శివార్లకు ‘మెట్రో’ జోష్!శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరాన్ని మెట్రో రైలు మరింత పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే పనులు వేగంగా కొనసాగుతుండగా మరిన్ని మార్గాల్లో మెట్రో విస్తరణపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం స్వయంగా కొత్త రూట్‌లలో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి సైతం మెట్రో కోసం వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ప్రతిపాదించిన రూట్‌లతో పాటు మరిన్ని మార్గాలకు మెట్రో రైలును విస్తరిస్తే ఔటర్ వెలుపల సైతం నగరం భారీగా విస్తరించనుంది
ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణ వల్ల జీవో 111 ప్రాంతాలకు కొత్తగా మెట్రో రైలు అందుబాటులోకి వస్తుంది. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తుక్కుగూడ వరకు మెట్రో రైలును పొడిగిస్తే ఎయిర్‌పోర్టును ఆనుకొని ఉన్న ఏరోసిటీతో పాటు తుక్కుగూడ పారిశ్రామిక ప్రాంతాలకు మెట్రో సదుపాయం లభించనుంది. ప్రభుత్వం ఇప్పటికే బీహెచ్‌ఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు విస్తరణకు ప్రతిపాదించింది. ఎల్‌బీనగర్ నుంచి నాగోల్ వరకు పూర్తి చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. కేంద్రం నుంచి నిధులు లభించకపోవడం వల్ల ఈ రెండు కారిడార్‌లపైన సమగ్ర నివేదికలు సిద్ధం చేసినప్పటికీ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. కానీ ఈ మార్గాలు కూడా పూర్తయితే బీహెచ్‌ఎల్ నుంచి పటాన్‌చెరు వరకు, ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను పొడిగించవచ్చు. దీంతో హైదరాబాద్ నలువైపులా మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. వివిధ మార్గాల్లో మెట్రో విస్తరణకు ఇప్పుడు ఉన్న అంచనాల మేరకు లెక్కలు వేసినా కనీసం రూ.25 వేల కోట్లకు పైగా కావచ్చునని నిపుణులు చెబుతున్నారు.ఒక కిలోమీటర్ మెట్రో నిర్మాణానికి రూ.200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా.
డీపీఆర్ రెడీ..
మెట్రో రైల్ కారిడార్–2లో భాగంగా ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్–లక్డీకాపూల్, ఎల్‌బీనగర్–నాగోల్ కారిడార్‌లను ఎంపిక చేసింది. వయబుల్ గ్యాప్ ఫండింగ్ పథకం కింద (వీజీఎఫ్ స్కీమ్) ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు బీహెచ్‌ఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు 26 కిలోమీటర్ల మార్గంలో 23 స్టేషన్లు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల మార్గంలో 4 స్టేషన్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు మార్గాలపైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్)కూడా ప్రభుత్వం రూపొందించింది. కానీ ఇప్పటి వరకు కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించకపోవడం వల్లనే పనులు ప్రారంభం కాలేదు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఈ రెండు మార్గాలను చేపట్టేందుకు సుమారు రూ.8453 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా. ఈ రెండు కారిడార్‌లు పూర్తి చేస్తే మరో 31 కిలోమీటర్‌లు కొత్తగా అందుబాటులోకి రానుంది. దీంతో ఎల్‌బీనగర్, నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు నేరుగా బీహెచ్‌ఈఎల్ వరకు రాకపోకలు సాగించగలుగుతారు.
తుక్కుగూడ విస్తరణకు ప్రతిపాదనలు...
మరోవైపు ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వేను అక్కడి నుంచి తుక్కుగూడ వరకు మరో 20 కిలోమీటర్‌ల వరకు పొడిగించేందుకు ప్రభుత్వం సైతం సంసిద్ధంగా ఉంది. ఈ రూట్‌పైన స్థానికంగా కూడా వినతులు వెల్లువెత్తాయి. కొత్తగా చేపట్టిన ఫాక్స్‌కాన్ వరకు మెట్రో సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ఎంతో ఊరట లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment