డిసెంబర్ 15లోపు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం పూర్తి
కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు ఎడ్యుకేషన్: రూ.మూడు కోట్ల వ్యయంతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్ నిర్మాణాన్ని డిసెంబర్ 15లోపు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం బీఆర్ స్టేడియం ఎదుట నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను ఆమె పరిశీలించారు. 90 సెంట్ల విస్తీర్ణంలో ఐదేళ్ల క్రితం రూ.మూడు కోట్ల అంచనాతో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు సంబంధించిన పనుల్లో బిల్డింగ్ స్ట్రక్చర్ నిర్మాణానికి రూ.2.10 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.అనిల్‌కుమార్ కలెక్టర్‌కు వివరించారు. భవన నిర్మాణ పనులు పూర్తికి మరో రూ.90 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ గ్రాంటుతో భవన నిర్మాణ పనులు పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వచ్చేనెల 15లోగా పనులు పూర్తిగా చేపట్టి అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఏసీ కళాశాల ఎదుట ఉన్న పురాతన ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పరిశీలించారు. ప్రాంతీయ గ్రంఽథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించి భవనం శిఽథిలావస్థలోఉందని గమనించారు. గ్రంథాలయం పునర్నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీఇడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. గ్రంథాలయంలో లైట్లు, ఫ్యాన్ల కొరత ఉందని పాఠకులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయా వసతులను సమకూర్చుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట డివిజనల్ ఇంజినీర్ బీఏ రవీంద్ర, గుంటూరు తూర్పు తహసీల్దార్ నగేష్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారిణి చెంచు లక్ష్మీ, గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment