గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
పీఆర్, గ్రామీణాభివృద్ధి శిక్షణ పర్యవేక్షకులు కేశవరెడ్డి
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ సమగ్రాభివృద్ధికి దోహదం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖల శిక్షణ పర్యవేక్షకుడు ఆర్.కేశవరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేశవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2025–26 వార్షిక ప్రణాళికలో బాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో స్థానిక అవసరాలైన సామాజిక న్యాయం, సంక్షేమాలను దృష్టిలో ఉంచుకుని అన్ని మార్గాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. డ్వామా పీడీ వి.శంకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామంలో రూ.రెండు కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు పనులు చేపట్టేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. ప్రజా ప్రణాళికపై రీసోర్స్ పర్సన్ కె.లలిత మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, బడ్జెట్ రూపకల్పనలు, సక్రమ వినియోగం, గ్రామాభివృద్ధికి ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈసందర్బంగా ఈ–గ్రామ్ స్వరాజ్ పోర్టల్, పీడీఐ పోర్టల్, గ్రామ పంచాయతీ నిర్ణయ్ యాప్ వంటి సాంకేతిక అంశాలపై డీపీఎం రవీంద్రబాబు వివరించారు. ఈవో పీఆర్డీ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఆర్థిక వనరుల సక్రమ వినియోగం, ఆదాయ వనరుల సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి జిల్లాస్థాయి అధికారులతో పాటు ప్రతి మండలం నుంచి ఎంపీడీవో, ఈవో పీఆర్డీ, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ పాల్గొన్న శిక్షణ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు వి.శ్రీనివాసరావు, కరీముద్దీన్, మేడికొండూరు ఎంపీడీవో తోట చందన, జిల్లా సమన్వయకర్త ఎస్. పద్మారాణి, డీటీఎం కంచర్ల నాగేశ్వరరావు, ఎన్‌ఐఆరీ కన్సల్టెంట్ డాక్టర్ కె. మోహనరావు,జీకే జియా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment