సమస్యలు పరిష్కరించలేని గ్రామ సభలెందుకు?
ప్రత్తిపాడు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలపై రైతులు పెదవి విరుస్తున్నారు. సమస్యలు పరిష్కారం కానప్పుడు ఈ సభల నిర్వహణ ఎందుకని గళం విప్పుతున్నారు. పెదనందిపాడు మండలం వరగానిలో గురువారం రెవెన్యూ అధికారులు సర్వే సమస్యలపై రైతుల నుంచి అర్జీలు స్వీకరించేందుకు గ్రామసభ నిర్వహించారు. హాజరైన రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఒక రైతు తన పొలం సర్వేకు ముందు ఆన్‌లైన్‌లో నమోదయ్యిందని, సర్వే చేసిన తరువాత ఆన్‌లైన్‌లో పేరు నమోదు కాలేదని అధికారుల వద్దకు వెళ్లి తన సమస్యను విన్నవించారు. పరిష్కారం కోసం కార్యాలయానికి రావాలని సభకు హాజరైన అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన రైతు సమస్యలు పరిష్కారం కానప్పుడు గ్రామసభలు నిర్వహించడం ఎందుకని, సభను రద్దు చేయాలని మండిపడ్డాడు. దీంతో పక్కనే ఉన్న గ్రామస్తులు, రైతులు ఆ రైతును శాంతింపజేశారు. ఇదిలా ఉంటే సమస్య ఉంటే అర్జీలు ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారని, అర్జీలు రాయడం కొందరు రైతులకు రాదని, అలాంటి వారికి అర్జీలు రాసేందుకు కూడా స్థానికంగా సిబ్బంది అందుబాటులో లేరని రైతులు వాపోయారు.
వరగానిలో అధికారులకు రైతుల సూటి ప్రశ్న
Comments
Please login to add a commentAdd a comment