ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి
ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు ఆవేదన
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యాశాఖ విధానాలతో ప్రధానోపాధ్యాయులతోపాటు ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు అన్నారు. బుధవారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్‌లో జరిగిన సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడుతూ విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వల్ల హైస్కూళ్లలో ప్రధానోపాధ్యాయులకు టెన్త్ నామినల్ రోల్స్ నిర్వహణ భారంగా మారిందని, మరోవైపు అపార్ నమోదు ప్రక్రియ తలనొప్పింగా ఉందని వివరించారు. సరైన రవానా సౌకర్యాలు లేని కేంద్రాలలో శిక్షణ ఇవ్వడం వలన అక్కడికి చేరుకునేందుకు టీచర్లు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు మాట్లాడుతూ 50 ఏళ్లకు పైబడిన ఉపాధ్యాయులకు, వికలాంగులకు, చిన్నపిల్లలు ఉన్న మహిళా టీచర్లకు శిక్షణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. నూజివీడు సమీపంలోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఉపాధ్యాయుడు మరణించడం బాధాకరమని అన్నారు. వేసవి సెలవుల్లోనే వృత్తి శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిమళ్ల ప్రసాదరావు, రాష్ట్ర కౌన్సిలర్ కమతం శ్రీనివాసరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వై.శ్యాంబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment