ఉద్యోగ విరమణ నోటీసులు జారీ చేసి న్యాయం చేయాలి
డీఈఓకు ఏపీటీఎఫ్ జిల్లా నేతల వినతి
గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేయనున్న ప్రధానోపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖాధికారులు నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకకు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవ లింగారావు విన్నవించారు. బుధవారం డీఈవో రేణుకను కలిసి సంఘ నేతలు వివిధ అంశాలపై వినతిపత్రం సమర్పించారు. బసవలింగారావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణకు ఆరునెలల ముందుగా పెన్షన్ ప్రతిపాదనలను సిద్ధం చేసి, సంబంధిత అధికారులకు పంపాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదని, ఎంఈవోల నుంచి హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు నోటీసులు ఇవ్వకపోవడంతో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని పేర్నొన్నారు. పెన్షన్ ప్రపోజల్స్ ఆలస్యమైతే ఉద్యోగ విరమణ పొందిన నెలలో పెన్షన్ అందక ఆర్థిక ఇబ్బందులు పడతారని వివరించారు. తక్షణమే నోటీసులు జారీ చేయాలని కోరారు. మున్సిపల్, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను మెరిట్ కం రోస్టర్ విధానంలో తక్షణమే విడుదల చేయాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు పి.లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శులు ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, జి.దాస్, సీనియర్ నాయకులు చక్కా వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిలర్ పి.శివరామకృష్ణ, జోసెఫ్ కిరణ్ కుమార్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment