ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో అటు కెనడా.. ఇటు భారత్ దౌత్య అధికారులను దేశం విడిచివెళ్లాలని ఆదేశాలను ఇప్పటికే జారీ చేశాయి. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాది అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎందుకు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఖలిస్థానీల మద్ధతును కూడగట్టుకోవడం వంటి కొన్ని రాజకీయ సమీకరణాల కోసమే ట్రూడో ఈ చర్యలకు పాల్పడ్డారని విశ్లేషకులు అంటున్నారు.. ఇంతకు అవేంటంటే..?
ట్రూడో పాలనపై వ్యతిరేకత
కెనడాలో ప్రస్తుతం జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ కష్టకాలంలో ఉంది. ట్రూడో పాలనపై అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అబాకస్ డేటా సర్వే కూడా ఈ విషయాన్నే వెల్లడించింది. కెనడా యువత లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారట. ప్రజాభిప్రాయాన్ని సేకరించే ఆంగస్ రీడ్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ట్రూడో పట్ల కేవలం 33 శాతం మంది మాత్రమే సానుకూల వైఖరి కలిగి ఉన్నారు. దాదాపు 63 శాతం మందికి ట్రూడో పాలనపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయని సర్వే పేర్కొంది.
అటు.. భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌కి ట్రూడో పర్యటన ఆ దేశంలో విమర్శలకు దారి తీసింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా కెనడా ప్రధాని ట్రూడో భారత్‌లోనే రెండు రోజులు ఉండాల్సి వచ్చింది. దీంతో కెనడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఎంతటి దారుణానికి దిగజారిందో అర్థమవుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
ద్రవ్యోల్భణం, ధరలు..
ట్రూడో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవన నిర్మాణాల నుంచి కనీస నిత్యావసరాల వరకు అన్ని రంగాల్లో ఖర్చులు అమాంతం పెరిగాయి. ద్రవ్యోల్బణం, అధిక విదేశీయుల తాకిడి విపరీతంగా హెచ్చయింది. ఇమ్మిగ్రేషన్‌లను పెంచడం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ట్రూడో భావించాడు. కానీ కొత్తగా వస్తున్నవారితో నిరుద్యోగం, జీవన వ్యయం, సేవల కొరతతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్యలన్నింటిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రే సమర్థవంతంగా పరిష్కరించగలడని ప్రజలు భావిస్తున్నారు.
ఆ పార్టీ మద్దతు కోసమే..
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రేకు కెనడాలో రోజురోజుకు ఆధరణ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో పియర్ పోయిలీవ్రే ప్రధాని అవుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగమీత్ సింగ్ నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ మద్దతు పార్టీ ఎన్డీపీ మద్దతు అవసరమని ట్రూడో భావించాడని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీపీ 24 సీట్లు సాధించింది. మళ్లీ విజయం సాధించాలంటే ఎన్డీపీ మద్దతు కీలకమని లిబరల్ పార్టీ భావించి ఉంటుందని సమాచారం. అందుకే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై జస్టిన్ ట్రూడో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: కెనడాకు షాకిచ్చిన భారత్.. ఐదు రోజుల్లో వెళ్లిపోవాల్సిందే..
Comments
Please login to add a commentAdd a comment