ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ

Published Tue, Nov 26 2024 1:08 AM | Last Updated on Tue, Nov 26 2024 1:08 AM

ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ

ఆక్రమణలపై ఫిర్యాదుల వెల్లువ

వరంగల్‌ అర్బన్‌: అనుమతులు లేని భవన నిర్మాణాలు, ప్లాన్‌కు విరుద్ధంగా, స్థలాల కబ్జాలకు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, కనీసం తనిఖీ చేయడం లేదని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు ఫిర్యాదులు చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రీవెన్స్‌కు 88 ఫిర్యాదులు అందగా.. అందులో టౌన్‌ప్లానింగ్‌ విభాగానికి 42 ఫిర్యాదులు వచ్చాయి. కాలనీల్లో మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలపై వినతులు సమర్పించారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, సకాలంలో పరిష్కారించాలని కమిషనర్‌ అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. కాగా.. ఇంజనీరింగ్‌ సెక్షన్‌కు 21, ప్రజారోగ్య విభాగానికి 12, పన్నుల సెక్షన్‌కు 9, టౌన్‌ ప్లానింగ్‌కు 42, తాగునీటి సరఫరాకు 3, ఉద్యాన వన విభాగానికి–1 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, హెచ్‌ఓ రమేశ్‌, బయాలజిస్ట్‌ మాధవరెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్‌ లింగం, సెక్రటరీ అలివేలు, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు కృష్ణారెడ్డి, ప్రసన్నరాణి, ఎంహెచ్‌ఓ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● గవిచర్ల క్రాస్‌ రోడ్డు 19–10–187 రోడ్డు అమృత్‌ నల్లా కనెక్షన్ల కోసం తవ్వకాలు జరిపి వదిలేశారని, అధ్వానంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని కొత్త రోడ్డు వేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● వరంగల్‌ కీర్తినగర్‌లో రెండో రోజులకోసారి నల్లా నీరు వస్తోందని, కొందరు మోటార్లు పెట్టడంతో చివరి ఇంటి వరకు నల్లా నీరు అందడం లేదని పరమేశ్వర్‌ విన్నవించారు.

● వరంగల్‌ 16వ డివిజన్‌లో కొన్నేళ్లుగా రోడ్లు, డ్రెయినేజీ లేదని.. నిర్మించాలని కొత్త శివబాలరాజు కోరారు.

● 42వ డివిజన్‌ తెలంగాణ కాలనీలో ఇళ్ల నుంచి వెలువడే మురుగునీరు పారేందుకు డ్రెయినేజీ లేదని నిర్మించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

● ఆరేపల్లిలో ఓ వ్యక్తి ప్లాన్‌ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని, నాలుగుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కమిషనర్‌కు వినతి పత్రం అందించారు.

● కాశిబుగ్గ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం చేస్తున్నామని, లైటింగ్‌, తాత్కాలిక షెడ్లు, వాటర్‌ సౌకర్యం కల్పించాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు.

● 32వ డివిజన్‌ బీఆర్‌ నగర్‌, రాజీవ్‌నగర్‌లో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● 41వ డివిజన్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనుల్ని అసంపూర్తిగా వదిలేశారని, పూర్తిగా నిర్మించాలని వలుపదాసు కృష్ణ విన్నవించారు.

● జాన్‌పాకలో సీసీ రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని చర్యలు తీసుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేశారు.

● కొత్తవాడ 23వ డివిజన్‌లోని 11–25–938 నుంచి 956 వరకు డ్రైయినేజీ లేకపోక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్‌ అడెపు స్వప్న వినతి పత్రాన్ని అందజేశారు.

● వరంగల్‌ శివనగర్‌ మైసయ్య నగర్‌లో వీధిలైట్లు వెలగడం లేదని వెంటనే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.

● అండర్‌రైల్వే గేట్‌లోని 31, 38, 39, 41 డివిజన్లకు మైసయ్య నగర్‌లోని దళిత శ్మశాన వాటికలో వసతులు కల్పించాలని పలు కాలనీవాసులు రఖాస్తు అందచేశారు.

● గొర్రెకుంట మధర్‌ థెరిస్సా కాలనీలో బస్‌ షెల్టర్‌ నిర్మించాలని కాలనీ ఐక్యత సేవ సంఘం ప్రతినిధులు విన్నవించారు.

● హనుమకొండ లష్కర్‌ బజార్‌–8లో సీసీ రోడ్డు నిర్మాణం 25 శాతం నిర్మించి వదిలేశారని, మిగిలిన రోడ్డు నిర్మించాలని కుముదుసీసింగ్‌ వినతిపత్రాన్ని అందజేశారు.

● హనుమకొండ యాదవనగర్‌ 3–9–275 ప్రాంతంలో డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విన్నవించారు.

● 17వ డివిజన్‌ ఆదర్శనగర్‌లో ఇంటి నంబర్లు ఇవ్వాలని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.

● 61వ డివిజన్‌ సిద్ధార్థనగర్‌ కాలనీలో బల్దియా స్థలంలో పిల్లల పార్కు నిర్మించాలని సిద్ధార్థ నగర్‌ వేల్పేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

మౌలిక సదుపాయాలు కల్పించాలి

గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో దరఖాస్తుల స్వీకరణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement