ఇండియా అంటే భారత్... భారత్ అంటే ఉత్తరప్రదేశ్ అన్న వ్యవహారం ఊరకే రాలేదు. ఆ రాష్ట్ర విస్తీర్ణం, వారి జనాభా, రాజకీయాల్లో వారి సంఖ్యా బలం, దీనికిమించి ఇక్కడ గెలిచిన రాజకీయ పార్టీకి దేశాన్ని పాలించగలిగే సత్తువ రావడం కారణాలు. రాష్ట్రం అంతటా మాట్లాడేది హిందీ కాబట్టి, వారిని ఒక భావజాలం వైపు కూడగట్టడం కూడా సులభమవుతోంది. దీనివల్ల ఆ రాష్ట్రం రాజకీయంగా గడ్డకట్టిన స్థితిలోకి పోవడంతో పాటు ఈ ప్రభావం దక్షిణాదిపై పడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పాగా వేయడం వల్ల ప్రత్యక్షంగా గెలవలేని మిగిలిన రాష్ట్రాలను కూడా ఆడించడానికీ, అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికీ వీలవుతోంది. అక్కడి సంకుచిత రాజకీయాల క్రీడను మిగతా దేశ ప్రజలు అనివార్యంగా చూడవలసి రావడమే వినోద విషాదం.
వలస పాలన నుంచి బయటపడిన భారత దేశంలో స్వాతంత్య్రానంతరం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అవసరం దృష్ట్యా ముమ్మర ఏర్పాట్లు జరుగు తున్నాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొని ప్రధాన భూమికను నిర్వహించిన సర్దార్ పణిక్కర్ ఒక కీలకమైన వ్యాఖ్యానం చేశారు: ‘‘ఇక రేపటి నుంచి ఇండియా అంటే భారత్, భారత్ అంటే ఉత్తరప్రదేశ్ (యూపీ) అని వ్యవహరించబడుతుంది. ఎందుకంటే, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరిపాలించలేదు కాబట్టి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం (కాంగ్రెస్) దేశంలోని పెద్ద రాష్ట్రాలపై కన్నా చిన్న రాష్ట్రాలను ప్రభావితం చేస్తూ వాటిపై ఆధిపత్యం చలాయించడం సులువని భావించింది. ఎందుకంటే అప్పటికే దేశంలోని పెద్ద రాష్ట్రాలు హెచ్చు స్వపరి పాలనా హక్కు కోసం ఆందోళన చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశాన్ని సమైక్యంగా, సుస్థిరంగా ఉంచేందుకు పటిష్ఠమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని కాంగ్రెస్ భావించింది. అందుకు ఉత్తరప్రదేశ్‌ను కేంద్రంగా చేసుకుని అక్కడి ‘84’ పార్లమెంట్ సీట్లు(అనంతరం ఈ సంఖ్య 86, తర్వాత 85 అయింది. ఉత్తరాఖండ్ విభజన తర్వాత ఐదు సీట్లు ఆ రాష్ట్రానికి పోవడంతో, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోక్‌సభ స్థానాల సంఖ్య 80 అయింది) ఆసరా చేసుకుని, మిగతా దేశాన్ని అదుపాజ్ఞల్లోకి తీసుకోవచ్చునని భావించింది. కనుకనే అంత పెద్ద యూపీ రాష్ట్రాన్ని కనీసం మూడు రాష్ట్రాల కిందనైనా విభజించకుండా ఒకే ఒక పెద్ద రాష్ట్రంగానే ఉంచటం జరిగింది’’ అని పేర్కొన్నారు.
పాగా వేస్తే చక్రం తిప్పొచ్చు
కానీ క్రమంగా ఉత్తరప్రదేశ్ దేశ పాలనలో ‘ఏకు మేకై’ కూర్చుంది. క్రమంగా నేడు పార్లమెంట్‌లోని (లోక్‌సభ) 543 మంది సభ్యులలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యే 80కి ‘దేకడం’తో కేంద్రంలో ఏ పార్టీ అయినా ‘చక్రం’ తిప్పడానికి సాధ్యపడుతోంది. చివరికి ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాల మధ్య తీవ్ర పొరపొచ్చాలకు, అనుమానాలకు, ప్రాంతీయ తగాదాలకు ‘నారు పోసి నీరు’ పెడుతోంది. ఈ వాస్తవాన్ని సెక్యులర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏనాడో గుర్తించబట్టే యూపీ నుంచి ఎంపిక చేసే ఎంపీల సంఖ్యాబలాన్ని పదేపదే ప్రశ్నిస్తూ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల్ని దఫదఫాలుగా హెచ్చరిస్తూ రావలసి వచ్చిందని మరచిపోరాదు. ఇలా దశాబ్దాలపాటు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, ఇతరత్రా పాలకవర్గ కూటములు కేవలం యూపీ నుంచి ఎన్నికయ్యే ఆ 80 మంది పార్లమెంట్ సభ్యుల మీద ఆధారపడుతూ మిగతా రాష్ట్రాలపైన కేంద్రాధిపత్యాన్ని శాశ్వతంగా చలాయించగల అవసరాన్ని అలవాటుగా స్థిరపరచుకోజూస్తున్నాయి.
నిజానికి సర్దార్ పణిక్కర్ ‘ఇండియా అంటే భారత్, భారత్ అంటే యూపీ’ అని ఎందుకు ముద్రవేయవలసి వచ్చిందో భారత విదేశాంగ శాఖ, సమాచార శాఖల్లోని మాజీ అధికారి డాక్టర్ టీఎన్ కౌల్ తన సాధికార గ్రంథమైన ‘జ్ఞాపకాలు (రెమినిసెన్సెస్)’లో చాలా వివ రంగా చర్చించారు. ‘యునైటెడ్ ప్రావిన్స్’ అనే పేరుతో ఉన్న ఈనాటి ఉత్తరప్రదేశ్ అసలు ‘రెండు యూపీ’ల కింద లెక్క. తూర్పు యూపీకి పూర్తి భిన్నమైనది ‘పశ్చిమ’ప్రదేశ్. తూర్పు యూపీతో పోల్చితే పశ్చిమ యూపీ సంపన్నవంతమైన ప్రాంతం. అక్కడి పొలాలు తూర్పు యూపీ కన్నా సారవంతమైనవి. నీటి సౌకర్యం మెండు. నదీ జలసంపద, కాలువలు ఎక్కువ. ఈ దృష్ట్యా తూర్పు యూపీ కన్నా పశ్చిమ యూపీ అన్నివిధాలా సౌష్టవంగల ప్రాంతం. ఈ ఉత్తరప్రదేశ్ ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన వింధ్య వరకు, తూర్పున బిహార్ దాకా, పశ్చిమాన రాజస్థాన్ ఎడారి దాకా వ్యాపించి 75 జిల్లా లతో, 20 కోట్ల జనాభాతో యూరప్‌లోని ఫ్రాన్స్ దేశం కన్నా పెద్దదిగా నిలుస్తోంది.
అలాంటి పెద్ద యూపీ కనీసం మూడు రాష్ట్రాలుగానైనా విభజించవలసి ఉండగా అలా జరగక పోవడానికి కారణం – ఆ అన్ని పార్లమెంట్ స్థానాలలో కేంద్ర ఆధిపత్యం కోసం పాలకవర్గాల ‘పెరపెర’! ఆ మాటకొస్తే పంజాబ్‌ను న్యూపంజాబ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌గా విభజించిన తర్వాతనే మెరుగైన అభివృద్ధికి నోచుకున్నాయి. కానీ కేంద్రాధిపత్యాన్ని తమ చేతుల నుంచి జారి పోకుండా జాగ్రత్త పడేందుకే... యూపీ నుంచి మొత్తం మంది ఎంపీ లను గుప్పిట్లో పెట్టుకుని పార్లమెంట్‌ను, దేశాన్ని ‘అడకత్తెరలో పోక చెక్క’లుగా మలచుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. రాజ్యాంగం ఉపోద్ఘాత పీఠికలో నిర్దేశించిన ‘భారత ప్రజలమైన మేము మాకుగా రూపొందించుకున్న హక్కుల పత్రాన్ని’ కేంద్ర పాలకులు ఓ చిత్తు కాగితంగా జమకట్టి తిరుగుతున్నారు. దీనంతటికీ ఆ మొత్తం లోక్ సభ స్థానాలను యూపీలో పదిలపరచుకుంటూ రావడమే కారణమని మరచిపోరాదు.
భాష ఒక సాధనం
పైగా మొత్తం ఉత్తరప్రదేశ్ ప్రజలు మాట్లాడేది హిందీ కాబట్టి యూపీని మరింతగా విభజించడానికి ప్రజలు మొగ్గు చూపక పోవచ్చు. అంటే, రానురాను కేంద్రంలోని పాలకవర్గాలు ప్రజలలో అవకాశవాద రాజకీయాలు చొప్పించడానికి ఎలాంటి పటిష్ఠమైన పునాదులు వేస్తూ వచ్చారో చెప్పడానికి యూపీ నుంచి ఆ 80 పార్లమెంటేరియన్ల సంఖ్యే తిరుగులేని నిదర్శనం. ఈ ‘గుత్తేదార్ల’ రాజకీయం లౌకిక రాజ్యాంగ వ్యవస్థకే కాక అది నిర్దేశించిన పౌర బాధ్యతల అధ్యాయంలోని అనుల్లంఘనీయమైన సూత్రాలకు పూర్తి విరుద్ధం. అందుకే యూపీతోపాటు దాని సరసనే మరో పెద్ద రాష్ట్రమైన బిహార్‌పైన కూడా పాలక శక్తులు కన్ను వేశాయి. మనం వేలు విడిచిన బ్రిటిష్ వలస సామ్రాజ్యవాద పాలకుల నుంచి నేర్చుకున్న గుణపాఠాలను ‘గంగ’లో కలిపేసి, స్వాతంత్య్రానంతర భారతంలో అధికార పదవులకు ఎక్కి వచ్చిన స్వతంత్ర భారత పాలకులు బ్రిటిష్ వాళ్ల ‘విభజించి–పాలించడ’మనే సూత్రాన్ని మాత్రం తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నారు. కేంద్ర పాలకులుగా ఉంటున్నవారు ఏ ‘బ్రాండ్’కు చెందినవారైనా వారి కన్ను మాత్రం యూపీలోని పార్లమెంట్ స్థానాలపై కేంద్రీకరించక తప్పడం లేదు.
దక్షిణాది మీద కన్ను
ఆ యూపీ మెజారిటీ పార్లమెంటరీ స్థానాల ఆధారంగానే దక్షిణ భారత రాష్ట్రాలలో కూడా ‘పాగా’ వేయడానికి కేంద్ర పాలకులు ఎవరైనా సరే ప్రయత్నిస్తూనే ఉంటారని మరచిపోరాదు. ఆ సంఖ్యా బలంతోనే దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బొంబాయి, తెలంగాణ, గోవాలలో నిత్యం ఏదో ఒక ‘చిచ్చు’ రేపుతూ పోవడానికి కేంద్ర పాలకులు అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు. బహుశా అందుకనే యూపీలోని 75 జిల్లాలకు ‘వికేంద్రీకరణ’ సూత్రం వర్తించదు గానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాజధానుల ‘వికేంద్రీకరణ’కు, ‘త్రికేంద్రీకరణ’కు అడ్డుపుల్లలు వేస్తూ పోతున్న చందంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటికైనా ఉత్తర–దక్షిణ భారత రాజకీయాలు, వాటిపై ఆధారపడి నడవవలసిన రాజకీయ పాలకులు... స్వతంత్ర భారతంలో 75 జిల్లాలతో కూడి వికేంద్రీకృత పాలనకు దూరమై, కేవలం కేంద్ర పాలనాధికారం కోసమని 80 మంది పార్లమెంటేరియన్ల సంఖ్యతో నేడు దేశంలో ఎవరూ ‘పిలవని పేరంటం’ లాంటి ఓ వినోదాన్ని ప్రజలు చూడవలసి రావడమే పెద్ద విషాదం!
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment