సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలోని రాష్ట్ర రహదారులపై ఇకపై వాహనాన్ని తీసుకెళ్తే టోల్ కట్టాల్సిందే. రాష్ట్ర రహదారుల నిర్వహణ బాధ్యత నుంచి దశల వారీగా తప్పుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం గుంటూరు జిల్లాలో మొదటి దశలో మూడు ప్రధాన రహదారులు, రెండో దశలో ఏడు ప్రధాన రహదారులను ఎంపిక చేసింది. జాతీయ రహదారులపై ఇప్పటికే టోల్ వసూలు చేస్తుండగా ప్రధానమైన రాష్ట్ర రహదారుల నుంచి కూడా చేయాలని నిర్ణయించారు. దీనివల్ల వాహనదారులపై పెనుభారం పడనుంది. గుంటూరు నుంచి తెనాలి, బాపట్ల, పర్చూరు, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల .. ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా టోల్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇప్పటికే విజయవాడ వెళ్లి రావాలంటే కారుకు రూ. 225 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర రహదారుల వంతు వచ్చింది.
ఐదేళ్లకోసారి తారు లేయర్
మొదటి దశలో గుంటూరు నుంచి పర్చూరు వరకు 41.44 కిలోమీటర్లు, గుంటూరు నుంచి బాపట్ల వరకూ 51.24 కిలోమీటర్లు, మంగళగిరి–తెనాలి–నారాకోడూరు వరకూ 40.05 కిలోమీటర్లు అంటే సుమారు 132.73 కిలోమీటర్ల రహదారిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. ఆయా రోడ్ల నిర్వహణను కాంట్రాక్టు సంపాదించుకున్న వ్యక్తులే చూస్తారు. గుంతలు పూడ్చడంతో పాటు ఐదేళ్లకోసారి తారు లేయర్ వేస్తారు.
● రెండోవ దశలో పర్చూరు–జాగర్లమూడి–పురిమెట్ల మధ్య 54.53 కిలోమీటర్లు, అద్దంకి–సంతమాగలూరు మధ్య 40.15 కి.మీ, మాచర్ల–కారంపూడి–వినుకొండ మధ్య 72.61 కిలోమీటర్లు, కొండ్రముట్ల–బండ్లమోటు–దుర్గి మధ్య 54 కిలోమీటర్లు, సత్తెనపల్లి–మడిపాడు మధ్య 53.9 కిలోమీటర్లు, సకిరికల్లు– గురజాల మధ్య 44.18, వినుకొండ నుంచి ప్రకాశం జిల్లా పొదిలి వరకూ 56.14 కిలోమీటర్ల మేర రహదారులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు.
● మొదటి రెండు దశల్లో కలిపి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలో 508.24 కిలోమీటర్లు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. ఆయా రోడ్లలో ప్రస్తుతం ఎంత ట్రాఫిక్ ఉంది.. భవిష్యత్‌లో ఎంత పెరుగుతుంది.. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు కాకుండా ఇతర వాహనాలు ఎన్ని వెళ్తాయి.. ఎంత టోల్ వసూలు అవుతుంది.. కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు అవుతుందా? కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెల్లించాల్సి వస్తుందనే అంశాలపై ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేస్తున్నారు.
● తెనాలి, బాపట్ల రూట్లలో గిట్టుబాటు అయినా పర్చూరు రూట్ గిట్టుబాటు కాదని చెబుతున్నారు.
● ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉన్న రోడ్ల నిర్వహణకు కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా లేదా ? అనే అంశాలపై కూడా ఆర్ అండ్ బీ అధికారులు లెక్కలు కడుతున్నారు. ఏది ఏమైనా ప్రజల నుంచి టోల్ వసూలు చేసి వారి నడ్డి విరవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
రోడ్డెక్కితే ‘టోల్’ తీతే !
ఉమ్మడి గుంటూరులో మొదటి దశలో మూడు రోడ్లు రెండో దశలో ఏడు రోడ్లు పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం అమలులోకి వస్తే ఏ ప్రధాన రోడ్డుపైకి వచ్చినా టోల్ కట్టాల్సిందే... రోడ్ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment