నాసాతో ఎలాన్ మస్క్ భారీ ఒప్పందం.. వచ్చే దశాబ్ది తొలినాళ్లలో పని పూర్తి
వాషింగ్టన్: ప్రతి గంటన్నరకు ఒకసారి భూమి చుట్టూ తిరిగే ఫుట్‌బాల్ స్టేడియం సైజు ఉన్న ఆకాశ ప్రయోగశాల.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్) త్వరలో నీలిసంద్రంలో కూలిపోనుంది. 2030 సంవత్సరంకల్లా పాతబడిపోతున్న ఐఎస్‌ఎస్ అంతరిక్షచెత్తగా మిగిలిపోకుండా, తదుపరి ప్రయోగశాలలకు అవరోధంగా మారకుండా చూడాలని అమెరికా నాసా నిర్ణయించుకుంది. అందుకే గడువు ముగిసేనాటికి దానిని ప్రస్తుత కక్ష్య నుంచి తప్పించనుంది.
ఇప్పటికే రాకెట్ల తయారీతో అంతరిక్ష అనుభవం గడించిన కుబేరుడు ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థకు నాసా ఈ బాధ్యతను అప్పగించింది. ఇందుకోసం దాదాపు రూ.7,036 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను స్పేస్‌ఎక్స్‌కు ఇచి్చనట్లు నాసా బుధవారం ప్రకటించింది. కాంట్రాక్ట్‌లో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డీఆర్బిట్ వెహికల్(యూఎస్‌డీవీ)ను స్పేస్‌ఎక్స్ నిర్మించనుంది. అది సముద్రంలో చిన్న పడవలను లాగే/నెట్టే టగ్ బోటులా ఉంటుందని భావిస్తున్నారు.
ఐఎస్‌ఎస్ ప్రస్తుతం భూమికి 400 కి.మీ.ల ఎత్తులో తిరుగుతోంది. ఏకంగా 430 టన్నుల బరువైన ఐఎస్‌ఎస్‌ను యూఎస్‌డీవీతో నియంత్రిస్తూ దశల వారీగా దిగువ కక్ష్యలకు తీసుకొస్తూ ముందుగా నిర్దేశించిన పసిఫిక్ మహాసముద్రంలోని మారుమూల ‘పాయింట్ నెమో’ వద్ద కూల్చేయనున్నారు. ఈ ‘పాయింట్ నెమో’ సముద్రప్రాంతం నుంచి దగ్గర్లోని భూభాగానికి వెళ్లాలంటే కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణించాలి. పౌరులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదని సుదూర ప్రాంతాన్ని ఎంచుకున్నారు.
వేల ప్రయోగాలకు వేదిక
ఐఎస్‌ఎస్ నిర్మాణం కోసం తొలి భాగాలను 1998లో రాకెట్లలో తీసుకెళ్లారు. 2000 సంవత్సరందాకా దీని నిర్మాణం సాగింది. శూన్యంలో ఎన్నో భిన్న ప్రయోగాలకు ఐఎస్‌ఎస్ సాక్షిగా నిలిచింది. అమెరికా, రష్యా, కెనడా, జపాన్ తదితర దేశాలు దీని నిర్వహణ చూసుకుంటున్నాయి. 2028లో చేతులు దులిపేసుకుంటామని రష్యా చెప్పేసింది.
Comments
Please login to add a commentAdd a comment