No Headline - | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Jun 24 2024 1:44 AM | Last Updated on Mon, Jun 24 2024 1:44 AM

No He

సాక్షిప్రతినిధి, వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌ నగరం వేగంగా విస్తరిస్తోంది. అందుకు అనుగుణంగానే కట్టడాలు ఊపందుకున్నాయి. ఇదే అదునుగా కొందరు దోపిడీకి తెర లేపారు. అవసరమైన వివరాల ను బహిర్గతం చేయరు. అదేమంటే సాకులు చెబుతారు. ఇల్లు కడదామని ఇటుకేస్తే నిబంధనలంటూ వాలిపోతారు. కాసులిస్తే మాత్రం వారే దొడ్డిదారులు చూపుతారు. వసూళ్లే పరమార్థంగా పారదర్శకతకు నిలువునా పాతరేశారు. వరంగల్‌ నగరవాసుల నుంచి ముక్కుపిండి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. ట్రైసిటీలోని వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో జరుగుతున్న ఈ తంతుపై గృహనిర్మాణ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలోని కొందరు అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువలా వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలే అస్త్రాలు..

తప్పులే వసూళ్లకు మార్గాలు..

గృహనిర్మాణదారులందరికీ నిబంధనలపై అవగా హన ఉండదు. ఇల్లు కట్టుకుందామనుకునే వారు ఎక్కడో ఒకచోట తప్పులు చేయడం సహజం. వీటి ని ఆసరాగా చేసుకుని అధికారులు, సిబ్బంది దండుకుంటున్నారు. ఈవ్యవహారంలో కొందరు కార్పొరేటర్లు కూడా వాటాలు అందుకుంటున్నారు. గృహా లు విస్తరించిన ప్రాంతాల్లో నిర్మాణాలకు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో నిర్మాణాలకు ఫీజుల్లో తేడాలున్నాయి. అవేమీ వారికి పట్టవు. నిబంధనల ప్రకారం అభివృద్ధిచెందని చోట ఇల్లు నిర్మించే వారు స్థలం విలువపై 14శాతం అదనంగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆ పరిధిలో ఏ సర్వే నంబర్లు ఉన్నాయనేది సామాన్యులకు తెలియదు. వాటి వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించవు. ఉంచాల్సిన యంత్రాంగమేమో ఏదోఒక సాకు చూపుతూ దాదాపు నాలుగేళ్లుగా అందుబాటులో ఉంచడం లేదు. ముడుపులిచ్చిన వారికి మాత్రం ఆ రుసుంలో మినహాయింపు ఇస్తారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులు, కార్పొరేటర్లు, లైసెన్సుడ్‌ ఇంజినీర్ల మధ్యవర్తి త్వాలతో ఇవన్నీ తెరచాటున చక్కదిద్దుతారు. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం స్థల క్రమబద్ధీకరణ చేపట్టి న చోట భవనం నిర్మిస్తే అక్కడి విలువలో 33శాతం అదనంగా చెల్లించాల్సి ఉంది. ఇందులోనూ అధి కా రులు చేతివాటం ప్రదర్శిస్తూ చెల్లించే అవసరం లేకుండానే పనులు చేసి లబ్ధి పొందుతున్నారు.

అంతటా అ‘ధన’పు వసూళ్లు..

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో జి+ప్లస్‌ 12 అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తారు. కానీ అత్యధికంగా జి+ప్లస్‌ త్రి, జి+ప్లస్‌ 5 భవనాలు, అపార్టుమెంట్‌లే నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలకు పదిహేను మీటర్లు, ఆపై ఎత్తులో నిర్మించే వాటికి ముందువైపు మూడు మీటర్లు, మిగిలిన మూడు వైపులా 1.5 మీటర్లు స్థలం విడిచిపెట్టాలనేది నిబంధన. రోడ్డు 30 అడుగులు ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లు ప్లాన్‌లో చూపుతారు. అనధికారికంగా అదనపు ఫ్లోర్‌లు నిర్మిస్తున్నారు. అనధికారిక ప్లాట్‌కు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ రాబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇవే ఆరోపణలపై వరంగల్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. భవన నిర్మాణ అనుమతుల్లో కొన్నింటిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు చేసి ఆ ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తర్వాత అఽధికారులు ప్రకటించారు. ఆతర్వాత ఇటీవల భువనగరి–ఆరెపల్లి బైపాస్‌రోడ్డు, దేవన్నపేట, వరంగల్‌ ఉర్సుగుట్ట, హనుమకొండ నయీంనగర్‌, సుబేదారి, బస్టాండ్‌ ఏరియా, నక్కలగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో వాణిజ్య కట్టడాలు, విల్లాస్‌ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి పెద్దమొత్తాల్లో చేతులు మారినట్లు సమాచారం. కార్పొరేషన్‌కు రావాల్సి న ఆదాయాన్ని కూడా పక్కదారి పట్టించి అధికారులు లబ్ధి పొందుతున్నారని రెండ్రోజుల క్రితం ఏసీబీ అధికారులకు మళ్లీ ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు మాత్రం తమకు ఫిర్యాదులందితే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఏసీబీ అధికారులు మాత్రం జీడబ్ల్యూఎంసీలో వసూల్‌రాజాలపై దృష్టిపెట్టినట్లు టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని కొందరు చర్చించుకుంటున్నారు.

సాకులు చూపుతూ

అనుమతుల ఫైళ్లు దాచివేత

చేతులు తడిపితే చాలు

దొడ్డిదారులు బార్లా..

కార్పొరేటర్ల సిఫారసులకూ

అధికారుల వత్తాసు

అక్రమాలకు కేంద్రంగా

పట్టణ ప్రణాళికా విభాగం

‘గ్రేటర్‌’లో వివాదాస్పదంగా

కొందరు అధికారుల తీరు

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline
1/1

No Headline

Advertisement
 
Advertisement
 
Advertisement