నాటి విమర్శకుడే... నేటి వీరాభిమాని | JD Vance once compared Trump to Hitler Now they are running mates | Sakshi
Sakshi News home page

నాటి విమర్శకుడే... నేటి వీరాభిమాని

Published Wed, Jul 17 2024 4:20 AM | Last Updated on Wed, Jul 17 2024 7:52 AM

JD Vance once compared Trump to Hitler Now they are running mates

ట్రంప్‌ రన్నింగ్‌ మేట్‌ వాన్స్‌ది ఆసక్తికర ప్రస్థానం

నిరుపేద కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన వైనం

‘‘దేవుడా! ఈ ట్రంప్‌ ఎంతటి మూర్ఖుడో!’’ 
‘‘నేనెప్పుడూ ట్రంప్‌ మనిషిని కాలేను’’ 
‘‘ఆయనంటే నాకస్సలు ఇష్టం లేదు’’

అమెరికా మాజీ అధ్యక్షుని గురించి ఆయన సొంత రిపబ్లికన్‌ పార్టీ నేత వాన్స్‌ గతంలో చేసిన వ్యాఖ్యలివి. ట్రంప్‌ను వాన్స్‌ ఎంతగా ద్వేషించారంటే, చివరికి ఆయనను అమెరికా హిట్లర్‌గా అభివర్ణించేదాకా వెళ్లారు! ట్రంప్‌ను బూతులు కూడా తిట్టేవారు. దేశ శ్రామిక వర్గానికి భవిష్యత్తుపై ఆశ, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కలి్పంచకపోతే స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ట్రంప్‌ వంటి స్వార్థపూరిత నాయకులే పుట్టుకొస్తారంటూ రిపబ్లికన్‌ పార్టీ విధానాలపైనా విమర్శలు గుప్పించేవారు.

 అలాంటి వాన్స్‌ కొన్నేళ్లుగా రిపబ్లికన్‌ పారీ్టలో ట్రంప్‌కు అత్యంత గట్టి మద్దతుదారుగా మారిపోయారు. అంతటితో ఆగకుండా తాజాగా ఏకంగా ట్రంప్‌కు రన్నింగ్‌ మేట్‌ కూడా అయిపోయారు! సోమవారం మొదలైన రిపబ్లికన్ల జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యరి్థగా వాన్స్‌ ఖరారయ్యారు!! అంతేనా... అన్నీ కుదిరితే 2028లో రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి వాన్సే అవుతారంటూ అమెరికా మీడియాలో ఇప్పటినుంచే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి... 

నిరుపేద నేపథ్యం 
ట్రంప్‌ రన్నింగ్‌ మేట్‌ అయిన 39 ఏళ్ల జె.డి.వాన్స్‌ది ఆసక్తికర నేపథ్యం. మాజీ సైనికుడు. విజయవంతమైన వెంచర్‌ క్యాపిటలిస్టు. బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచిన పుస్తక రచయిత. రాజకీయ నాయకుడు. ఇలా ఆయన వ్యక్తిత్వానికి ఎన్నో పార్శా్వలున్నాయి. వాన్స్‌ ఒహాయో మిడిల్‌ టౌన్లో అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టారు వాన్స్‌. ఆయన అసలు పేరు జేమ్స్‌ డొనాల్డ్‌ బోమన్‌. తల్లి డ్రగ్స్‌కు బానిస. వాన్స్‌ పసిపిల్లాడిగా ఉండగానే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయారు. తాత, అమ్మమ్మే ఆయన్ను పెంచి పెద్ద చేశారు. దాంతో వాళ్లనే తల్లిదండ్రులుగా పిలిచేవారు.

తన పుస్తకంలో కూడా వారి గురించి రాసుకున్నారు. ఆరేళ్ల వయసులో తల్లి మరొకతన్ని పెళ్లాడింది. ఆయన వాన్స్‌ను దత్తత తీసుకున్నారు. దాంతో తన పేరు నుంచి డొనాల్డ్‌ను తీసేసి మారు తండ్రి పేరులోని డేవిడ్‌ను కలుపుకున్నారు. ఇంటి పేరు కూడా హామెల్‌గా మారింది. పెళ్లయ్యాక తాత, అమ్మమ్మల గౌరవార్థం వారి ఇంటి పేరు వాన్స్‌ను స్వీకరించారు. అలా జేమ్స్‌ డేవిడ్‌ వాన్స్‌గా మారారు. తొలుత యూఎస్‌ మరైన్స్‌లో చేరి సైనికునిగా ఇరాక్‌లో విధులు నిర్వహించిన ఆయన తర్వాత పట్టుదలతో ఉన్నత చదువులు చదివారు.

ఒహాయో స్టేట్‌ వర్సిటీ, యేల్‌ లా స్కూల్‌కు వెళ్లారు. అనంతరం కాలిఫోరి్నయాలో వెంచర్‌ క్యాపిటలిస్టుగా చేశారు. తన అనుభవాలు, జ్ఞాపకాలకు హిల్‌బిలీ ఎలిజీ పేరిట 2016లో పుస్తక రూపమిచ్చారు. అమెరికాలోకెల్లా అత్యంత పేదరికం తాండవించే కొండ ప్రాంతానికి చెందిన తన కుటుంబ మూలాలను అందులో ఉన్నదున్నట్టు రాశారు. తమ ఇంట్లో పెద్దవాళ్లు కష్టించి పని చేయకుండా కేవలం సంక్షేమ పథకాలపై ఆధారపడి సమాజానికి భారంగా మారారని విమర్శించారు. అది బెస్ట్‌ సెల్లర్‌గా నిలవడమే గాక అదే పేరుతో హాలీవుడ్‌ సినిమాగా కూడా రూపొందింది. దానిపై ప్రశంసలతో పాటు వివాదాలూ వెల్లువెత్తాయి. ఆ పుస్తకంతో అమెరికా అంతటా వాన్స్‌ పేరు మారుమోగింది. 

సెనేటర్‌గా నెగ్గేందుకు... 
2022లో వాన్స్‌ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఒహాయో నుంచి తొలిసారి సెనేటర్‌గా గెలుపుందారు. అదంత సులువుగా జరగలేదు. ట్రంప్‌ విమర్శకునిగా ఉన్న ఇమేజీ ఆయనకు పెద్ద అడ్డంకిగా మారింది. దాంతో ఆయనపై గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేందుకు వాన్స్‌ ఏమాత్రం వెనకాడలేదు. అలా ట్రంప్‌ ఆమోదముద్ర పొంది సెనేటర్‌ అయ్యారు. యేల్‌ వర్సిటీ సహాధ్యాయి అయిన తెలుగు మూలాలున్న ఉషా చిలుకూరిని 2014లో పెళ్లాడారు. వర్సిటీ రోజుల నుంచి తన ఎదుగుదల క్రమంలో ప్రతి దశలోనూ ఆమెది అత్యంత కీలక పాత్ర అని వాన్స్‌ తరచూ చెబుతారు. 

అంతర్జాతీయ వ్యవహారాలపై... 
ట్రంప్‌ మాదిరిగానే వాన్స్‌కు కూడా అంతర్జాతీయ వ్యవహారాలపై దృఢమైన సొంత అభిప్రాయాలున్నాయి. ‘అమెరికా ఫస్ట్‌’ అన్న ట్రంప్‌ నినాదానికి ఆయన గట్టి మద్దతుదారు. వలసలు, వామపక్షవాదులే అమెరికాకు అతి పెద్ద ముప్పంటారు. గాజాతో యుద్ధం కోసం ఇజ్రాయెల్‌కు సైనిక సాయాన్ని బేషరతుగా కొనసాగించాలన్నది వాన్స్‌ వైఖరి. వ్యాపారపరంగా, ఇతరత్రా చైనాను అమెరికాకు గట్టి ప్రత్యర్థి దేశంగానే చూస్తారాయన.

అంతర్జాతీయ వర్తక నిబంధనలను పాటించకపోతే అమెరికా క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి చైనాను దూరం పెట్టాలంటూ సెనేట్‌లో ఏకంగా బిల్లే ప్రవేశపెట్టారు! గాజాకు మద్దతు గా విద్యార్థులు ఆందోళనకు దిగిన కాలేజీలకు ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని నిలిపేయాలంటూ కూడా సెనేట్లో బిల్లులు పెట్టారు. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా భారీగా నిధులు, సైనిక సాయం చేయడాన్ని వాన్స్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తారు.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మతిలేని వలస విధానాల కారణంగా బ్రిటన్‌ ఇప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి అణ్వాయుధ ఇస్లామిక్‌ దేశంగా మారింది!  – జె.డి.వాన్స్‌

ట్రంప్‌కు అపూర్వ స్వాగతం
డొనాల్డ్‌ ట్రంప్‌కు రిపబ్లికన్‌ పార్టీ జాతీయ కన్వెన్షన్‌లో అపూర్వ స్వాగతం లభించింది. హత్యా యత్నంలో గాయమైన కుడి చెవికి బ్యాండేజీతో వచి్చన 78 ఏళ్ల ట్రంప్‌ను చూసి పార్టీ ప్రతినిధులంతా భావోద్వేగానికి లోనయ్యారు. హత్యాయత్నం తర్వాత ఆయన బయటి ప్రపంచానికి కన్పించడం ఇదే తొలిసారి. సమావేశ మందిరం గుండా నడుస్తూ పిడికిలి బిగించి పైకెత్తి ‘ఫైట్‌’ అంటూ ట్రంప్‌ బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతినిధులంతా ఉత్సాహంగా ఆయనతో గొంతు కలిపారు. ట్రంప్‌ వేదికపైకి చేరుకోగానే ఆయన నామస్మరణతో హాలంతా మారుమోగిపోయింది. అనంతరం అధ్యక్ష అభ్యరి్థగా ట్రంప్‌ను లాంఛనంగా ఎన్నుకున్నారు. కన్వెన్షన్‌ను ఉద్దేశించి ఆయన గురువారం ప్రసంగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement