కల్లు మాఫియా..! | Sakshi
Sakshi News home page

కల్లు మాఫియా..!

Published Tue, Apr 23 2024 8:20 AM

కల్లుపెట్టెలను గ్రామాలకు తరలిస్తున్న బొలెరో వాహనం  - Sakshi

మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2024

వివరాలు 8లో u

గద్వాల రూరల్‌: కల్లుదందాకు గద్వాల పెట్టింది పేరు. అధికారంలో ఎవరుంటే వారు దర్జాగా దందాను కొనసాగిస్తారు. తాజాగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఓ అడుగు ముందుకు వేశారు. తమకున్న అధికార బలంతో ఏకంగా కల్లుదుకాణం స్థానంలో ఎలాంటి అనుమతులు లేకుండా కల్లు డిపోను ఏర్పాటు చేసుకున్నారు. ఈడిపో నుంచి సమీప గ్రామాలకు అక్రమంగా కల్లు తరలిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. తమ అక్రమ సంపాదనకు ఎలాంటి అడ్డు రాకుండా అన్ని సెటిల్‌మెంట్లు చేసుకున్నారు. కల్లు దందాతో ప్రతినెలా సుమారు రూ.35 లక్షలకు పైగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు. తమకు సహకరిస్తున్న నియోజకవర్గ ముఖ్యనేత, ఆబ్కారీ శాఖలోని అవినీతి అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రహస్యంగా కొనసాగిస్తున్న అక్రమ కల్లుడిపో దందాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

రూ.లక్షలు కొల్లగొట్టేందుకు స్కెచ్‌..

రూ.6 లక్షలకు లైసెన్స్‌ ఉన్న కల్లు దుకాణాన్ని దక్కించుకున్న సదరు నాయకులు.. రూ. లక్షలు కొల్లగొట్టేందుకు పెద్ద స్కెచ్‌ వేశారు. ఆబ్కారీ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తమకున్న అధికార పలుకుబడితో ఏకంగా కల్లుడిపోను ఏర్పాటుచేసి, అక్రమ దందాకు తెరలేపారు. ఫిబ్రవరి నుంచి అక్రమ కల్లుదందా నిరాటకంగా కొనసాగుతోంది.

నిత్యం 250 కేసుల కల్లు తయారీ..

కల్లుడిపోలో నిత్యం 250 కేసుల కల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. అందులో 100 కేసుల కల్లు స్థానికంగా జమ్మిచేడులోనే విక్రయిస్తుండగా.. మిగిలిన 150 కేసుల కల్లును గద్వాల మండలంలోని చుట్టుపక్కల పల్లెలతో పాటు మల్దకల్‌ మండలంలోని రెండు, మూడు గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కల్లు కేసులను ఎలాంటి అనుమతులు లేని ఓ బొలేరో వాహనంలో దర్జాగా తరలిస్తున్నారు.

రోజుకు రూ. 1.25 లక్షల ఆదాయం..

కల్లుడిపో నుంచి విక్రయించే 250 కేసుల కల్లు ద్వారా రోజు సుమారు రూ. 1.25 లక్షల వరకు సంపాదిస్తున్నారన్నారు. ఈ లెక్కన నెలకు సుమారు రూ. 35 లక్షలకు పైగా వెనకేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో ఆబ్కారీ శాఖ అధికారులకు, కల్లుడిపో ఏర్పాటుకు సహకరించిన ముఖ్యనేతకు నెలవారీ మామూళ్ల రూపంలో సుమారు రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు అందుతున్నట్లు తెలిసింది. ఈ అక్రమ కల్లుడిపో ఆబ్కారీ శాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండటం విశేషం.

న్యూస్‌రీల్‌

ముఖ్యనాయకుడితోస్థానికుల మొర..

కల్లుడిపో ద్వారా రూ.లక్షలు సంపాదిస్తూ, తమకు ఏమాత్రం డబ్బులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని జమ్మిచేడుకు చెందిన కొందరు గద్వాల నియోజకవర్గ ముఖ్యనాయకుడితో మొర పెట్టుకోగా.. పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి పంపినట్లు తెలిసింది. అయితే నెలరోజులు గడిచినా సదరు ముఖ్యనాయకుడి నుంచి ఎలాంటి పరిష్కారం కనిపించకపోవడంతో గత ప్రభుత్వ హయాంలో కల్లుసొసైటీ నిర్వాహకుడే మేలని చర్చించుకోవడం కొసమెరుపు.

రూ. 6 లక్షలకు సెటిల్‌మెంట్‌..

జమ్మిచేడులో రెండు కల్లుదుకాణాలు కొనసాగుతుండటం.. ఆశించిన స్థాయిలో లాభాలు దక్కకపోవడంతో సదరు నాయకులు నిరాశకు గురయ్యారు. దీంతో కల్లుదుకాణాన్ని తమకు అప్పగించాలని లైసెన్స్‌ ఉన్న కల్లుసొసైటీ నిర్వాహణ దారుడితో బేరసారాలు నెరిపారు. కల్లుదుకాణ సొసైటీ నిర్వాహణ సమయం దసరా పండుగ వరకు ఉందని.. అందుకు సంబంధించిన డబ్బులు కూడా సొసైటీ సభ్యులకు ముందుగానే చెల్లించానని.. మధ్యలో సొసైటీని వదిలేస్తే ఆర్థికంగా నష్టపోతానని సదరు నిర్వాహకుడు పాతపాలెం, గోన్‌పాడు గ్రామాలకు చెందిన నాయకులతో చెప్పినట్లు సమాచారం. సొసైటీని పూర్తిగా తమకే ఇవ్వాలంటే మీకెంత ఇవ్వాలని ప్రతిపాదించి, పలుమార్లు బేరాలు కొనసాగించగా.. చివరికి రూ.6 లక్షలకు సెటిల్‌మెంట్‌ అయినట్లు తెలిసింది.

జమ్మిచేడులో కల్లు దుకాణం బదులు డిపో ఏర్పాటు

సమీప గ్రామాలకుయథేచ్ఛగా కల్లు సరఫరా

దర్జాగా అక్రమ దందాకుతెరలేపిన అధికార పార్టీనాయకులు

నియోజకవర్గ ముఖ్యనేత, ఆబ్కారీ శాఖకు పెద్దఎత్తున ముడుపులు?

సమాచారం లేదు..

జమ్మిచేడులో కల్లు దుకా ణం నిర్వహించుకునేందుకు మాత్రమే సొసైటీకి అనుమతులు ఇచ్చాం. అక్కడ కల్లు దుకాణం స్థానంలో కల్లుడిపో ఏర్పాటు చేసిన విషయం తెలియదు. దీనిపై విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. కల్లుడిపోను తొలగిస్తాం. మాకు ఎలాంటి ముడుపులు ముట్టడం లేదు.

– అరుణ్‌కుమార్‌, ఆబ్కారీ శాఖ ఈఎస్‌

1/2

2/2

Advertisement
Advertisement