కిమ్‌ సోదరి యో జోంగ్‌ ఎందుకంత డేంజర్‌? ‘ది సిస్టర్‌’లో ఏముంది? | Know Reasons Behind Why North Korea Kim yo Jong Is The World Most Dangerous Woman - Sakshi
Sakshi News home page

Kim Yo Jong: కిమ్‌ సోదరి యో జోంగ్‌ ఎందుకంత డేంజర్‌?

Published Tue, Oct 10 2023 9:08 AM | Last Updated on Tue, Oct 10 2023 9:40 AM

Kim yo Jong Most Dengerious Women in The World - Sakshi

ఈ మధ్యనే ‘ది సిస్టర్’ అనే పుస్తకం వెలువడింది. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా ఎలా మారిందో ఈ పుస్తకంలో రాశారు. కిమ్ యో జోంగ్ అత్యంత క్రూరమైన మహిళ అని, ఆమెను చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మహిళ అని పిలవడం తప్పు కాదని కూడా ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌ సోదరికి సంబంధించిన మొదటి ఫొటో 90వ దశకం ప్రారంభంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించే సమయంలో బయటకు వచ్చింది. అప్పుడు ఆమె వయసు 10 సంవత్సరాలు. తాజాగా నార్త్ కొరియా మూలాలు కలిగి, అమెరికాలో ఉంటున్న రచయిత్రి సంగ్ యూన్ లీ ఓ పుస్తకం రాసి, దానిలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా కిమ్‌ యో జోంగ్‌ ఎలా మారిందో తెలియజేశారు. ఆ పుస్తకం పేరు ‘ది సిస్టర్’ ట్యాగ్‌ లైన్‌గా ‘నార్త్ కొరియా కిమ్ యో జోంగ్, ది మోస్ట్ డేంజరస్ ఉమెన్’ అని రాశారు. 

ప్రస్తుతం ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఆరోగ్యం క్షీణించడంతో సోదరి కిమ్ యో జోంగ్‌కు పాలనా పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే చర్చ తరచూ వినిపిస్తోంది. కిమ్ జోంగ్ ఉన్‌కు ఆమె ఏకైక చెల్లెలు. కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియా పాలనలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. నిరంతరం సోదరుడిని పక్కనే కనిపిస్తారు. ఇటీవల ఆమె సోదరుడు కిమ్ జోంగ్‌తో కలిసి రష్యా వెళ్లారు. అక్కడ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడంలో సోదరునికి సహాయం చేశారు.

పుస్తకం రచయిత, వుడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్ సభ్యులు సుంగ్-యున్ లీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కొరియా పాలకుని సింహాసనం ఎప్పుడైనా ఖాళీ అయితే, వెంటనే ఆమె ఈ పదవిని చేపట్టి నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. గత కొన్నేళ్లుగా ఆమె తన సోదరునికి అడుగడుగునా అండగా నిలిచారని పుస్తకంలో రాశారు. ఆమెకు తన సోదరుని ప్రతి రహస్యం తెలుసని, అతని మామ హత్యలో కనికరం లేకుండా తన సోదరునికి అండగా నిలిచారని పుస్తకంలో పేర్కొన్నారు. 

ఉత్తర కొరియా ఒక క్లోజ్డ్ సొసైటీ. దేశంలో నమ్మదగిన సమాచారాన్ని పొందడం దాదాపు అసాధ్యం. కానీ ఈ పుస్తకంలో నియంత సోదరి గురించి పరిశోధించిన  అంశాలను పేర్కొన్నారు. 2020లో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరికి కీలక బాధ్యతలు అప్పగించారని, ఆమె దేశంలోని అన్ని వ్యవహారాలను చూసుకుంటుంటున్నారని ఆ పుస్తకం తెలియజేసింది. దక్షిణ కొరియాలోని గాంగ్‌నెంగ్‌లో జరిగిన 2018 వింటర్ ఒలింపిక్స్‌లో కిమ్ యో జోంగ్ మహిళల ఐస్ హాకీ గేమ్‌లో పోటీ పడింది. దక్షిణ కొరియాలో ఆమె స్నేహపూర్వక ప్రవర్తనను చూపినప్పుడు జనం ఆమెను  చూసి గర్వపడ్డారు. 

ఈ నేపధ్యంలో ఆమెను అందరూ రాజకుమారి అని ప్రశంసించారు. అయితే అధికార పాలనలో భాగస్వామ్యం దక్కాక ఆమె తన ‘పవర్‌’ను పెంచుకుంటూ వస్తోంది. కాగా ఆమె పాంపర్డ్ లగ్జరీలో పెరిగిందని పుస్తకంలో రాశారు. ఆమెను మొదటి నుంచి నిబంధనలకు అతీతంగా పెంచారు. సోదరునిలాగే ఆమె స్విస్ బోర్డింగ్ స్కూల్‌లో కొన్నేళ్లు చదువుకున్నారు. ఆమెకు కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం ఉందని పుస్తకంలో పేర్కొన్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి కిమ్ జోంగ్ సింగపూర్ వచ్చినప్పుడు, ఆమె తన సోదరునితో పాటు అక్కడే ఉంది. కిమ్ నుంచి ఆమెకు క్రూరత్వం వారసత్వంగా వచ్చిందని పుస్తకంలో పేర్కొన్నారు. ఆమెను దేశంలోని కొందరు ‘దెయ్యం మహిళ’, ‘అహంకార యువరాణి’,‘సహ నియంత’ అని పిలుస్తుంటారు. ఉత్తర కొరియాలోని 25 మిలియన్ల మంది పౌరులు కిమ్ కుటుంబాన్ని ఆరాధిస్తుంటారని, వారు సాగించే అవినీతి గురించి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తారని పుస్తకంలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: పైసా లేకుండా జీవించడం ఎలా? 15 ఏళ్లుగా ‘మార్క్‌ బాయిల్‌’ ఏం చేస్తున్నాడు? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement