ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి రెండేళ్లు | YV Reddy Article On YS Jagan Mohan Reddy YSRCP Victory Day | Sakshi
Sakshi News home page

ఓ దృఢ సంకల్పం ఘన విజయం సాధించి రెండేళ్లు

Published Sun, May 23 2021 2:14 PM | Last Updated on Sun, May 23 2021 10:21 PM

YV Reddy Article On YS Jagan Mohan Reddy YSRCP Victory Day - Sakshi

రాజకీయ కుట్రలకు ఎదురు నిలిచిన ఆ గుండె ఘన విజయం సాధించి రెండేళ్లు.  ఆ గుండె చప్పుడుకు ప్రత్యర్ధి కోటలు బద్దలై ఇప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పాలనా పగ్గాలు చేపడితే ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో ఈ  రెండేళ్లలో చూశాం. పారదర్శకతతో  కూడిన పాలన ఎలా ఉంటుందో చూస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి ఇంట్లో కూర్చుంటే రాలేదు. పదేళ్లు ప్రజల్లో ఉన్నారు. పొలం గట్టెక్కారు..పూరి గుడిసెలో బువ్వ తిన్నారు. కాల్వ గట్లు మీద ఇరిగేషన్ పాఠాలు చదివారు.

ప్రజల కష్టాలను పుస్తకాల్లో కాకుండా కళ్లతో కళ్లారా చూశారు.  చిన్నారి నుంచి పండు ముదుసలి వరకు చేయి పట్టుకుని, చేతిలో చేయివేసి జీవితాలకు భరోసా ఇచ్చారు. ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు ఆయన వేసిన ప్రతి అడుగు ప్రజల కోసమే.  ప్రజలంటే ఆయనకు ప్రాణం..వారికి సేవ చేయడానికే పుట్టినట్లు ఆలోచిస్తారు. ప్రజలను నమ్ముకుని అడుగులు వేశారు. ప్రజలను అమ్ముకునే వాళ్లతో పోరాటం చేశారు. ఢిల్లీ కోటను ఢీకొని ..తనకు ప్రజలకిచ్చిన మాట కంటే ..ఏదీ ఎక్కువ కాదని దేశం మొత్తం వినబడేలా నినదించారు. ఒక చిరునవ్వుతో శత్రువులను చిందవందర చేశారు. 

మే23, 2019 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని రోజు. అప్పటి వరకు ప్రజలను పీక్కుతిన్న రాబందులు ఓడిన రోజు. అవినీతి పాలన అంతమైన రోజు. దుర్యోదనుల పాలనకు ప్రజలు చరమ గీతం పాడి..ధర్మరాజు పాలన తెచ్చుకున్న రోజు. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్దం 18 రోజులు జరిగి ఉండొచ్చు..కలియగంలో ఈ కురుక్షేత్ర యుద్దం పదేళ్లు జరిగింది. పదేళ్లు  పోరాడిన వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి.. ఆ అలసటను మరిచిపోయేలా ఆంధ్రులు అదిరిపోయే తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు చూసి చంద్రబాబుకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాని పరిస్థితి. 175 అసెంబ్లీ స్థానాల్లో  50 శాతం ( 1,56,86,511 ఓట్లు) ఓట్లతో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ 151 నియోజకవర్గాల్లో రికార్డు విజయం సాధించింది. 39 శాతం (1,23,03,620) ఓట్లతో టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది.

అంతేకాదు..25 లోక్ సభ స్థానాల్లో 22 సీట్లను  వైఎస్ఆర్‌ సీపీ గెల్చుకుని సత్తా చాటింది. టీడీపీ గెలిచిన ఆ 3 సీట్లు కూడా ముక్కుతూ మూలుగుతూ గెలిచినవే. వైఎస్‌ఆర్‌ సీపీ విజయంతో ఓ రాకాసి పాలన నుంచి ప్రజలు బయటపడినట్లు సంబరాలు చేసుకున్నారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు..దేశ విదేశాల్లో వైఎస్‌ఆర్‌ కుటుంబ అభిమానులు ..వైఎస్‌ఆర్‌ సీపీ జెండాలు పట్టుకుని పండగ చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ..ప్రజలకు బంగారు భవిష్యత్తు కోసం..ప్రజలకు నేనున్నాననే ధైర్యం చెప్పడం కోసం ఢిల్లీకి అడ్డంగా నిలబడి పోరాటం చేసి గెలిచిన  రాజకీయ వీరుడు, ధీరుడు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి.

మే23, 2019 ఫలితాలు వచ్చిన తరువాత  మే30న సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. అప్పుడు వైఎస్‌ జగన్‌ ఓ మాట అన్నారు. 6 నెలలు తిరగకుండానే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు. ఆ హామీని అక్షరాల నెరవేర్చుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఖజానాలో రూ.100 కోట్లే ఉన్నాయని చంద్రబాబు అనుకూల పత్రికలు  రాశాయి. ఆర్ధికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్న  రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారని మరికొందరు హేళన చేశారు. వీరందరి హేళనలను పునాదిలోనే తొక్కేస్తూ పాలనలో రామ బాణమై దూసుకెళ్తున్నారు సీఎం వైఎస్  జగన్‌మోహన్ రెడ్డి.

అధికారం చేపట్టినప్పటి నుంచి ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ, అవినీతికి తావులేని పాలన చేస్తున్నారు. ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు తాను చూసిన, తెలుసుకున్న క్షేత్రస్థాయి పరిస్థితుల నుంచి రూపొందించిన 'నవ రత్నాల'ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. ఈ 'నవ రత్నాలే' సీఎం వైఎస్ జగన్‌ పాలనకు పునాదులు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనానికి కాపలాగా ఉన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల ముఖంలో సంతోషం చూస్తున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.  545 సేవలు గ్రామ సచివాలయాల్లోనే  ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. గ్రామ, వార్డ్  సచివాలయలతో ప్రభుత్వ సేవలను ఇంటి ముందరకు తీసుకెళ్లిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతోంది. ఈ రెండేళ్ల పాలనలో రూ.1.25 లక్షల కోట్లు ప్రజల జేబుల్లోకి నేరుగా వెళ్లాయని చెప్పొచ్చు. దీంతో గ్రామాల్లో ఆర్ధిక విప్లవం వచ్చింది. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు జీవితాలకు భరోసా ఇచ్చారు.

 వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో 26.03 కోట్ల పని దినాలు కల్పించడం రాష్ట్రంలో ఓ చరిత్ర. ఈ రోజున పెరిగిన ధరల కంటే..ఏపీలో కూలీల ఆదాయం ఎక్కువుగా ఉంది. వైఎస్‌ జగన్ ప్రభుత్వం  పాలనలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులే ఆదాయం పెరిగేలా చేస్తున్నాయని అనడంలో సందేహం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 అమలు చేసి చూపించింది వైఎస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోలను వెబ్ సైట్‌ల నుంచి తొలగించడాన్ని చూశాం. కానీ.. సీఎం వైఎస్‌ జగన్‌కు మాత్రం మేనిఫెస్టో అంటే..భగవద్గీత, బైబిల్, ఖురాన్‌. అంతేకాదు..సంక్షేమ క్యాలండర్‌ను రూపొందించి అమలు చేస్తోన్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతోంది. 

సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యావైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనిపై పలువురు విమర్శలు చేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. విద్యా రంగంపై వైఎస్ఆర్‌ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.25,714.13 కోట్లు. అంతేకాదు..2021-22 బడ్జెట్‌లో విద్యారంగానికి ఏకంగా రూ.38,327.20 కోట్లు కేటాయించి తన చిత్తశుద్దిని చాటుకున్నారు. 2021 -22 సంవత్సరానికి అమ్మ ఒడి పథకానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.6,107.36 కోట్లు కేటాయించింది. నాడు - నేడు కింద  ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోంది.  తొలి దశలో  15, 715 పాఠశాలలు ఆధునీకరించగా,  రెండో దశలో 16,345 పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించనుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.3,500 కోట్లు కేటాయించారు. 

ఇక..ఆరోగ్య రంగానికి కూడా సీఎం వైఎస్ జగన్ భారీగా నిధులు కేటాయించారు.  మొత్తంగా రూ.13,830.44 కోట్లు ఆరోగ్యానికి కేటాయించారు . దీనిలో ఆరోగ్య శ్రీ పథకానికి రూ.2,258 కోట్లు ఇచ్చారు. ఆరోగ్య శ్రీలో 2,400 జబ్బులు చేర్చారు. అంతేకాదు..కరోనా, బ్లాక్ ఫంగస్ లాంటి భయంకరమైన వ్యాధులను సైతం ఆరోగ్య శ్రీలో చేర్చి దేశానికే ఆదర్శంగా నిలిచారు. సమాజం మారాలంటే విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు అవసరమని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారు చెబుతూనే ఉన్నారు. అందుకు తగినట్లుగానే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిగాయి. 2020-21 కంటే ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో  రూ.4,403.95 కోట్లు అధికంగా కేటాయించారు.  104, 108 పథకాలకు బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించి ప్రజల ప్రాణాలు ఎంత విలువైనవో సీఎం జగన్‌ గారు చెప్పారు. అంతేకాదు..కరోనాకు ఇప్పటి వరకు రూ.2,500 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. కరోనాతో అనాధలైన పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.10లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేసి..దానిపై వచ్చిన వడ్డీని..వారి పోషణకు  ఉపయోగించాలని  అధికారులను ఆదేశించి చరిత్ర సృష్టించారు. 

విద్యావైద్యరంగాల్లోనే కాదు అన్ని రంగాల్లో ఈ రెండేళ్లలో వైఎస్ జగన్‌ తన ముద్ర వేశారు. అవినీతిని రాష్ట్రం సరిహద్దుల అవతలకు తరిమేశారు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు అనే సిద్దాంతాన్ని బలంగా నమ్మే నాయకుడు సీఎం వైఎస్ జగన్‌. అందుకు తగినట్లుగానే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.31,256. 36 కోట్లు కేటాయించారు. 2021 -22 బడ్జెట్‌లో రూ.13,237.78 కోట్లు కేటాయించి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంలో తన చిత్తశుద్దిని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణవాయువైన పోలవరం ప్రాజెక్ట్‌కు ఈ బడ్జెట్‌లో రూ.4,510.41 కోట్లు కేటాయించారు. ఈ రెండేళ్లలో రైతన్నలకు వివిథ పథకాల రూపంలో రూ.82,368.31 కోట్లు బ్యాంక్‌ ఖతాల్లో జమ చేశారు. మొత్తం 4,65,58,972 మంది రైతులు పథకాల ద్వారా లబ్ది పొందారు. 

ఈ రెండేళ్లలోనే మరో బృహత్తర కార్యక్రమం నెరవేర్చారు సీఎం  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. పేదల సొంతింటి కల నిజం చేయాలని సంకల్పించుకున్నారు. 30.76 లక్షల మంది  మహిళలకు రూ.25,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇప్పటికే పంపిణీ చేశారు. 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం జరగబోతుంది. ఏపీ టిడ్కో నేతృత్వంలో పట్టణ ప్రాంతాల్లో 2.62 లక్షల గృహాల నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇళ్ల నిర్మానానికి  వీలుగా బడ్జెట్‌లో రూ.5,661.567 కోట్లు కేటాయించారు.

 పిల్లలకు మేనమామల సీఎం వైఎస్ జగన్‌ ఆలోచన చేస్తారు. బాలల వికాసమే లక్ష్యంగా  39 పథకాల కింద రూ.16,748. 47 కోట్లు  పిల్లల కోసం కేటాయించారు. ఇప్పటి వరకు మహిళలకు వివిధ పథకాల ద్వారా  సీఎం వైఎస్ జగన్‌ ప్రభుత్వం రూ.82,368.31 కోట్లు బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఈ రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా 4,65,58, 594 మంది మహిళలు లబ్ధి పొందారు. అంతేకాదు..మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకొచ్చి దేశానికి దిక్సూచి అయ్యారు. 2021- 22 బడ్జెట్‌లో దిశ యాక్ట్‌కు 33.77 కోట్లు జగనన్న ప్రభుత్వం కేటాయించింది. మహిళలకు రక్షణ కల్పించడం అనేది ఓ సామాజిక బాధ్యత.

ఈ రెండేళ్ల వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో  ఇలాంటి ఎన్నో అద్భుతాలు   చూడవచ్చు. గ్రామీణం - రైతులు - వ్యవసాయం - మహిళలు -విద్యా - వైద్యం పునాదులుగా వైఎస్ జగన్‌ పాలన చేస్తున్నారు. ఇప్పటికీ 65 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారు. ఈ రంగం బాగుంటేనే పల్లెలు, పట్టణాలు బాగుంటాయని నమ్మిన నాయకుడు ఆంధ్రులకు దొరకడం అదృష్టం.  ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ విప్లవంతోపాటు సామాజిక విప్లవం తీసుకొస్తున్నారు. ఆయన చేపట్టి అమలు చేస్తోన్న ప్రతి పథకం సామాజిక, ఆర్థిక విప్లవానికి నాంది పలికేదే..!.

దిశ యాక్ట్ నుంచి నిత్యావసరాల డోర్‌ డెలివరీ వరకు  ప్రతి ఒక్కటీ దేశంలోని ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌ ఇవాళ ఆలోచించి అమలు చేసేవి..రేపు దేశం అమలు చేస్తుంది. ప్రజలకు మేలు చేయాలని..ప్రజలను బాగా చూసుకోవాలి అని మనసులో ఉన్నప్పుడే అద్భుత ఆలోచనలు మెదడును తడుతాయి. ఏపీలో వైఎస్ జగన్‌ పాలన చూస్తుంటే మహాత్మ గాంధీ ఆలోచనలు చూస్తున్నట్లుంది. రాజ్యాంగ బద్దమైన పాలనలో అంబేద్కర్ ఆశయాలు చూస్తున్నట్లుంది. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న నాయకుడు రాజకీయ విప్లవంతోపాటు సామాజిక, ఆర్థిక విప్లవాలను  తీసుకురాగలడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది ఇదే..!. 

- వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement