కూటమి అరాచకాలపై పోరాటం ఆగదు
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
నగరంపాలెం: వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై పోరాటం ఆగదని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలిపారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై, వైఎస్సార్ కుటుంబంపై, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, కార్యకర్తలపై కూటమి పెద్దలు పెడుతున్న అసభ్యకరమైన పోస్టులపై ఇచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు ఎంత వరకు చేపట్టారనేది తెలుసుకునేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆధారాల సహా ఫిర్యాదు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ట్వీట్ చేసిన రాష్ట్ర మంత్రి లోకేష్‌పై, తనపై ట్వీట్ చేసిన శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇంటూరి కిరణ్‌ను రోజులు తరబడిగా పోలీస్‌స్టేషన్లకు తిప్పుతున్నారని, అతని గుండెకు స్టంట్, కాళ్లల్లో రాడ్లు ఉన్నాయని తెలిపారు.
ఇవి బూతులు కాదా ?
గతంలో మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెత్త నా..కొ.. అనలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కాపు ఎమ్మెల్యే నా..కొ..లారా చెప్పులతో కొడతానని ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించ లేదా..ఇవీ బూతులు కాదా ? అని అంబటి ప్రశ్నించారు. ప్రముఖ దర్శకులు రాంగోపాల్‌వర్మ చంద్రబాబు, లోకేష్‌లపై వ్యంగంగా పోస్ట్‌లు పెట్టారని ఏపీలోని పలు ఫీఎస్‌ల్లో ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ఇది తగదని హితవు పలికారు.
రెడ్‌బుక్ రచయిత లోకేష్
చాలా మంది పుస్తకాలు రాశారని, రెడ్‌బుక్ రాసిన మంత్రి లోకేష్ రెడ్‌బుక్ రచయితగా నిలిచారని ఎద్దేవా చేశారు. త్వరలో రెడ్‌బుకే మంత్రి నారా లో కేష్‌కు శాపంగా మారనుందని జోస్యం చెప్పారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప–2ను ఎవ్వరూ ఆపలేరని అన్నారు. గతంలో నందమూరి కుటుంబం కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆపగలిగారా ? అని ప్రశ్నించారు. మిర్చియార్డు మాజీ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నగర అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), కార్పొరేటర్లు బూసి రాజలత, ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), మహమూద్, అబీద్, లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment