విశ్వాసంతో ప్రార్థిస్తే కష్టాలు దూరం
రెంటచింతల: నిండు విశ్వాసంతో క్రీస్తును ప్రార్థిస్తే కష్టాలు దూరం అవుతాయని కడప పీఠం అపోస్తలిక పాలనాధికారి డాక్టర్ గాలి బాలి అన్నారు. ఏసుక్రీస్తును సమస్త మానవాళిని రక్షించుటకు యెహోవాకు కానుకగా కన్య మరియ సమర్పించిందని పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కానుకమాత చర్చి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ యేరువ లూర్ధుమర్రెడ్డి నేతృత్వంలో గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య, నల్గొండ పీఠం విశ్రాంత పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ గోవిందు జోజి, ఫాదర్లతో కలిసి కానుకమాత చర్చి 175వ తిరునాళ్ల మహోత్సవ సమష్టి దివ్యపూజాబలిలో భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏసు ప్రభువులోని మహిమ, తేజస్సును విశ్వాస దృష్టితోనే చూడగలమన్నారు. కతోలికులు క్రీస్తు సూక్తులను ఆచరిస్తూ ఇతరులపై ప్రేమ, దయ, కరుణ చూపుతూ జీవించాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న సమస్యలకు శాంతి సమాధానాలే పరిష్కార మార్గాలని తెలిపారు. పలు ప్రాంతాలకు చెందిన 74 మంది గురువులు, 53 మంది మఠకన్యలు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ గాలి బాలి, భాగ్యయ్య, గోవిందు జోజిలను ఘనంగా సన్మానించారు. సాయంత్రం 4 గంటల నుంచి కానుకమాతకు కొవ్వొత్తులను సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. గురజాల డీఎస్పీ జగదీష్ పర్యవేక్షణలో ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment