సార్.. కూరలు బాగుండట్లే..!
మెట్‌పల్లిరూరల్: సార్.. కూరలు బాగుండట్లే.. నీళ్లునీళ్లుగా ఉంటున్నాయి.. అన్నంకు సరిపడా కూర వేయట్లేదు.. కోడిగుడ్లు ఎప్పుడో ఒకసారి పెడుతున్నారు.. మెనూ పాటించడంలేదు.. సరిగ్గా తినాలని అనిపించడం లేదు..’ అని మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం విద్యార్థులు వైద్యాధికారుల ముందు ఆవేదనను వెల్లబోసుకున్నారు. పెద్దాపూర్ గురుకులంలో జిల్లా వైద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, మెట్‌పల్లి మండల వైద్యాధికారి అంజిత్‌రెడ్డి విద్యార్థుల ఆరోగ్య సమస్యలపై ఆరా తీశారు. దగ్గు, జలుబు, ఇతర సమస్యలతో బాధపడుతున్న పలువురి రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. గురుకులంలోని సమస్యలపై ప్రశ్నించగా.. భోజనం సరిగా ఉండడం లేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆవేదనతో వంటగదిని సందర్శించిన వైద్యాధికారులు బియ్యం, కూరగాయలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? పరిశుభ్రత పాటిస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత విషయంపై విద్యార్థులు వెల్లడించిన అంశాలను నమోదు చేసుకున్న వైద్యాధికారులు కలెక్టర్ సత్యప్రసాద్‌కు నివేదించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment