‘యునైటెడ్ ఫర్ అమెరికా’ పేరిట టీవీ షో
పాల్గొన్న జెన్నిఫర్ లోపెజ్, జూలియా రాబర్ట్స్ తదితరులు
మిషిగన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు టీవీ లెజెండ్ ఓప్రా విన్‌ఫ్రే జత కలిశారు. ఇద్దరూ కలిసి గురువారం మిషిగన్‌లో జరిగిన ‘యునైటెడ్ ఫర్ అమెరికా’పేరిట టాక్‌షో తరహా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యక్ష ప్రసారంలో జెన్నిఫర్ లోపెజ్, క్రిస్ రాక్, జూలియా రాబర్ట్స్, మెరిల్ స్ట్రీప్‌తో సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
సంప్రదాయ మీడియాకు దూరంగా ఉండే ఓటర్లను చేరుకోవడానికి హారిస్ ఈ ప్రయత్నం చేశారు. దీన్ని ఐక్యత కోసం సాగుతున్న ఉద్యమంగా ఆమె అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ, స్త్రీల పునరుత్పత్తి హక్కులు, వలసలు తదితర కీలకాంశాలపై ఈ సందర్భంగా హారిస్ చర్చించారు. స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి 50,000 డాలర్ల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నది తన ప్రణాళికలో భాగమన్నారు.
‘‘ప్రస్తుతం ఇది 5,000 డాలర్లుంది. అంత తక్కువతో ఎవరూ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించలేరు’’అన్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ‘‘నేను తుపాకీ యజమానిని. నా రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌కు కూడా తుపాకీ ఉంది. ఎవరైనా నా ఇంట్లోకి చొరబడితే కాల్చి చంపుతా’’అని నవ్వుతూ చెప్పారు.
ట్రంప్‌తో హోరాహోరీయే గానీ...
హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ‘‘వారిద్దరూ చొరో 47 శాతంతో సమానంగా కని్పస్తున్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలో మాత్రం హారిస్ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు’’అని గురువారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్ పోల్ తెలిపింది.
కాకపోతే కమల డెమొక్రటిక్ అభ్యరి్థగా ఎన్నికైనప్పటి నుంచి సంప్రదాయ మీడియాకు దూరంగా ఉంటున్నారని, ఇది ఆమె అవకాశాలను క్లిష్టతరం చేస్తోందని విమర్శకులు అంటున్నారు. ‘‘ఆధునిక అమెరికా చరిత్రలోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అతి తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చిన అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా హారిస్, వాల్జ్ నిలిచారు. వాళ్లు కేవలం ఏడు ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే పాల్గొన్నారు’’అని ఆక్సియోస్ సంస్థ గురువారం నివేదించింది. ట్రంప్, ఆయన రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్ మాత్రం ఏకంగా 70కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment