వీణ విద్వాంసుడు ఫణి నారాయణకు పురస్కార ప్రదానం
గుంటూరు ఎడ్యుకేషన్: బృందావన్ గార్డెన్స్‌లోని పద్మావతి కల్యాణ వేదికపై రామరాజు ఫౌండేషన్, రామరాజు ఇన్‌ఫ్రా డెవలపర్‌ల నిర్వహణలో వాణీ ఝురి కార్యక్రమాన్ని నిర్వహించారు. రామరాజు శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నరసింహారావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. తొలుత ఆర్.లక్ష్మీశ్రీనివాస్ వీణ కచేరీతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఏ.భారతీదేవి, బి. వంశీకృష్ణ, అయ్యగారి సత్యప్రసాద్, కె. శశిధర్, కె.హేమలక్ష్మి, ఎస్వీఎస్ కేఎస్.గోవిందరాజన్, బి.మధు రిమల వీణ కచేరీలు శ్రావ్యంగా జరిగాయి. వీరికి మృదంగంపై బి.సురేష్ బాబు, బి. శ్రీరామ్, కె.అరవింద్, ఎం.హరిబాబు, కె.అనిల్‌కుమార్, ఆర్.బాలాదినకర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. ప్రధాన కచేరీలో భాగంగా ప్రముఖ వీణ విద్వాంసులు ఫణినారాయణ కచేరీ నిర్వహించారు. వీరికి మృదంగంపై ఎస్.రఘునందన్, హైదరాబాద్ ఘఠంపై హరిబాబు వాయిద్య సహకారం అందించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రామరాజు శ్రీనివాస్ దంపతులతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్యలు ఫణి నారాయణను ఈమని శంకరశాస్త్రి స్మారక పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఫణి నారాయణ మాట్లాడుతూ విశేషమైన వసంత పంచమి రోజు వైణిక కార్యక్రమాలను నిర్వహించి, సత్కరిస్తున్న సంస్థ వారిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment