టీ మీద మీడియా దృష్టి విపరీతంగా పెరిగింది. ఇది పార్టీకి ప్రయోజనం చేకూర్చగలదని భావించవచ్చు. కానీ ఇక్కడ కలవరపెట్టే అంశం ఏమిటంటే, థరూర్ ఇప్పుడు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా వాడుకున్నదా?
దీన్ని నన్ను వివరించనీయండి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ముందుగా సోనియా కుటుంబ సభ్యులు ముగ్గురినీ శశి థరూర్ కలిశారు. తమకు ఇష్టమైన అభ్యర్థి అంటూ ఎవరూ లేరనీ; ఎవరికీ రహస్యంగా గానీ, అనధికారికంగా గానీ తాము మద్దతివ్వబోమనీ సోనియా కుటుంబం తనకు హామీ ఇచ్చారని శశి థరూర్ బహిరంగంగా వెల్లడించారు. రహస్యంగా ఎవరికీ పట్టాభిషేకం చేయడం అనేది లేదు. తాము ఇష్టపడిన అభ్యర్థి ఫలానా అని సంకేతిస్తూ ఆ మాటను పార్టీలో కిందిస్థాయి దాకా చేర్చడం జరగదు.
అయితే సోనియా గాంధీ కుటుంబం చెప్పినట్లు మాత్రం జరగలేదు. అశోక్ గెహ్లాత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిగా పరిగణనలోకి వచ్చినప్పుడు ఆయనే సోనియా కుటుంబం ఎంచు కున్న మనిషి అని స్పష్టంగా తెలిసిపోయింది. కానీ ఉన్నట్లుండి సీని యర్ కాంగ్రెస్ నేత, సోనియా విధేయుడు అయిన మల్లికార్జున్ ఖర్గేకి దారి ఇస్తూ గెహ్లాత్ రంగం నుంచి తప్పుకొన్నారు.
ఇక్కడ ఒక విషయం మనం గమనించి తీరాలి. మీడియా వార్తల ప్రకారం, గాంధీ కుటుంబం మద్దతు పొందినట్లయితేనే తాను పోటీ చేస్తానని ఖర్గే ముందే చెప్పి ఉన్నారు. వాస్తవానికి శశి థరూర్ లాగా మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్ష ఎన్నికలకు విశ్వసనీయతను తీసుకొచ్చే పనిలో లేరన్నది స్పష్టం. తాను గెలుస్తానని నమ్మినట్లయితేనే ఖర్గే పోటీలో దిగుతారు. గాంధీ కుటుంబం మద్దతు దాన్నే నిజం చేసింది. స్పష్టపరిచింది కూడా!
మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ దాఖలు చేసిన విధానం, ఆ తర్వాత మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు తన గెలుపుపై ఆయన ఎంతో ధీమాతో ఉన్నట్లు తెలియపర్చాయి. దాదాపు సీనియర్లందరూ ఆయన నామినేషన్‌ని బలపర్చడానికి క్యూ కట్టిన తీరు, నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఆయనకు వారందరూ తోడుగా వచ్చిన తీరు చూసినప్పుడు పార్టీ మొత్తంగా ఆయన వెనక నిలబడిం దనడానికి అది తిరుగులేని సంకేతంగా నిలిచింది. గాంధీ కుటుంబం ఖర్గేకి ఇచ్చిన అనుమతి, ఆమోదం స్థాయి అలాంటిది మరి.
నామినేషన్ తర్వాత జరిగిన పరిణామం ఈ అంశంపై మరింత స్పష్టతను ఇచ్చింది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తన ఇంటిలోని తోటలో మీడియాతో మాట్లాడిన శశి థరూర్‌తో పోలిస్తే, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడటాన్ని గమనించాలి. కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతిచ్చిన అభ్యర్థి ఆయనేనని ఇది మరింత స్పష్టంగా రుజువు చేసింది.
ఇంకా ఎవరికైనా సందేహాలు మిగిలి ఉంటే, నామినేషన్ పత్రాలు సమర్పించాక మీడియా ముందు నిలబడి ఖర్గే చెప్పిన తొలి మాటలు గుర్తు తెచ్చుకోండి. ‘‘కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నా నామినేషన్ దాఖలు చేశాను’’ అని ఖర్గే చెప్పారు. ఆయన నోటిలోంచి మాటలు జారి ఉండవచ్చు కానీ అది సత్యదూరమైన విషయం మాత్రం కాదు.
ఇదే నాకు తీవ్ర ఆందోళనను కలిగించింది. తమకు నచ్చిన ఏ అభ్యర్థికీ పట్టాభిషేకం చేయబోమని సోనియా కుటుంబ సభ్యులు మొదట్లో శశి థరూర్‌కి హామీ ఇచ్చినప్పుడు అది వారు నిజంగా ఇచ్చిన హామీయేనా? జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరికీ అను కూలంగా ఉండబోమని అంటున్నారంటే ఎవరో ఒకరి పట్ల తాము అనుకూలంగా వ్యవహరించగలమని వారు ఒప్పుకుంటున్నట్లేనా? మూర్ఖత్వంగా కనబడే నిజాయతీ ఇది.
కాబట్టి అలాంటి హామీని కోరినప్పుడు, సోనియా కుటుంబ సభ్యులు ఆ హామీని ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు కనబడాలి. లేకుంటే తాము నిర్దేశించిన అధ్యక్ష ఎన్నికపై తామే ప్రశ్నలు ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ, తమకంటూ ఒక ప్రాతినిధ్య అభ్యర్థి లేకుండా ఉండగలిగే రిస్కు వారు చేయగలరా? లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వారి చేతుల్లోంచి జారిపోతుంది. ఎంతమాత్రమూ అది వారి ఉద్దేశం కాకపోవచ్చు.
ఇది రెండు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సోనియా గాంధీ కుటుంబ సభ్యులను విశ్వసించడంలో శశి థరూర్ అమాయకంగా ఉండి పోయారా? ఇదే విషయమై ఆయన్ని ప్రశ్నించినప్పుడు, సోనియా గాంధీ చెప్పిన మాటను సందేహించే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టంగా చెప్పారు. నిజంగానే థరూర్ సందేహించి ఉంటే కాంగ్రెస్ అధ్యక్షు రాలు ఒక అబద్ధాలకోరు అని ఆయన చెప్పినట్టయ్యేది. ఇది అర్థం చేసుకోదగిందే. కానీ మన ముందున్న ప్రశ్న మాత్రమే అలాగే ఉంటోంది. నిజంగానే సోనియా గాంధీ చెప్పిన మాటల్ని నమ్మేంత అమాయకత్వంలో శశి థరూర్ ఉండిపోయారా?
రెండో ప్రశ్న మరింత కలవరం కలిగిస్తోంది. సోనియా గాంధీ కుటుంబ సభ్యులు శశి థరూర్‌ని తమ ప్రయోజనాల కోసం వాడేసు కున్నారా? తమకు ఇష్టమైన అభ్యర్థిని తాము రంగంలో నిలపడం లేదని హామీ ఇవ్వడం ద్వారా వారు థరూర్‌కి పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడవచ్చని చెప్పారా? శశి థరూర్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఆ ఎన్నికకు విశ్వసనీయత వస్తుంది.
అంతే కాకుండా మీడియాలో ఆసక్తిని కూడా అది బాగా పెంచుతుంది. దీనంతటి నుంచి పార్టీ గరిష్ఠంగా ప్రయోజనం పొందుతుంది. శశి థరూర్ భాగస్వామ్యం లేకుంటే, అంటే తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయకపోయి ఉంటే అది విభిన్నమైన కథగా ఉండేది. కాబట్టి థరూర్‌ని వాడుకునేలా వారు ఆయన్ని కూడా ఏమార్చారా? తాము ఎంపిక చేసుకున్న మనిషిని ముందుకు తీసుకురావడానికి శశి థరూర్ విశ్వసనీయతకి సంబంధించిన ముఖాన్ని సోనియా కుటుంబ సభ్యులు తెలివిగా ఉపయోగించుకున్నారా?
ఈ ప్రశ్నలకు సమాధానం మనం ఎన్నటికీ తెలుసుకోలేక పోవచ్చు. అయితే ఈ ప్రశ్న నిజంగానే దాని వెనుక దాగిన సత్యాన్ని మనకు సూచిస్తోంది. శశి థరూర్‌కి నేను ఈ ప్రశ్నే వేసినప్పుడు ఆయన స్పందన ఎంతో విచక్షణతో దీన్ని దాటేసినట్టుగా ఉండటం గమనించాను. ‘‘ఇవన్నీ జర్నలిస్టులు చేయదగిన ఊహలు, విశ్లేషణలు మాత్రమే’’. ఇప్పుడు నిజమేమిటో మీకు మీరే నిర్ణయించుకోవచ్చు.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment