వైఎస్సార్ సీపీకి దళితులే పట్టుగొమ్మలు
పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
పట్నంబజారు(గుంటూరు వెస్ట్): వైఎస్సార్ సీపీకి దళితులే పట్టుగొమ్మలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పెరికల కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలబడింది దళిత వర్గాలేనని పేర్కొ న్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారీటీలు, నా ఎస్టీలంటూ వారిని తన సొంత మనుషుల్లా భావిస్తారని పేర్కొన్నారు. దళితవర్గాలపై జరుగుతున్న దాడులపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సోషల్ మీడియా వేదికగా ఏదో పోస్టు పెట్టారని, కేవలం 41 నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లోనూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అయినా ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కచ్చితంగా ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా.. అండగా పార్టీ శ్రేణులు నిలబడతారని హామీనిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దళితులపై జరుగుతున్న దాడులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఎంతటి కష్టాన్నైనా భరించి, ఎత్తిన జెండాను దించకుండా ముందుకు సాగిన ప్రతి ఒక్కరికీ పార్టీలో సముచిత స్థానం లభిస్తుందన్నారు. పార్టీ పదవుల నియామకాల్లోనూ ఏ ఒక్కరికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పెరికల కృష్ణమోహన్ మాట్లాడుతూ జగనన్న ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఎస్సీ విభాగం తమ భుజాన వేసుకుని ముందుకు సాగుతోందన్నారు. కేసులకో, బెదిరింపులకో పార్టీ కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదన్నారు. ఖచ్చితంగా వైఎస్సార్ సీపీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎస్సీ విభాగం నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అంబటి పంచుకున్నారు. ఆయా ప్రాంతాల్లో వారిని కూటమి నేతలు పెడుతున్న ఇబ్బందులు, బెదిరింపులను పార్టీ జిల్లా నేతల దృష్టికి తీసుకు వచ్చారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేరుగా తామే వస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నేతలు బత్తుల దేవానంద్, అత్తోట జోసఫ్, ప్రభు, పిల్లి మేరీ, బుల్లా మేరీ, సందీప్, ఏటుకూరి విజయసారధి, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్, పచ్చల ఆనంద్, జొన్నలగడ్డ రత్నకుమారి, సత్తెనపల్లి రమణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment