పోటెత్తిన భక్తులు
● శివ నామ స్మరణతో మార్మోగిన పెదకాకాని శివక్షేత్రం ● ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ● ఒక్కరోజులో స్వామికి రూ.10,10,000 ఆదాయం
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం సోమవారం శివ నామస్మరణతో మార్మోగింది. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తిక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని దీపాలు వెలిగించి, పూజలు చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా ఎటు చూసినా కార్తిక దీపాలు వెలిగించే భక్తులే కనిపించారు. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి ప్రారంభమైంది. ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసి భక్తులు ఆలయం చుట్టూ శివనామం స్మరిస్తూ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ఆవరణలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తర్వితగతిన దర్శనం జరిగేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లలో దాతల సహకారంతో ఉచితంగా పాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. ఆలయంలో అధికంగా అంత్రాలయ అభిషేకాలు, దర్శనాలు, ఏకవారాభిషేక పూజలు, రాహుకేతు పూజలు, అన్నప్రాసనలు, చెవిపోగులు కుట్టించడం, నామకరణలు, ఏకవారాభిషేక పూజలు, వాహనపూజలు, నవగ్రహ పూజలు అధికంగా జరిగాయి. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా స్వామివారికి ఒక్క రోజులో రూ.10,10,000 ఆదాయం లభించిందని డెప్యూటీ కమిషనర్ కామినేని బసవ శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు అసౌర్యం కలుగకుండా పెదకాకాని పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పంచాయితీ సిబ్బంది సహాయ సహకారాలు అందించినట్లు ఆలయ ఉప కమిషనర్ కె.బి. శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment