బైడెన్, హంటర్, నేవీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబ వ్యవహారంపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు ఆయన ఎట్టకేలకు తెర దించారు. నేవీ జాన్ రాబర్ట్స్ అనే నాలుగేళ్ల చిన్నారి తన మనవరాలేనని అంగీకరించారు. ఆ పాప తన ఏడవ మనవరాలని ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘ నా కుమారుడు హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్‌లకు 2018లో కలిగిన సంతానమే చిన్నారి నేవీ. హంటర్, లండెన్‌లు తమ కుమార్తె క్షేమం కోసం వారిద్దరి మధ్య సంబంధాలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ఆ ప్రకటనలో చెప్పారు.
ఇదేమీ రాజకీయ వ్యవహారం కాదని, కుటుంబ వ్యవహార మని స్పష్టం చేశారు. నేవీతో పాటుగా తమ మనవలు, మనవరాళ్లు అందరికీ అంతా మంచి జరగాలని తాను, జిల్ బైడెన్ కోరుకుంటున్నామని బైడెన్ పేర్కొన్నారు. నేవీ రాబర్ట్స్ పెంపకం బాధ్య తలపై తల్లి లండెన్ రాబర్ట్ కోర్టుకెక్కిన సమయంలో వారిద్దరి మధ్య సంబంధం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన కోర్టు నేవీ తండ్రి హంటర్ బైడెనేనని నిర్ధారించింది.
హంటర్ బైడెన్ 2021లో తాను రాసిన పుస్తకంలో లండెన్‌తో సంబంధం గురించి రాశారు. డ్రగ్స్‌కు బానిసగా ఉన్న సమయంలో ఆమె తన జీవితంలోకి వచ్చిందని ఆ తర్వాత ఆమెని మర్చిపోయానని ఆ పుస్తకంలో రాశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు పాప బాధ్యతను తాను కూడా తీసుకున్నానని అందులో రాసుకొచ్చారు. ఇంత జరిగినా అధ్యక్షుడు బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చిన్నారి నేవీని మనవరాలిగా స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment