పడగ దించిన కుష్ఠు వ్యాధి
తెనాలి: కుష్ఠు వ్యాధి నిర్మూలనలో రాష్ట్రంలో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. ఏటికేడాది విస్తరిస్తూ వస్తున్న వ్యాధి గత నాలుగేళ్లుగా తగ్గిపోతుండటం ఇందుకు నిదర్శనం. ఇదే క్రమంలో తెనాలి ప్రాంతంలోనూ వ్యాధి పీడితుల నమోదు తగ్గింది. కార్యాచరణను ఇలాగే కొనసాగిస్తే, నిర్మూలనకు అవకాశం ఉంటుందన్న ఆశాభావం కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపైన్ (ఎల్‌సీడీసీ)లోనూ కేసుల సంఖ్య బాగా తక్కువగా కనిపిస్తోంది. తాజాగా మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన గత నెల 30వ తేదీ నుంచి ‘స్పర్శ’ ఆరంభమైంది. ఇందులో భాగంగా వ్యాధిపై ప్రజలకు అవగాహన సదస్సులతో పాటు సర్వే కూడా చేస్తారు.
జిల్లాలోనూ 800 కేసులు
2018 నాటికి దేశంలో కుష్ఠు వ్యాధిని నిర్మూలిస్తామని నాటి కేంద్ర ఆర్థికమంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనకు భిన్నంగా వాస్తవ గణంకాలు వెలుగుచూశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలోనూ దాదాపు 800 పైచిలుకు వెలుగుచూశాయి. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వ్యాధిగ్రస్తుల సర్వేలో ప్రత్యేక యాప్‌తో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ విధానంతో ఆశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఏటా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. తాజాగా జరుగుతున్న ఎల్‌సీడీసీ సర్వేలోనూ కేసులు తగ్గుముఖం పట్టిన దాఖలాలు కనిపించాయి. తెనాలి యూనిట్ పరిధిలో (కొలకలూరు, ఈమని, దుగ్గిరాల, మున్నంగి పీహెచ్‌సీలు) 2022–23లో 27 కేసులు, 2023–24లో 28 కేసులు రాగా, 2024–25లో ఇప్పటివరకు కేవలం 25 కేసులే ఉన్నాయి. మరో 83 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరిని మరోసారి సంబంధిత అధికారులు పరీక్షించి వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స చేస్తారు. గజ్జి, తామర, సోబి, నల్లమంగు, విటమిన్ లోపంతో వచ్చే మచ్చలైతే అవసరమైతే మందులు ఇస్తామరని డెప్యూటీ పారామెడికల్ అధికారి జె.శ్యామ్ వెల్లడించారు.
బాక్టీరియా క్రిమి కారణం
‘లెప్రే బ్రాసిలే’ అనే బాక్టీరియా క్రిమి కారణంగా కుష్ఠు వ్యాధి సంక్రమిస్తుంది. క్షయ వ్యాధికారక క్రిమి కూడా ఈ తరహాకు చెందినదే. ఈ రెండింటినీ అక్కాచెల్లెళ్లుగా చెబుతుంటారు. క్రిమి మనిషి శరీరంలోకి ప్రవేశించాక, వ్యాధి బయటపడేందుకు, సంబంధిత మనిషిలోని రోగనిరోధక శక్తి ఆధారంగా ఐదు నుంచి 30 సంవత్సరాలు పట్టొచ్చు. శరీరంపై తెల్లమచ్చలతో వ్యాధి లక్షణాలు మొదలవుతాయి. చేతులు, కాలివేళ్లు, మూతివంకర్లు పోవడం నుంచి పుండ్లు ఏర్పడి, వేళ్లు కోల్పోవటం వరకు తీవ్రత ఉంటుంది. చివరకు అంగవైకల్యానికి దారితీస్తుంది.
అందుబాటులోకి ప్రత్యేక యాప్
జిల్లా కేంద్రంలో ఓ యూనిట్‌ను ఉంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేశారు. కుష్ఠువ్యాధి కేసును ఇతర సంస్థలు గుర్తించినా, పీహెచ్‌సీకి అప్పగించాల్సిందే. దీంతోపాటు జాతీయ కుష్ఠునిర్మూలన కార్యక్రమం–ఏపీ పేరుతో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను 2020లో అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో ముందుగా ఆఫ్‌లైన్‌లో చేసి, వివరాలను ఆన్‌లైన్ చేసేవారు. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో ప్రత్యేక యాప్‌తో నేరుగా ఒకేసారి ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహించడం మొదలుపెట్టారు. నేడు అదే విధానం కొనసాగుతోంది.
తగ్గుతున్న కేసులు ఎల్‌సీడీసీ సర్వేలో వెల్లడి తాజాగా ‘స్పర్శ’ ఆరంభం వ్యాధిపై ప్రజలకు అవగాహన సదస్సుల నిర్వహణ
సంజీవనిలా ఎండీటీ చికిత్స
ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1980లో దేశవ్యాప్తంగా కుష్ఠు నిర్మూలనను చేపట్టింది. మురికివాడలు సహా ఇంటింటి సర్వే చేసింది. లక్షణాలు కనిపిస్తే నమోదు చేసుకుని అక్కడే ‘మోనోథెరపీ’ అనే మందును ఇచ్చేవారు. దీనిస్థానంలో 1986లో బహుళ మందుల చికిత్స (ఎండీటీ) విధానం సంజీవనిలా వచ్చింది. ప్రభుత్వ లెప్రసీ యూనిట్లు, మోరంపూడి వద్ద గల గ్రెటనాల్టస్ వంటి సంస్థలు ఇందులో చురుకుగా పనిచేశాయి. 2003 నాటికి వ్యాధి నిర్మూలన జరిగిందనీ, 10 వేలమందికి ఒకరు కూడా బాధితులు లేరనే భావనతో ప్రభుత్వం కార్యాచరణను తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment