చట్ట పరిధిలో బాధితులకు న్యాయం
● ఎస్పీ సతీష్‌కుమార్ భరోసా ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ ● డిజిటల్, ఆన్‌లైన్ మోసాలపై పలువురి ఫిర్యాదు
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదులు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదిదారుల బాధను ఆయన ఆలకించారు. సాధ్యమైనంత త్వరగా చట్ట పరిధిలో న్యాయం చేయాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
క్యూఆర్ కోడ్ పేరుతో మోసం
పొన్నెకల్లులో చిల్లర దుకాణంతో జీవిస్తాను. క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తానని ఓ కంపెనీ నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. ఆధార్, పాన్ కార్డుల నంబర్లు, ఫొటోలు వంటి ఆధారాలు తీసేసుకుని కోడ్ యిచ్చాడు. ఇటీవల ఫైనాన్స్ కంపెనీ నుంచి సిబ్బంది వచ్చి ఈఎంఐలు సక్రమంగా చెల్లించడంలేదని తెలిపారు. లోన్ కింద తాను ఏమి తీసుకోలేదని చెప్పగా, రూ.2 లక్షలు ఖరీదు చేసే గృహోపకరాలు తీసుకున్నారని చెప్పారు. గతంలో క్యూఆర్ కోడ్ నిమిత్తం వచ్చిన వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు తెలిసింది. ఫైనాన్స్ కంపెనీ, ఓ బ్యాంక్, సదరు వ్యక్తి కలిసికట్టుగా మోసగించారు. స్థానిక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
– ఎస్.సురేంద్రరెడ్డి, పొన్నెకల్లు, తాడికొండ
మొబైల్ నంబర్‌తో వస్తువుల కొనుగోలు
గతేడాది మార్చిలో ఓ కంపెనీ ఉద్యోగి వచ్చారు. సదరు కంపెనీ కార్డు రద్దు చేయాలని కోరగా, తమ వద్ద మొబైల్ నంబర్ తీసేసుకున్నాడు. ఇటీవల సదరు కంపెనీ నుంచి సిబ్బంది వచ్చి, రూ.1.80 లక్షలకు ఈఎంఐలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. తాము ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయలేదని, వారి దృష్టికి తీసుకువచ్చాం. అయితే గతంలో తమ వద్దకు వచ్చి మొబైల్ నంబర్ తీసుకున్న వ్యక్తి ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించాం. తమ నంబర్‌తో వేరొక మహిళ ఫొటో జత చేసి రెండు ఖరీదైన మొబైల్‌ఫోన్లు కొనుగోలు చేశాడు. ఆ రెండింటికీ నమ్మకం కలిగించేలా ఈఎంఐలు చెల్లించాడు. కాలక్ర మేణా ఏసీ కూడా కొనుగోలు చేశాడని తెలిసింది. ఈ మూడింటికి కలిపి రూ.1.80 లక్షలు చెల్లించాలని చెబుతున్నారు. ప్రస్తుతం తాము ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదు. సదరు వ్యక్తిని పిలిచి విచారించి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
– పి.దీనకుమారి, అంకిరెడ్డిపాలెం
సోదరునికి రూ.33 లక్షలు ఇచ్చా..
ఐదేళ్ల క్రితం సోదరునికి రూ.33 లక్షలు అప్పుగా యిచ్చాను. కొన్నాళ్లు సక్రమంగా వడ్డీ చెల్లించాడు. సుమారు 14 నెలలు క్రితం నా కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి సోదరుడు వడ్డీ, అసలు యివ్వడంలేదు. డబ్బులు యివ్వమని అడిగితే నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సొంతిల్లు సరిగాలేకపోవడం, జీవనాధారం కోల్పోవడంతో కొరిటెపాడులోని కుమార్తె వద్ద ఉంటున్నా. సోదరుని పిలిచి న్యాయం చేయాలని కోరుతున్నా.
– ఎస్.తులసమ్మ, కొరిటెపాడు
Comments
Please login to add a commentAdd a comment